ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం


Fri,February 22, 2019 11:27 PM

-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నేడు మంచి రోజులు
- వర్గాల ప్రజలను ఆదుకున్నాం
-ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
-ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
- ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందజేత
ఆలేరు టౌన్ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఉపాధి లేక.. పంట పండించేందుకు నీళ్లు లేక నిరుద్యోగులు దుబాయ్ వెళ్లారని, పెద్దవారు పట్టణాలకు వెళ్లి కూలీలుగా బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నేడు మంచి రోజులు వచ్చాయన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు అనేక కంపెనీలకు ఏకగవాక్షం ద్వారా అనుమతులు ఇచ్చి పరిశ్రమల ఏర్పాటుకు సబ్సిడీతో విద్యుత్, భూములు ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. అంతేకాకుండా కులవృత్తులను నమ్ముకొన్నవారికి ఆయా రంగాల్లో రుణాలు, సంక్షేమ పథాకాల ద్వారా వారిని సీఎం ఆదుకున్నారని చెప్పారు.

గొర్లకాపరులకు, మత్స్యకారులకు, పాడి రైతులకు సబ్సిడీపై పరికరాలు ఇస్తున్నామన్నారు. నిరుద్యోగులకు బీసీ, ఎంబీసీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వారికి సీఎం కేసీఆర్ రుణాలు అందజేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తూ సబ్సిడీని నేరుగా అందజేస్తున్నామన్నారు. యూనిట్లు పెట్టుకున్నా నిరుద్యోగులు నిజాయితీగా రుణాలు చెల్లిస్తే అనంతరం బ్యాంకులు ఎవరి గ్యారెంటీ లేకుండా వారికి భవిష్యత్‌లో రుణాలు అందిస్తాయన్నారు. ప్రభుత్వ కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని పదిమందికి ఆదర్శం కావాలని, ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. పది మందికి ఉపాధి కల్పించి సంఘంలో మంచిపేరు తెచ్చుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. ఈ సందర్భంగా 44 మందికి 50,000 రూపాయల విలువైన చెక్‌లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ క్యాసగళ్ల అనసూయ, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, వైస్ ఎంపీపీ కొరికొప్పుల కిష్టయ్య, ఎంపీటీసీలు చింతకింది మురళి, బింగి రవి, బాకి ఆనంద్, ఎండీ ఖాదర్, సూపరింటెండెంట్ వెంకటరమణ, పీవోఆర్డీ వీరాస్వామి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మెరిగాడి వెంకటేశ్, నాయకులు అడెపు బాలస్వామి, పాశికంటి శ్రీనివాసు, జూకంటి శంకర్, సరాబు సంతోశ్, క్యాసగళ్ల యాదగిరి, సీస మహేశ్వరి, మెరిగాడి ఇందిర, కటకం మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని సిల్క్‌నగర్‌లో ఆలేరు క్లస్టర్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చింతకింది వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని వాగ్దానం ఇచ్చిందని గుర్తు చేశారు. దానికి కట్టుబడి నేడు 2017లో చేనేత కార్మికులకు సంబంధించి 154 మందికి 58 లక్షల రూపాయల విలువైన చెక్‌లను అందజేస్తున్నామన్నారు.

అన్నమాట మీద నిలబడే ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సిరిసిల్ల ప్యాకేజి వర్తింపజేశారని, నైపుణ్యం లేని చేనేత కార్మికులకు వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఇక్కత్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సీఎం కేసీఆర్.. కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు బతుకమ్మ చీరల ఆర్డర్‌తో కార్మికులకు రెండుపూటలా అన్నం పెడుతున్నారని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు ఇంటిపెద్దలాగా వారి పెళ్లికి సాయపడ్తున్నారని అన్నారు. నేడు నేత కార్మికులు చల్లగా ఉన్నారంటే అది కేసీఆర్ చలవేనని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువస్తారని చెప్పారు.

అనంతరం ఇటీవల ఎన్నికల్లో ఎన్నికైన పద్మశాలీయులను శాలువా కప్పి ఆమె సన్మానించారు. చేనేత రుణమాఫీ చేసినందుకు కృతజ్ఙతగా ప్రజాప్రతినిధులకు పద్మశాలీయులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ క్యాసగళ్ల అనసూయ, జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, వైస్ ఎంపీపీ కొరికొప్పుల కిష్టయ్య, ఎంపీటీసీలు చింతకింది మురళి, బింగి రవి, బాకి ఆనంద్, ఎండీ ఖాదర్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు మెరిగాడి వెంకటేశ్, చేనేత జౌళిశాఖ ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, ఎస్‌బీఐ ప్రతినిధి వివేక్, ఆంధ్రాబ్యాంకు ప్రతినిధి శత్రు, చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు శ్యామలనర్సయ్య, కార్యదర్శి రామరుషి, డైరెక్టర్లు అంకం మల్లేశ్, దాసి లక్ష్మయ్య, పద్మ, సత్యనారాయణ, పవర్‌లూం అధ్యక్షుడు చిట్లిమల్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...