ఎస్‌వోటీ పోలీసులపై దాడికి పాల్పడ్డ నిందితుల అరెస్టు


Sat,March 16, 2019 12:12 AM

మోటకొండూర్ (యాదగిరిగుట్టటౌన్) : అక్రమంగా నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు విధుల్లో ఉన్న ఎస్‌వోటీ పోలీసులపై కర్రలతో దాడికి పాల్పడిన 10 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశామని, ఇందులో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు ప్రధాన నిందితులు పరారీలో ఉన్నట్టు యాదగిరిగుట్ట రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. ఈనెల 9న రాజాపేట మండలం పుట్టగూడెం శివారులో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం డంప్‌ను పక్కా సమాచారంతో దాడులు చేసి స్వాధీనం చేసుకునేందుకు ఎస్‌వోటీ పోలీసులు ప్రయత్నిస్తుండగా.. 10 మంది అక్రమ బియ్యం వ్యాపారులు ఎస్‌వోటీ పోలీసులపై కర్రలతో దాడికి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారన్నారు. వీరిలో మొదటి వ్యక్తి మాడోత్తు చంటి, శ్రీకాంత్, ఉమేశ్, నాలుగో వ్యక్తితోపాటు మరో ఆరుగురైన ముడావత్ హరీ, సురేశ్, భుక్యా భాస్కర్, బానోత్తు నగేశ్, రెడ్డబోయిన ప్రభాకర్, బిమ్మనపల్లి మనోహర్, ఆంజనేయులు ఉన్నారన్నారు.

దీంతో రంగంలోకి దిగిన యాదగిరిగుట్ట పోలీసులు బృందం రాజాపేట మండలంలోని నర్సాపూర్ బస్టాంప్ వద్ద ఆరుగురుని అదుపులోకి తీసుకుని యాదగిరిగుట్ట మండలం మైలారీగూడెం పరిధిలో పోలీసులపై దాడికి వాడిన కర్రలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో ప్రధాన నిందితులైన మాడోత్తు చంటి, శ్రీకాంత్, ఉమేశ్, ముడావత్ హరి పరారీలో ఉన్నారని చెప్పారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచడం, విక్రయాలకు పాల్పడం, విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడి హత్య చేసేందుకు పాల్పడారని వివరించారు. ఈ చర్యకు పాల్పడిన 10 మందిపై హత్యాయత్నంతోపాటు వివిధ కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం వ్యాపారం చేస్తున్న వారిని ఉపేక్షించేదిలేదని, వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కేసును ఛేదించేందుకు కృషి చేసిన తుర్కపల్లి ఎస్సై వెంకటయ్య, మోటకొండూర్ ఎస్సై వెంకన్న, ఏఎస్సై సీతారామరాజు, జోజిలను అభినందించారు. అనంతరం వీరికి పారితోషికంతోపాటు సత్కరించామని సీఐ తెలిపారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...