సగానికే పీఎం సమ్మాన్


Sat,February 16, 2019 12:08 AM

- జిల్లాలో రైతుబంధు లబ్ధిదారులు 1,81,000 మంది..
- ఎకరానికి రూ.8 వేల లెక్కన దాదాపు రూ.203 కోట్ల సాయం
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తించేది 40 నుంచి 50 శాతం మందికే..
- ఈ పథకంతో 1,02,000 మందిలోపు రైతులకే లబ్ధి
- 81,000 రైతులకు మొండిచేయి
- సంవత్సరానికి జిల్లాకుకేవలం రూ.61.20 కోట్ల సాయం అందే అవకాశం
- అర్హులైన రైతుల ఎంపిక షురూ..
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి నమస్తేతెలంగాణ : రైతుబంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సమ్మాన్ అన్నదాతలను నిరాశకు గురి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఒక విడుతలో అందించిన దాంట్లో సగము కన్నా తక్కువ మంది రైతులే పెట్టుబడి సాయం అందుకోనున్నారు. రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 1,81,000 మంది రైతులకు రెండు దఫాల్లో రూ.406 కోట్లు పెట్టుబడి సాయం అందించి దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. అదే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం సమ్మాన్‌తో అన్నదాతలకు ఒరిగేదీ ఏమీ లేదని తేలిపోయింది. పీఎం సమ్మాన్ కింద ఒక విడుతలో జిల్లాకు రూ.61.20 కోట్ల సాయం మాత్రమే అందనుంది. ఓ వేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండు విడుతలుగా నిధులు విడుదల చేస్తే మాత్రం రూ.122.40 కోట్లు జిల్లాకు రానున్నాయి.

వింత మార్గదర్శకాలు..
పీఎం సమ్మాన్ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం వింత మార్గదర్శకాలు విడుదల చేసింది. అంతేకాక రైతు కుటుంబాలను విభజించి పాలించే కార్యక్రమానికి తెర లేపింది. ఉదాహరణకు ఒక ఇంట్లో యజమాని పేర ఐదు ఎకరాలు, కుమారుడి పేర రెండు ఎకరాలు, భార్య పేరున ఎకరం, మరో కుమారుడి పేర రెండు ఎకరాలు ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తానికి పీఎం సమ్మాన్ పథకం వర్తించదని తేల్చింది. స్థానిక మండల వ్యవసాయాధికారులకు లబ్ధిదారుల ఎంపికలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. ఆధార్ అనుసంధానంతో ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు తీసుకొని ఏ కుటుంబానికి ఎన్ని భూములున్నాయని నిర్ధారించి ఎంపీ సమ్మాన్‌ను వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీంతో కొన్ని మండలాల్లో సగానికంటే ఎక్కువ మంది లబ్ధిదారుల పేర్లు తొలిగిపోయాయి. ఉదాహరణకు యాదగిరిగుట్ట మండలంలో 11,000 మంది రైతులకు రైతుబంధు అందగా..పీఎం సమ్మాన్‌లో కేవలం 4,496 మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది.

పెదవి విరుపు..
పీఎం సమ్మాన్ పథకంపై అనేక మంది రైతులు పెదవి విరుస్తున్నారు. రైతుబంధు అందుకున్న రైతుల్లో సగం మందిని మాత్రమే పీఎం సమ్మాన్‌కు ఎంపిక చేస్తుండటంతో ఈ పథకంపై అన్నదాతలు అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే తొలిరోజు వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లు తమ క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో రైతులను కలిశారు. ఐదెకరాలలోపు గల రైతుల జాబితాను వారి ముందు పెట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిబంధనలు వెల్లడించి వీరిలో అనర్హులెవరైనా ఉన్నారా అని తెలుసుకున్నారు. అంతేకాక అర్హత గల రైతుల పేర్లను పీఎం కిసాన్ సమ్మాన్ జాబితాలో చేర్చారు.

అంతంతమాత్రమే స్పందన..
పీఎం సమ్మాన్ పథకానికి అర్హులైన రైతులను అధికారులు గుర్తిస్తుండగా జిల్లాలోని రైతుల నుంచి మాత్రం స్పందన అంతంతమాత్రమే లభిస్తోంది. మొత్తంగా లబ్థిదారులు 1,02,000 దాటే అవకాశం లేకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. జిల్లాలోని పలు గ్రామాల్లో పీఎం సమ్మాన్‌కు అర్హులను ఏఈవోలు గుర్తించి కార్యక్రమం చేపట్టారు. భువనగిరి వ్యవసాయ డివిజన్‌లో స్థానిక ఏడీవో సత్యం పర్యవేక్షించారు. అర్హులైన రైతులందరికీ కచ్చితంగా ఈ పథకం వర్తించేలా ఆయన ఏఈవోలకు సూచనలు చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహణపై డీఏవో గౌస్ తమ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. రైతుబంధు పథకానికి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధం లేదని, ఈ రెండూ వేర్వేరు అన్న విషయాన్ని రైతులకు చెప్పాలన్నారు.

