శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి


Tue,February 19, 2019 12:06 AM

భువనగిరిరూరల్ : త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్‌కుమార్ కోరారు. సోమవారం హైదరాబాద్ నుంచి జాయింట్ సీఈఓ బుద్ధప్రకాశ్‌జ్యోతితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శిక్షణ, ఇతర కార్యక్రమాలను సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు గుణాత్మకంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో నోడల్ అధికారిని నియమించి శిక్షణ కార్యక్రమాలు షెడ్యూల్, రిపోర్టింగ్ చేయాలన్నారు. ఈవీఎంల మొదటిస్థాయి పరిశీలన, సాంకేతిక సమస్యలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించినప్పుడే ఎన్నికలు సజావుగా జరుపటానికి వీలవుతుందని తెలిపారు.

జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో ఎదురైన సమస్యలను గమనించి లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ వివిధ అంశాలకు నోడల్ అధికారులను నియమించి ఈనెల 20లోగా నివేదిక పంపించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది డేటా అప్‌డేషన్, మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించాలన్నారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నందున బ్యాలెట్ బాక్సులు సరిపడ అందుబాటులో ఉంచుకోవాల న్నారు. కౌంటింగ్ సెంటర్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల సందర్భంగా సహాయ రిటర్నింగ్ ఖాళీల వివరాలను తెలియజేయాలని, ఖాళీ వివరాలను సంబంధిత శాసనమండలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు నివేదికలు తొందరగా పంపించాలన్నారు. డూప్లికేట్ ఓటర్లు లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలన్నారు. తొలగించిన పేర్లు కూడా జాబితాలో ఉండకూడదన్నారు. బూత్‌లెవల్ అధికారులకు స్పెషల్ సమ్మర్ రివిజన్ ఓటరు జాబితాను పరిశీలింపజేయాలన్నారు. ఈవీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రమేశ్, డీఆర్‌వో వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...