కమనీయం.. రమణీయం


Sat,March 16, 2019 12:13 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : శ్రీలక్ష్మీనరసింహుల తిరు కల్యాణ మహోత్సవం కమనీయంగా, రమణీయంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు శ్రీవారికి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం బాలాలయంలో, రాత్రివేళ కొండ కింద జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో మాంగళ్యధారణ ఘట్టం కనుల పండువగా నిర్వహించారు. పండితుల వేదఘోష, హాజరైన విశేష భక్తజనం కోలాహలం నడుమ కల్యాణ తంతు జరిగింది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన స్వామివారి కల్యాణోత్సవం వీక్షించడానికి అశేష భక్తజనం హాజరైంది. విశ్వక్సేనపూజ, పుణ్యావచనం జరిపిన అనంతరం ధన, కనుక, వజ్ర, వైడూర్య ఆభరణాలు, పట్టువస్ర్తాలతో అమ్మవారిని, స్వామి వారిని అలంకరించి పాంచరాత్ర ఆగమశాస్త్రరీత్యా శాస్ర్తోక్తంగా ఆచార్యులు పెండ్లితంతును నిర్వహించారు. స్వామివారికి ఇష్టమైన గరుడవాహనంపై ఊరేగింపు సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవారల ఇరుసేవలు కల్యాణమండపం వరకు అతిరథులు ముందు నడుస్తుండగా, అమ్మవారిని, స్వామివారిని వేర్వేరు సేవలపై మంగళవాయిద్యాలు, సన్నాయిలు, బ్యాండు మేళాలు, కోలాటనృత్యాలు మార్మోగుతుండగా పటాకుల కాంతులు యాదాద్రికొండను దేదీప్యమానంగా వెలుగులీనేలా చేస్తుండగా సేవ చేరుకుంది.

తుల లగ్నంలో...
తుల లగ్నంలో శ్రీస్వామి వారికి, అమ్మవారికి వివాహం జరిపించారు. కల్యాణం అనగా వేరు వేరు రెండు తత్వములు ఒక్కటి అగుట. ఇరువురి మాటలు, ఇరువురి నడవడికలు..ఇరువురి భావనలు ఏకత్రితమై జగతికి ఆనందమును పంచుట అని అర్థం. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, నాదస్వరం, భక్తినినాదాల మధ్య పరిణయనోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల నుంచి తలంబ్రాలను సిబ్బంది సేకరించారు. కల్యాణం ముగిశాక అతిథులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు.

బుల్లితెరలతో కనువిందు...
కల్యాణ మహోత్సవాన్ని భక్తులకు దగ్గరగా, అన్ని పక్కల వారికి కనువిందు చేసేందుకు వీలుగా ఎక్కడికక్కడ క్లోజుడ్ సర్క్యూట్ సీసీటీవీలను ఏర్పాటు చేశారు. కల్యాణతంతు ఘట్టాలన్నింటినీ వీక్షించేందుకు ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. వేంకటేశ్వర భక్తిఛానల్, దూరదర్శన్, సప్తగిరి ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. చీఫ్ ఇన్పర్‌మేషన్ కమిషనర్ రాజాసదారామ్, కలెక్టర్ అనితారామచంద్రన్, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ మనోహర్‌రెడ్డి, ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహామూర్తి వేడుకల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వీవీఐపీలు, వీఐపీలు, కల్యాణం టికెటు తీసుకున్నవారికి, సాధారణ భక్తులకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కల్యాణమహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్‌కుమార్ దంపతులు, కలెక్టర్ అనితారామచంద్రన్, ఆలయ ఈవో ఎన్. గీతలు పట్టువస్ర్తాలు సమర్పించారు. యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేశ్, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.


భారీ బందోబస్తు...
బ్రహ్మోత్సవాల సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 20 మంది ఏఎస్సైలు, హెచ్‌సీలతో పాటు మొత్తం 300 మంది పోలీసు సిబ్బంది కల్యాణం సందర్భంగా బందోబస్తులో పాల్గొన్నారు.

శాంతమూర్తిగా ఉగ్రనారసింహుడు
ఉగ్రనారసింహుడు శాంతమూర్తి అయిన శ్రీరాముడి అవతారంలో శుక్రవారం ఉదయం భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకీసేవలో బాలాలయంలో శ్రీనారసింహుడు తరలివస్తుండగా అశేషమైన భక్తజనులు సేవలో పాల్గొని తరించారు. పితృవ్యాఖ్య పరిపాలకుడిగా, పరమదయానిధి ప్రతినిధిగా, మూర్తీభవించిన ధర్మస్వరూపుడిగా ఆదర్శపాత్రుడిగా ఆవిర్భవించిన అవతారమే శ్రీరామావతారం. ఆంజనేయుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కనుక శ్రీరామ అవతారమునకు శ్రీనారసింహ అవతారమునకు అవినాభావ సంబంధం ఉంది. శ్రీరామ అలంకార సేవ హనుమంత వాహనంలో ఊరేగింపు జరుపుట ఎంతో ప్రత్యేకం. వేదమంత్రాలు... రుత్వికుల పారాయణాల మధ్య మొదలైన శ్రీవారి సేవకు మహిళా భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ప్రధానార్చకుడు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలో వేదండితుల బృందం కైంకర్యాలను నిర్వహించారు. ఆలయ ఈవో గీత, అనువంశికధర్మకర్త బి.నర్సింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఉదయం హవనం...
ఉదయం ఆలయంలో హవనం జరిపారు. మూలమంత్ర జపాలు, వేదపారాయణాలు జరిగాయి. మూలవరులకు క్షీరాభిషేకం జరిపారు. అర్చనలు నిర్వహించారు. యాదగిరిగుట్ట శ్రీవైష్ణవసేవాసమాఖ్య వారిచే విస్ణుసహస్రపారాయణములు, కరావలంభస్ర్తోత్రములు, నిత్యహవనములు, పారాయణికులు నిర్వహించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...