ముగిసిన బ్రహోత్సవాలు


Tue,March 19, 2019 12:46 AM

-వైభవంగా అష్టోత్తర శతఘటాభిషేకం
- రసభరితం... శృంగార డోలోత్సవం.
- యాదాద్రిలో ఉత్సవాలు పరిసమాప్తి
- పారాయణికులను సన్మానించిన ఈవో
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : మూలమంత్రాలు..పవిత్ర మంత్రభూతములైన జలము... ఫలరసములు... పంచామృతాలతో శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని అభిషేకించే అష్టోత్తరశతఘటాభిషేకం సోమవారం యాదాద్రిలో ఆగమశాస్ర్తానుసారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల దేవుడైన తిరువీధులలో ఊరేగిన యాదాద్రీశుడి ఉత్సవ పరిసమాప్తిగా అభిషేక వేడుక నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కళశములలో పంచామృతాలు, పండ్ల రసాలు, పవిత్ర జలమును ఉంచి ఆయా మంత్రములచే ఆయా దేవతలను ఆహ్వానించి ఆరాధించారు. తీర్థ రాజములతో పంచామృతములతో శ్రీస్వామివారి మూలవరులకు అభిషేకం చేశారు.

108 కలశములతో అభిషేకించడంలో ప్రత్యేకత
108 కలశములతో అభిషేకించుటలో ఎంతో ప్రత్యేకత దాగి ఉంది. ఆగమశాస్ర్తాలు ఈ సంఖ్య నిర్ధిష్టతను వివరించాయి. 25 తత్వములు, 3 గుణములు, 7 వారములు,15 తిథులు, 27 నక్షత్రములు, 4 వేదములు, 3 కాలములు, 12 నెలలు ద్వాదశాధిపత్యులు కలిపి 108గా పేర్కొనబడ్డాయి. భగవానుడి సృష్టిలోని సమస్త జీవజాలం ఈ 108లో అంతర్లీనమై ఉంది. సర్వము భగవత్ సమర్పణ గావించినపుడే పరిపూర్ణత చెందగలదని పంచామృతములు, ప్రకృతిలోని సంపద అంతా అమృతమయము కావాలని...పండ్ల రసములు రస స్వరూపుడైన భగవానునికి నిదర్శనము. పవిత్ర తీర్థములు భగవంతుడి నిజనివాస స్థానములని అవి పవిత్ర కరములు అని భగవత్ సమర్పితములైన వాటిని ప్రకృతి జీవకోటి పొందిన పరమాత్మ ఆనందములు పొందగలదని అంతరార్ధము. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేడుక బ్రహ్మోత్సవ వైభవాన్ని పెంచుతుందని భక్తుల విశ్వాసం.

పారాయణికులకు సన్మానం
బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసిన పారాయణికులను ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహామూర్తిలు ఘనంగా సన్మానించారు. ప్రభంధ, ఇతిహాస, పురాణ, వేదపఠనములు, మూలమంత్రజపములు గావించిన యాజ్ఞికులు శ్రీనివాసాచార్యులు, ఆయనతో పాటు బ్రహ్మోత్సవ సేవల్లో పాల్గొన్న జీయర్‌స్వామి శిష్యులను సోమవారం ఘనంగా సన్మానించి పారితోషికం అందజేశారు. పోలీసు, దేవస్థానం సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఈవో దోర్బల భాస్కర్, వేముల రామ్మోహన్, గజవెల్లి రమేశ్‌బాబు, పర్యవేక్షకులు గజ్వేల్ రఘు, సండ్ర మల్లేశ్ పాల్గొన్నారు.

వైభవంగా డోలోత్సవం
శ్రీవారి బాలాలయంలో శ్రీలక్ష్మీనరసింహుల శృంగారడోలోత్సవము సోమవారం రాత్రి కన్నుల పండువుగా అర్చకులు జరిపించారు. ఆలయ అర్చకులు నాదస్వర బృందం, మంగళవాయిద్యముల మధ్య లక్ష్మణాదేవి బృందములచే డోలోత్సవ కీర్తనలు, గంధము పూయరుగా... మొదలగు భక్తి ఆరాధనలచే అత్యంత భక్తి భరితంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత వేడుకగా నిర్వహించే ఉత్సవమే శ్రీ స్వామి శృంగార డోలోత్సవం మంచస్థం మధుసూదనమ్ దర్శయేత్ అని పలు పురాణాలు తెలుపుతున్నాయి. అనగా పుష్పాలంకృతడైన ఊయలలో సర్పాలంకార శోభితుడై... శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని పట్టు వస్త్రములతో అలంకరించి ఆలయ అర్చక బృందం ఈ వేడుకను నిర్వహిస్తారు. సాంప్రదాయము ఊయలలో ఊగే దంపతులు శ్రీలక్ష్మీనరసింహులను స్మరించిన, దర్శించిన సర్వశుభములు కలుగునని, సత్సంతతి, అనుకూల దాంపత్యం ఎన్నో విశేష ఫలితాలను పొందవచ్చునని వేదం పేర్కొంటుంది. నానావిధ పుష్పములతో, మాలికలతో అర్చించుచు శ్రీవారి అష్టోత్తర నామములతో నిర్వహించారు. ఉత్సవ సమాప్తి సూచకంగా ఈ వేడుక నిర్వహించడం ఆలయ సాంప్రదాయం.

భానుడి భగ...భగ
ఎండలు భగ్గుమంటున్నాయి. పెరిగిన ఎండలతో భక్తులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు మండు ఎండలో తిప్పలు పడ్డారు.
భక్తజనులకు అన్నదానం
ఆలయ సన్నిధిలో దేవస్థానం నిత్యాన్నదానం నిర్వహించింది. ప్రతిరోజు 500 మంది భక్తులకు అన్నదానం చేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రికి వచ్చే భక్తుడికి అదనంగా ఉచిత భోజన వసతి చేపట్టింది. బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి ముగిసేంతవరకు భక్తులకు అన్నప్రసాదం అందజేశామని ఈవో తెలిపారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...