కోడి రామకృష్ణకు యాదాద్రితో విడదీయరాని అనుబంధం


Fri,February 22, 2019 11:28 PM

యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : రికార్డులు సృష్టించడం, ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు తీసే దర్శకుడిగా పేరు ఉన్న కోడి రామకృష్ణకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతో విడదీయరాని అనుబంధం ఉన్నది. యాదాద్రీశుడికి కోడి రామకృష్ణ పరమ భక్తుడు. ఉగ్రుడైన నరసింహుడిని నమ్ముకొని మండల దీక్షలు చేస్తే భక్తుల ఆపదలు తొలగిస్తారని.. అవసరమైన వారికి స్వామి వారు ఆపరేషన్లు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయని తెలుసుకున్న కోడి రామకృష్ణ అదే కథాంశంగా సినిమా తీయాలని నిశ్చయించుకున్నారు. యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు అంటే ఆయనకు అమితమైన ప్రేమ. గురువుగా భావించేవారు. ఆలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు గజవెల్లి రమేశ్‌బాబుతో కోడికి సన్నిహిత సంబంధాలున్నాయి. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ గోపాల్‌రావుతో రమేశ్‌బాబుకు ఉన్న పరిచయం కోడిరామకృష్ణకు ఎంతో కలిసొచ్చింది.

సంస్కృతవిద్యాపీఠం ప్రిన్సిపాల్ ఏఎం కృష్ణమాచార్యులు, ధరూరి రామానుజాచార్యుల ద్వారా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి చరిత్రను తెలుసుకున్న కోడి రామకృష్ణ స్వామివారి లీలల ఆధారంగా త్రినేత్రం సినిమా తీయగా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అందులోని శ్రీకరశుభకర ప్రణవ స్వరూపా లక్ష్మీనరసింహా అనే పాట ఇప్పటికీ హైలెట్. ఈ పాట లేకుండా యాదాద్రిలో ఏ ఉత్సవం జరుగదంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా దేవుళ్లు సినిమాలోని కొన్ని సన్నివేశాలను కోడి రామకృష్ణ యాదాద్రిలో చిత్రీకరించారు. ఆండాల్ అమ్మవారు నోచుకున్న శ్రీవ్రతానికి శ్రీరంగనాధుడు వశుడై ఆమె ప్రేమను కోరుకున్న విషయాన్ని ఆధారంగా సినిమా తీసే విషయంలో యాదాద్రిలో కోడి రామకృష్ణ చర్చలు జరిపారు. ప్రధానార్చకులు లక్ష్మీనర్సింహాచార్యులు ఈ మేరకు స్క్రిప్ట్ కూడా రాసిచ్చారు.. నిర్మాతలు కూడా ముందుకు వచ్చారు. ఈ లోగా కోడిరామకృష్ణ అస్వస్తతకు గురికావడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది.

సూపర్ డూపర్ హిట్ సాధించిన త్రినేత్రం ..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిపై తీసిన త్రినేత్రం సినిమా సూపర్‌హిట్ సాధించింది. తెలుగు చలనచిత్ర రంగంలో సంచలనాలు నమోదుచేసిన ఈ సినిమా శ్రీలక్ష్మీనరసింహుని వైభవం, మహిమలను ఇనుమడింప జేసింది. భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కోడి రామకృష్ణ ఎంతో సంబురపడిపోయారు. గతంలో ఎంతో మంది తమ సినిమాల్లో శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని కథా వస్తువుగా వాడుకున్నా త్రినేత్రంలో టైటిట్ సాంగ్‌తో పూర్తిగా ఆయన లీలలు, వైభవాన్ని గొప్ప దృశ్య కావ్యంగా మలచిన తీరు నేటికీ ఆదర్శంగానే ఉన్నది. శ్రీకర శుభకర ప్రణవస్వరూపా లక్ష్మీనరసింహ అనే పాటను ప్రత్యేకంగా జొన్నవిత్తులతో కోడి రామకృష్ణ రాయించారు. అంతేకాక యాదాద్రిలో నిర్వహిచే రాష్ట్ర స్థాయి ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలలోనూ కోడి రామకృష్ణ పాల్గొనేవారు.

కోడిరామకృష్ణ మృతిపై పలువురి సంతాపం..
కోడిరామకృష్ణ మృతిపై యాదాద్రి ఆలయ ప్రధాననార్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, ఆలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గజవెల్లి రమేశ్‌బాబు, ఆలయ ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, శ్రీవైష్ణవ సమాఖ్య అధ్యక్షులు ఎం.నర్సింహాచార్యులు, దరూరి రామానుజాచార్యులు తదితరులు సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...