కొత్తగా ఈడీసీ సిస్టం..


Tue,March 19, 2019 11:59 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి నమస్తేతెలంగాణ :ఎన్నికల సంఘం నూతన పంథాలో ముందుకు సాగుతున్నది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ సిస్టం (ఈడీసీ). ఇక నుంచి ఎన్నికల విధుల్లో పాల్గోనే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తాము విధులు నిర్వర్తించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే సదావకాశాన్ని కల్పించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఎన్నికల విధులు నిర్వర్తించే నియోజకవర్గంలో ఓటు ఉన్నవారు ఈడీసీతో, ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంపై కొద్ది రోజుల నుంచి అవగాహన కల్పిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో నియమితులైన 539 మంది పీవోలు,ఏపీవోలకు ఏఆర్‌వో, భువనగిరి ఆర్డీవో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఈ నూతన విధానంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) సిస్టం ద్వారా తాము ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రలోనే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ నూతన విధానం అమలు కానుంది.

ఈ మేరకు ఎన్నికల అధికారులు పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు (ఏఆర్వోవో)లకు ఈడీసీ కోసం దరఖాస్తు ఫారాలను అందజేశారు. పోలింగ్ రోజున ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల కోసం ఇన్నాళ్లు పోస్టల్ బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. పోలింగ్‌కు ముందే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేకునేవారు. మరో అవకాశం లేకపోవడంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్‌నే అనుసరిస్తున్నారు. ఈ సేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజున తాము డ్యూటీ చేసే పోలింగ్ కేంద్రంలోనే నేరుగా ఓటు వేసేలా ఈడీసీ విధానాన్ని రూపొందించింది.

ప్రయోగాత్మకంగా దీనిని ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించింది. ఈ విధానంపై కొద్ది రోజుల నుంచి అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన 539 మంది ప్రిసైడింగ్ అధికారు(పీవో)లు,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారు(ఏపీవో)లకు ఏఆర్‌వో, భువనగిరి ఆర్డీవో శిక్షణ ఇచ్చారు. భువనగిరిలోని ఒక ప్రైవేటు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పీవోలు, ఏపీవోలకు ఈడీసీ విధానాన్ని తెలిపారు. ఉదాహరణకు భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఓటు కలిగి ఉండి పోలింగ్ రోజున ఇదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు గానీ ఈడీసీతో తాము ఎలక్షన్ డ్యూటీ చేసే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

అధికారుల వద్ద విధులు నిర్వర్తించే వారి వివరాలు
ఎన్నికలుపోలింగ్ రోజున ఎవరెవరు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో వారి వివరాలు ఎన్నికలు అధికారుల వద్ద ఉంటాయి. వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సదరు అధికారులు, ఉద్యోగుల వివరాలను నమోదు చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్వో)గా విధులు నిర్వర్తించే స్థానిక ఆర్డీవోలు ఆ అధికారులు, ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌ను మాదిరిగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రంలోనే నేరుగా ఓటు వేస్తారు. ఈ మేరకు ముద్రించిన ఫారం నింపి ఏఆర్వోకు అందిచాలి. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందే తయారయ్యే ఈడీసీలను బ్యాలెట్ బాక్స్‌లు, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఏఆర్వోలు ఎన్నికల విధులకు వెళ్లే అధికారులు, ఉద్యోగులకు ఇస్తారు. వీటితో సదరు అధికారులు, ఉద్యోగులు తాము ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమల్లో పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఈనెల 22వ తేదీన జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు ఈడీసీలు అందజేసేందుకు కసరత్తు జరుగుతోంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎమ్మెల్సీ నియోజకవర్గంలోనూ ఈడీసీలు అందించేందుకు అధికారులు వివరాలు సేకరించారు. 22న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నందున ఒక రోజు ముందు అంటే ఈ నెల 21వ తేదీన పీవోలు, ఏపీవోలు బ్యాలెట్ బాక్స్‌లతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు బయల్దేరుతారు. అక్కడే పీవోలు, ఏపీవోలు, ఇతరులకు ఈడీసీ ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం
పొరుగున ఉన్న భువనగిరితో పాటు ఇతర లోక్‌సభ నియోజకవర్గాల్ల్లో ఓటు కలిగి ఉన్న అధికారులు, ఉద్యోగులు పోలింగ్ రోజున భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించాల్సి వస్తే పోస్టల్ బ్యాలెట్ విధానం వినియోగించుకోవాల్సి ఉండేదని ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వహించే పీవోలు, ఏపీవోలతో పాటు ఇతరుల్లో అత్యధిక శాతం మంది భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఓటు కలిగి ఉండడం విశేషం. వీరందరికీ ఈడీసీతో తాము ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం కలిగింది. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులందరికీ ఈడీసీ విధానం వర్తిస్తుంది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...