ఢిల్లీలో జెండా ఎగరేద్దాం


Sun,March 17, 2019 12:04 AM

-నల్లగొండ పార్లమెంట్ స్థానం.. 3లక్షల మెజారిటీ లక్ష్యం
-ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్
-కేంద్రం సహకరించకపోయినా జిల్లాను అభివృద్ధి చేశారు
-ఢిల్లీలో కీలక స్థానంలో ఉంటే ప్రాజెక్టులకు జాతీయ హోదా
-పూర్వ జిల్లా అంతటా మూడు పంటలకు సాగు నీళ్లు ఇవ్వొచ్చు
-ఎంపీ స్థానాల్లో ఆధిక్యం కోసం అప్రమత్తంగా పని చేయాలి
- టీఆర్‌ఎస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశా నిర్దేశం
- నల్లగొండ, భువనగిరిలో 3లక్షల ఆధిక్యం : మంత్రి జగదీష్‌రెడ్డి
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లగొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ చౌరస్తాలో శనివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని, అందుకు ఉన్న అవకాశాలను వివరించారు. పలు జిల్లా అంశాలను సైతం సవివరంగా ప్రస్తావించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. పక్కనే నాగార్జునసాగర్ ఉన్నా రెండో పంటకు నీళ్లు ఇచ్చుకోలేని దుస్థితి నెలకొంది.

ఎస్సారెస్పీ ఫేజ్-2 కింద ఉన్న కోదాడ, సూర్యాపేటల్లోనూ టెయిల్ ఎండ్‌లో ఇదే పరిస్థితి. ఎస్సెల్బీసీ విషయంలోనూ తవ్విందే తవ్వితూ యుద్ధం చేస్తున్నా ముందుకు సాగకపోవడానికి కారణం.. సాంకేతికంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సవ్యంగా చేయకపోవడమే. పూర్వ నల్లగొండ జిల్లాలో నక్కలగండి, డిండి, ఎస్సారెస్పీ ఫేజ్-2, లిఫ్టుల ద్వారా జిల్లా మొత్తంను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వమని అడిగితే మూడేండ్లుగా చడీ చప్పుడు లేదు. 16మంది గులాబీ సైనికులు కేంద్రంలో ఉంటే.. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా తన్నుకుంటూ రాదా? కీలెరిగి వాత పెట్టాలె. అదును చూసి దెబ్బ కొట్టాలె. నల్లగొండ తన చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం వచ్చింది. అని పేర్కొన్నారు.

అందరూ ఐక్యంగా పని చేయాలి : కేటీఆర్
మొన్నటి శాసన సభ ఎన్నికల్లో మొత్తం నల్లగొండ పార్లమెంట్ పరిధిలో మనకు లక్ష ఓట్లకు పైగా మెజారిటీ వచ్చింది. 2014లో టీఆర్‌ఎస్‌కు 22 శాతం మాత్రమే ఓట్లు నల్లగొండ ఎంపీ పరిధిలో వస్తే.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం 47శాతం ఓట్లు వచ్చాయి. గతం కంటే 25శాతం ఓట్లు పెరిగాయి. ఎంపీ స్థానంలో మూడు లక్షల ఓట్ల ఆధిక్యం సాధిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు బూత్ స్థాయిలో పట్టుదలతో, నిబద్దతతో, కసితో పని చేయాలి. కాంగ్రెస్‌కు ఒకనాటి కంచుకోట అని చెప్పుకున్న ఈ ప్రాంతాన్ని.. మహా మహా నాయకులు తమ అడ్డా అని చెప్పుకున్న నేతలను మొన్నటి ఏ విధంగా మట్టి కరిపించారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఏప్రిల్ 11న మన సత్తా చాటాలి.

మనకు నమ్మకం ఉండాలె. విశ్వాసం ఉండాలె. అతి విశ్వాసం మంచిది కాదు. పంచాయతీ ఎన్నికల్లో చాలా చోట్ల సింహ భాగం మనమే గెలుచుకున్నం. కానీ మన వాళ్లు మన వాళ్లే తలపడ్డ పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉన్నాయి. నా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పోటీని పక్కన పెట్టండి. ఎలా కలిసి పని చేస్తం అనే బేషజాన్ని పక్కన పెట్టి.. అందరూ ఐ క్యంగా పని చేయాలి. అప్పుడే ఆశించిన ఫలితా లు వస్తాయి. జడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు కొందరు నేల విడిచి సాము చేస్తుంటారు. ఎక్కడి వాళ్లు అక్కడే కథా నాయకులై 70 శాతం పైగా ఓట్లు తెస్తే.. మూడు లక్షల మెజారిటీతో నల్లగొండ పార్లమెంట్ ఖిల్లా మీదగులాబీ జెండాఎగరేసేఅవకాశం ఉంటుంది.

అభ్యర్థి ఎవరైనా.. ఓట్లు వేసేది కేసీఆర్‌కే : కేటీఆర్
జిల్లాలోనే కాదు రాష్ట్రమంతటా మన వాళ్లు కాని వాళ్లు ఎవరూ లేరు. రైతుబంధు పథకం అందరి అందుతున్నది. నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలో 4,21,513 మంది రైతులకు పెట్టుబడి సాయం.. 2,52,727 మంది ఆసరా పించన్లు.. 16,612 మందికి కేసీఆర్ కిట్లు.. 25,121 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్.. గొర్రెల పంపిణీ ద్వారా 28,746 మందికి గొర్రెలు అందాయి. ఇంకా చెప్తూ పోతే.. ఒక్కో విద్యార్థి మీద రూ. 1.2 లక్షలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలు 38 ఏర్పాటయ్యాయి. రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. వెయ్యికి పైగా చెరువులు బాగు చేసుకున్నం. పథకాలు అమలు అంతటా ఒకేలా జరుగుతున్నా.. మెజారిటీలో వ్యత్యాసం ఉన్నది. దేవరకొండలో 38 వేలు వచ్చింది. కోదాడలో వెయ్యి మాత్రమే వచ్చింది. దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది.

