ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాలి


Thu,March 14, 2019 11:42 PM

భువనగిరి రూరల్ : ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, సర్పంచ్‌ల శిక్షణ, ఎన్నికల కోడ్ నియమావళిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2019-2020 సంవత్సరానికి సంబంధిత గ్రామ పంచాయతీల్లో ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని, రాబోయే రెండు వారాల్లో పనులు పూర్తి చేయాలని, మొక్కల పెంపకంలో జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నర్సరీల పెంపకంలో ప్రభుత్వ భూవసతి లేనట్లయితే ఉపాధి హామీ గ్రామంలోని వ్యక్తుల నుంచి భూలభ్యత చేపట్టాలని సూచించారు. నర్సరీల్లో 30 శాతం అటవీ పండ్ల మొక్కలు, 10 శాతం ఇండ్లలో పెంచే మొక్కలు ఉండేలా చూడాలని, ఉద్యానవన శాఖ సహకారంతో వెదురు మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా చేపట్టే అన్ని రకాల పనులను అప్‌లోడ్ చేయాలని, దీనిపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో 75 శాతం సర్పంచ్ శిక్షణ కార్యక్రమాలు జరిగాయని, ఈనెల చివరిలోగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతుందని వివరించారు. గ్రామాల్లో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం, వీధిదీపాల నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్వహణ, వందశాతం టాయిలెట్స్ నిర్మాణంపై సర్పంచ్‌లకు పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ఈ-పంచాయతీ సాఫ్ట్‌వేర్ నిర్వహణపై సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కలిగించాలని తెలిపారు. గ్రీన్ ట్రిబ్యూనల్‌లో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో భాగంగా అర్బన్ గ్రామస్థాయిలో రూట్ మ్యాప్ నిర్వహించాలని, ఈనెల 30లోగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా చూడాలని, ప్రభుత్వ, ప్రవేట్ స్థలాల్లో ఎక్కడ కూడా ఎన్నికల ప్రచార ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు లేకుండా చూడాలని, జిల్లాస్థాయి వెబ్‌సైట్స్‌లో కూడా తొలగించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, మున్సిపల్ అర్బన్ సెక్టార్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అథారిటీ చైర్మన్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి రాములు, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ నీతూకుమారి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, జాయింట్ కలెక్టర్ రమేశ్, ఓఎస్‌డీ ప్రియాంక, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...