కనుల పండువగా రథోత్సవం


Sat,March 16, 2019 11:59 PM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కల్యాణ నరహరి కదలివచ్చే వేళ.. ఎదురు లేని దొరను ఎదురేగి పిలిచేము అంటూ కల్యామూర్తులు రథంలో తరలివస్తుండగా భక్తులు గోవిందా.. గోవిందా అని తన్మయత్వంతో స్థుతిస్తుండగా శ్రీవారి దివ్యవిమాన రథోత్సవం శనివారం రాత్రి కనులపండువగా జరిగింది. మొదటగా బాలాలయంలో ఆ తరువాత కొండ కింద రథాన్ని వైభవంగా ఊరేగించారు. అంతకు ముందు రథం ముందు పసుపు, కుంకుమ కలిపిన అన్నంతో బలిహరణం చేశారు. రథానికి విశేష పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరణ చేశారు. గంట పాటు రథాన్ని బాలాలయంలోనే లాగుతూ ముందుకు సాగారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తులు రథం ముందుకు లాగడానికి పోటిపడ్డారు. ఆలయ ఈవో గీత, అనువంశికధర్మకర్త నర్సింహామూర్తి తొలిపూజల్లో పాల్గొన్నారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో భక్తుల సందర్శనార్థం ప్రచార రథంలో శ్రీవారిని అధిష్టించి పట్టణ వీధుల్లో రథాన్ని ప్రారంభించారు. ప్రచార రథంలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి అడుగడుగునా మంగళ నీరాజనాలు పలికారు.

తారాజువ్వల పసిడి వెలుగుల్లో...
తమ ఇష్ట దైవం రథంలో ఆసీనులైనందున ఆనందంగా ఆడిపాడి నృత్యాలు చేశారు.. పరవశించిపోయారు.. శరణు...శరణు అని వేడుకున్నారు. ఎదురు లేని దొరను ఎదురేగి పిలిచేము అంటూ కల్యామూర్తులు రథంలో తరలివస్తుండగా లక్షలాది మంది భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. శనివారం రాత్రి శ్రీలక్ష్మీ అమ్మవారితో వివాహం జరుపుకున్న శ్రీలక్ష్మీనరసింహుడు అమ్మవారితో కలిసి తిరువీధుల్లో ఊరేగుతు భక్తులకు దర్శనమివ్వడమంటే వివాహం తరువాత జరిగే బరాత్ వేడుకను రథోత్సవంగా భక్తజన రంజకంగా నిర్వహించుకోవడమే. యాదాద్రి కొండపైన గల భవనాలపైనుంచి కాలుస్తున్న బాణా సంచా దేదీప్యమానమైన వెలుగులతో యాదాద్రికొండను తేజోవంతం చేసింది.

రథం అనగా...!
రథం అనగా శరీరమని దానిని నడిపించు సారథి పరమాత్మ అని తన అనుగ్రహము చేతనే ప్రకృతి మండలము మనుగడ కొనసాగించగలదని నశించు స్వభావము గల శరీరమున కంటే భిన్నమైన పరమాత్మ తత్వముప్రకృతి నిండా ఉన్నదని తెలియజేస్తూ భగవానుడు ఊరేగింపుగా బయలుదేరడమే రథోత్సవం.యాదాద్రిలో జరిగే ఉత్సవాలను బ్రహ్మదేవుడే సారథి అయి నిర్వహిస్తాడని పురాణాల కథనం.

బలిహరణం..
పట్టణంలోని వైకుంఠ ద్వారం నుంచి శ్రీరామ్‌నగర్ బస్‌స్టేషన్ మీదుగా ఎంపీడీవో కార్యాలయం, గుండ్లపల్లి వరకు రథోత్సవం సాగింది. తర్వాత యాదగిరిపల్లి వరకు ముందుకు సాగడంతో భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. రథంలోని ఆ పరమాత్మను దర్శిస్తే పునర్జన్మ ఉండదని నమ్మకం. రథం ఒక శరీరం, ఆ రథంలోని 24 అరలు మన ఇంద్రియాల వంటివని, రథంలో స్వామి అమ్మవారలను అధిష్ఠించిన అర మన హృదయం వంటిదని ఆభగవంతున్ని మనస్సులో ఉంచుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటే భగవంతుడు మనకు దర్శనమవుతారని పురాణాలు చెబుతున్నాయని ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహచార్యులు వివరించారు. అనంతరం స్వామి అమ్మవారలను వజ్రవైఢూర్యాలు, పలు రకాల నగలు, వివిధ రకాల పుష్పమాలికలతోముస్తాబు చేశారు. రథాన్ని విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా అలంకరించారు.

భాజాభజంత్రీలు.. కోలాటాల నడుమ..
భాజాభజంత్రీలు, మహిళల కోలాటాల నడుమ ఆలయ అర్చకుల, రుత్వికుల, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీవారి ప్రచార రథం ముందుకు సాగింది. రథాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు తహతహలాడారు. మొదటగా బాలాలయం ముందు జరిగిన రథాంగ హోమంలో ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఏఈవోలు దోర్భల భాస్కర్, వేముల రామ్మోహన్, గజ్వెల్ రమేశ్‌బాబు, మేడి శివకుమార్, డీఈఈ ఊడెపు వెంకటరామరావు, టీజీవో జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, సంస్కృతవిద్యాపీఠం ప్రిన్సిపాల్ జానకమ్మ, జి.రఘు డీ. సురేందర్‌రెడ్డి, సండ్ర మల్లేశ్, వేదాంతం శ్రీకాంత్‌తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...