కఠినతరంగా నిబంధనలు..
ఎలాంటి నిబంధనలు లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధును వర్తింపజేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్‌కి అనేక నిబంధనలు విధించింది. ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న వారిలో కూడా గత సంవత్సరం ఆదాయపు పన్ను కట్టిన వారు.. వృత్తి నిపుణులైన డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్స్, ఆర్కిటెక్ట్స్ సొంత ప్రాక్టీస్ కలిగిన వారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, కార్యాలయాలు, శాఖలు, వాటి కేంద్ర, రాష్ట్ర పీఎస్‌ఈ, అనుబంధ కార్యాలయాలు, రాష్ట్రం అధీనంలోని స్వతంత్ర సంస్థలు, స్థానిక సంస్థల, ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పొందటానికి అనర్హులుగా ప్రకటించింది.

అంతే కాదు గతంలో లేదా ప్రస్తుతం ఎలాంటి రాజ్యాంగ పోస్టుల్లో విధులు నిర్వహించిన, పూర్వం, ఇప్పుడు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిలర్, కార్పొరేషన్ మేయర్ , జెడ్పీ చైర్మెన్‌గా పనిచేస్తున్న వారు ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నప్పటికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అనర్హులని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలు విడుదల చేసింది.త్వరలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్న దరిమిలా ఈ నెల 24వ తేదీలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి రైతులకు రెండు విడతల ఆర్థిక సహాయం అంటే అర్హులైన రైతుల్లో ఒక్కొకరికి రూ. 4 వేల అందజేయాలని నిర్ణయించింది. దీంతో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు అర్హులైన రైతులను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని తమ శాఖ అధికారులను ఆదేశించారు.

పీఎం సమ్మాన్‌తో లక్ష మంది రైతులకే ప్రయోజనం..
కునుమల్ల అనూరాధ, జిల్లా వ్యవసాయాధికారి
పీఎం సమ్మాన్‌తో సుమారు లక్ష మంది రైతులకే ప్రయోజనం కలుగుతుంది. రైతుబంధు పథకంతో 1,81,000 మంది రైతులు ప్రయోజనం పొందారు. రెండు విడుతల్లో సుమారు రూ. 406 కోట్ల నగదు పెట్టుబడి పొందగలిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే జాబితాలు వచ్చాయి. పీఎం సమ్మాన్‌తో రూ. 122. 40 కోట్లు రెండు దఫాలుగా వచ్చే అవకాశం ఉంది.

పీఎం సమ్మాన్ అమలు ఇలా..
పీఎం సమ్మాన్ అమలుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ తన వద్ద ఉన్న రైతుబంధు పథకం లబ్ధిదారుల జాబితాలో నుంచి ఐదెకరాల్లోపు, కుంటుంబంలో సభ్యులందరికి కలిపి ఐదెకరాలకు మించకుండా వ్యవసాయ భూమి ఉన్నవారిని గ్రామాల వారీగా గుర్తించి నేరుగా ఏఈవోల లాగిన్‌లో వేసింది. ఆయా క్లస్టర్ ఏఈవో ఈ జాబితాను ప్రింట్ తీసి గురువారం ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. మరికొందరు జాబితాలతో గ్రామాలకు వెళ్లి రైతులతో సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారం అర్హులను గుర్తించే పనిలో పడ్డారు. రెండుమూడు రోజుల్లో గ్రామాల వారీగా అర్హుల పేర్లు ఖరారు చేసి మండలం వ్యవసాయ అధికారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ సహాయ సంచాలకు (ఏడీఏ)లు, జిల్లా వ్యవసాయ అధికారి (డీవో) ఫైనల్ చేసి ప్రభుత్వానికి తుది జాబితాను పంపిస్తారు.

రైతుబంధు ఇలా..
రైతును రాజు చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. అయితే ప్రతి రైతుకు సంవత్సరంలో రెండు విడతల్లో ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి సాయం అందేలా పథకాన్ని రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు లేకుండా గత ఖరీఫ్‌లో మొదటి విడత 181,000 మంది రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పన రూ. 203 కోట్లు అందజేసింది. రెండో దశ రబీ సీజన్‌లో ఎకరానికి మరో రూ.4 వేల లెక్కన పంట పెట్టుబడి అందించడం కోసం జిల్లా నుంచి వ్యవసాయ శాఖ అధికారులు 1,81,000 మంది రైతుల పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వానికి పంపారు. వీరి పేర ఆర్థిక సహాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం తుది దశకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే జరిగిన ఎన్నికల సమయంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతుబంధు పథకం ద్వారా రైతలుకు ఒక్కో ఎకరానికి అందజేసే ఆర్థిక సహాయాన్ని రూ.10 వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రతీ ఎకరానికి వానకాలం పంట కోసం తొలి విడత రూ.ఐదు వేలు, యాసంగి పంట కోసం రెండో విడత మరో రూ.ఐదు వేల పెట్టుబడి సహాయం పొందనున్నారు.

గుట్టలో 4,496 మందికే జాబితాలో చోటు
యాదగిరిగుట్ట మండలంలో 11, 000 మంది రైతులకు రైతుబంధులో చెక్కులు అందాయి. పీఎం సమ్మాన్ జాబితాలో కేవలం 4,496 మందికి మాత్రమే జాబితాలో చోటు కల్పిస్తూ ఆదేశాలు వచ్చాయి. దీంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఒకే కుటుంబంలో ఉన్నవారి భూముల వివరాలు ముందుగానే తెలుసుకుని ఎలాంటి మార్పులు.. చేర్పులు చేయకుండా జాబితాలు సిద్ధం చేసి పంపారు.
- కంచర్ల రాజేశ్‌కుమార్, మండల వ్యవసాయాధికారి, యాదగిరిగుట్ట

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...