మిర్యాలగూడలో 30 వేలు, నల్లగొండలో 25 వేల వరకు వచ్చింది. మిగతా చోట్ల అనుకున్నంతగా రాలేదు. హుజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడ, సాగర్‌లలో కూడా బూత్ స్థాయిలో పట్టు వదలని విక్రమార్కుల మాదిరిగా గట్టిగా పట్టు పడితే 3లక్షల మెజారిటీ సాధ్యం అవుతుంది. ఎక్కడికక్కడ టార్గెట్లు నిర్దేశించుకొని.. యుద్ధంలో సైనికుల వలె క్రమ శిక్షణతో పని చేసే దిశగా ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను సమాయత్తం చేయాలి. గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అడగాలి. రాష్ట్రంలో అందరూమన వాళ్లే. అందరికీ ముఖ్యమంత్రి కేసీఆరే. కాంగ్రెస్ నేతలకు సైతం రైతు బంధు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు సహా అన్ని పథకాలు అందుతున్నాయి. వాళ్లు మనకు ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నరు. అందర్నీ రమ్మనాలి. అభ్యర్థి ఎవరైనా.. అభ్యర్థిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా.. ఆ అభ్యర్థికి కాదు కేసీఆర్‌కు ఓట్లేస్తున్నాం అనే సంగతిని గుర్తుకు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

3లక్షల మెజారిటీతో గెలిపిస్తాం...
- గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, విద్యా శాఖ మంత్రి
మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువయినా.. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులు కక్ష పూరితమైన వాతావరణంలో రాజకీయాలు చేయడం వల్ల జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందని విద్యాశాఖ మంత్రి గుం టకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ఐదారు సార్లు గెలిచిన నాయకులున్నా చేసిన అభివృద్ధి సున్నా అని విమర్శించారు. 2014 ఎన్నికల్లోనే నల్లగొండ జిల్లాలో తమదే గుత్తాధిపత్యం అ నుకున్న వాళ్ల అంచనాలు తలకిందులు చేస్తూ పన్నెండులో ఆరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలుచుకొని టీఆర్‌ఎస్ ఆరోజే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. నాలుగున్నరేండ్ల కేసీఆర్ నాయకత్వంలో సాగిన పరిపాలన నల్లగొండ జిల్లాకు కొత్త రూపాన్ని చూపించిందని పేర్కొన్నారు. ఐదార్లు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నడూ చేయని అభివృద్ధి ఈ నాలుగున్నరేండ్లలోనే జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యేలు అంటే ఈ విధంగా ఉంటారా అనే రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండి పని చేశారని.. 60 ఏండ్లుగా ప్రజలు కోల్పోయిన వాటిని తిరిగి ప్రజలకు అందించారని చెప్పారు.

కేసీఆర్ నాయకత్వంలో పార్టీలకు అతీతంగా సాగిన పరిపాలన చూశారు కాబట్టే మేమే ముఖ్యమంత్రులం అని ఫోజులు కొట్టిన వాళ్లందరినీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపారని అన్నారు. అప్పజెప్పిన పనులన్నీ సమర్థవంతంగా పూర్తి చేస్తూ ప్రతిభను చాటుకున్నందునే కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. నల్లగొండతోపాటు భువనగిరి పార్లమెంట్ స్థానాలను రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సభకు అధ్యక్షత వహిం చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యా సాగర్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, రమావత్ రవీందర్‌కుమార్, బొల్లం మ ల్లయ్యయాదవ్, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్ కుమా ర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ పార్లమెంటరీ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చాడ కిషన్‌రెడ్డి, నిరంజన్‌వలీ, తేరా చిన్నపరెడ్డి, వేనేపల్లి చందర్ రావు, కంచర్ల కృష్ణారెడ్డి, సోమా భరత్‌కుమార్, లింగంపల్లి కిషన్‌రావు తదితరులతో పాటు మొత్తం సుమారు 25వేల మంది నాయకులు, కార్యకర్తలు సభలో పాల్గొన్నారు.

పూర్వ నల్లగొండ జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతది : కేటీఆర్
కేంద్రం వివక్షం చూపినా.. పూర్వ నల్లగొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది. యాదాద్రిని అపురూప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసినా.. దామరచర్లలో 30 వేల కోట్లతో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పెట్టినా.. నల్లగొండ, సూర్యాపేటల్లో రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవుతున్నాయి. కోదాడ-జడ్చర్ల వరకు, నకిరేకల్-మాచర్ల మీదుగా సాగుతున్న జాతీయ రహదారుల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది. కాళేశ్వరం పూర్తి చేయడం ద్వారా ఎస్సారెస్పీ ఫేజ్-2తో సూర్యాపేట, కోదాడను.. ఉదయ సముద్రం ద్వారా నల్లగొండను.. నక్కలగండిని సైతం రాబోయే ఏడాదిన్నరలోనే పూర్తి చేసి దేవరకొండ ప్రాంతంలో కరువు ఛాయలు తొలగించి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చరిత్ర పుటలకు పరిమితం చేయబోతున్నం. డిండి ద్వారా మునుగోడు, దేవరకొండ సస్య శ్యామలం కానున్నాయి. లిఫ్టుల ద్వారా మిర్యాలగూడ, సాగర్ సహా జిల్లా మొత్తం మూడు పంటలకు కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చుకునే అవకాశం మన చేతుల్లో ఉన్నది.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...