రేపటి నుంచి పది పరీక్షలు


Thu,March 14, 2019 11:45 PM

భువనగిరి టౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. దీని కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 9,699 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. ఇందులో 4,745 మంది బాలురు, 4,951 మంది బాలికలున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొనసాగనున్నాయి. 19వ తేదీన జరిగే హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగనుంది. 22న జరగాల్సిన ఆంగ్లం పేపర్-2 పరీక్ష ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీకి మార్చారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
ఈనెల 16న ప్రారంభంకానున్న పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒకరు చొప్పున 47 పరీక్ష కేంద్రాలకు 47 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 47 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించారు. 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున మొత్తం 539 మంది ఇన్విజిలేటర్లను పరీక్షల నిర్వహణలో కోసం వినియోగించుకోనున్నారు. పోలీసు స్టేషన్‌కు దగ్గర్లో లేని మూడు సీసీ సెంటర్ల (రఘునాథ్‌పూర్, దాచారం, సర్వేల్)ల్లోని పరీక్ష కేంద్రాలకు ముగ్గురు కస్టోడియన్‌లను నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు నాలుగు ఫ్లయింగ్‌స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఫ్లయింగ్ స్కాడ్ బృందంలో ప్లయింగ్ స్కాడ్ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దారు, ఏఎస్‌ఐ ఉంటారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పరీక్ష కేంద్రాలన్నీంటిలోనూ డెస్క్ బెంచీల ఏర్పాటుతోపాటు వేసవి దృష్ట్యా ఫ్యాన్లు, మంచినీరు ఇతర మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుబాటులో వైద్య సిబ్బంది ఉంచనున్నారు.

ఒక నిమిషం నిబంధన సడలింపు..
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఒక నిమిషం నిబంధనను సడలించారు. పరీక్ష సమయం 9.30 గంటలు కాగా 9.35 వరకు విద్యార్థులను లోనికి అనుమతిస్తామని అధికారులు చెబు తున్నారు. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతిస్తారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...