అసమానతలు దూరం చేసే శక్తి విద్యకే ఉంది


Wed,November 14, 2018 11:26 PM

-కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి టౌన్ : సమాజంలోని అసమానతలను దూరం చేసే శక్తి విద్యకు మాత్రమే ఉందని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇన్నర్‌వీల్, రోటరీక్లబ్, మహితా స్వచ్ఛంద సంస్థల సహకారంతో పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలను బుధవారం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులు భావిభారత పౌరులుగా ఎదుగడంతో చదువుకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. బడీడు పిల్లలందర్నీ బడిలో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇటుక బట్టీలు, గనులు, పరిశ్రమల్లో పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో పనిచేయరాదన్నారు. జిల్లాలో ఇప్పటికే వారిని గుర్తించి విముక్తి కల్పించి బడిలో చేర్పించడం జరిగిందన్నారు. యాదగిరిగుట్టలో సెక్స్ రాకెట్‌లో కూరుకుపోయిన పిల్లలను రక్షించి పాఠశాలకు పంపించే ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.

బడీడు పిల్లలందరూ విధిగా బడిలోనే ఉండేలా సామాజిక బాధ్యతగా అధికారులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసి సద్వినియోగపర్చుకునేలా తల్లిదండ్రులను అవగాహన కల్పించాల్సిన బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ అనితారామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలల బాలబాలికలకు నిర్వహించనున్న క్రీడలను క్రీడాజ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. అంతకుముందు బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి శారద, ఇన్నర్‌వీల్ క్లబ్ ప్రతినిధి డాక్టర్ జయశ్రీ, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ప్రెషర్స్ డే
మోటకొండూర్(యాదగిరిగుట్టటౌన్): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రెషర్స్ డేను బుధవారం ఉత్సాహంగా జరుపుకున్నారు. విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి రమణి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామానుజాచార్యులు, అధ్యాపకులు నర్సింహ, రాజన్న, కరుణాకర్‌రెడ్డి, జిల్లా నర్సింహ, రవిబాబు, కృష్ణయ్య, బలరాం, రాంబాబు, రమేశ్, హైమావతి, సుబ్బలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు.

149
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...