పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


Tue,March 19, 2019 12:45 AM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి సమస్తేతెలంగాణ : సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టానికి సోమవారం తెరలేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఐదు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి మూడోసారి ఎన్నికలు జరుగనున్నాయి. గత ఎన్నికల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్రం నల్లగొండలో ఉండగా ఈసారి యాదాద్రిభువనగిరి నూతన జిల్లాగా ఆవిర్భవించడంతో ఇక్కడే ఏర్పాటు చేశారు. కలెక్టర్ అనితారామచంద్రన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమించారు. సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంది. 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ రోజు నామినేషన్లు ఒక్కటి కూడా దాఖలు కాలేదు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మొదటిరోజు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్‌ల కేంద్రంలో ఎలాంటి నామినేషన్‌లు దాఖలు కాలేదని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి తెలిపారు. పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధులు మొదటిరోజు కావడంతో పలు పత్రాల పరిశీలన తదితర అంశాల్లో తలమునకలై నామినేషన్‌లు సమర్పించుటకు సకాలంలో రాలేదని భావిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్‌ల పర్వంలో భాగంగా మంగళవారం నామినేషన్‌లు దాఖలయ్యే అవకాశాలున్నట్లు చెప్పారు. నామినేషన్‌ల దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16,23,145 మంది ఓటర్లు
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 16,23,145 మంది ఓటర్లున్నారు. వీరిలో 8,17,096 మంది పురుఘలు, 8,05,949 మహిళలు, 100 మంది ఇతరులున్నారు. ఓటర్లలో 40,952 మంది దివ్యాంగులున్నారు. ఎన్నికల నిర్వహణకు 2,067 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 18.67 శాతం, 5.38 శాతం ఉంది. 85.29 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 14.71 శాతం ప్రజలు నివసిస్తున్నారు. నియోజకవర్గంలో భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం, ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 2007లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, ఉమ్మడి నల్లగొండ మూడు జిల్లాలకు చెందిన శాసనసభ నియోజవర్గాలతో కలిసి ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, వరంగల్ జిల్లా నుంచి జనగామ నియోజకవర్గంతో పాటు గతంలో మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, భువనగిరి శాసనసభ నియోజకవర్గాలు కలిపారు.

ముందస్తుగా అనుమతి తప్పనిసరి
నామినేషన్లు దాఖలు చేసే సమయంలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు నిర్వహించినా ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేటప్పుడు నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే భువనగిరి జాతీయ రహదారి వెంట గల అనంతారం సర్వీస్ రోడ్డు ప్రారంభంలోనే జనాలను నిలిపివేస్తారు. అభ్యర్థులు వంద మీటర్ల లోపు తమ వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుంది. 100 మీటర్ల వరకు ర్యాలీకి అనుమతిస్తారు. కలెక్టర్ కార్యాలయం గేటు లోపలికి మూడు వాహనాలనే అనుమతిస్తారు. సువిధ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ నామినేషన్ దాఖలు చేయొచ్చు. ఫారం-26 లోని అన్ని కాలాలను పూర్తి చేయాలి. ఏ ఒక్కటి వదిలివేసిన నామినేషన్లు తిరస్కరిస్తారు. ఒక రోజు ముందు తీసిన బ్యాంక్ అకౌంట్ సమర్పించాలి.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...