కూటమిలో కుత కుత


Sun,November 11, 2018 11:55 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న వేళ.. కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ల పపంకంపై అనుసరిస్తున్న సాగతీత ధోరణిపై ఆ పార్టీ ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా అభ్యర్థి ఎవరనే విషయం అధికారికంగా వెల్లడించకపోవడంతో అంతటా నిరాశ అలుముకున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా రెండు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తూ భాగస్వామ్య పార్టీలకు మొండి చేయి చూపడంతో మహాకూటమి నిప్పుల కుంపటిలా రాజుకున్నది. మహాకూటమి పేరిట ఎటూ తేల్చకుండా సాగదీస్తున్న తీరుపై కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమువుతున్నది. భాగస్వామ్య పక్షాలకు జిల్లాలో ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా చేయడంతో ఆ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించిన వారు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగేందుకు సమాయత్తమయ్యారు. జిల్లాలో ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్లు ఆశించిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌కు తిరిగి కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆశిస్సులతో టిక్కెట్ ఖరారు అయిందని తెలుసుకొని తమ తోవ తాము చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆది నుంచి నియోజకవర్గంలో కష్టించి పనిచేస్తున్న తమకు మొండి చేయి మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలేరు ఓసీ సీటూ.. అలాంటప్పుడు ఓసీలకే టిక్కెట్ ఇవ్వాలి.. బీసీ అయిన భిక్షమయ్యగౌడ్‌కు టిక్కెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓసీ విభాగం నుంచి టిక్కెట్ ఆశించిన చామల ఉదయ్‌చందర్‌రెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు సిద్ధమని నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ నెల 14న నామినేషన్ వేయనున్నట్లు కూడా ప్రకటించారు. బీసీలలో మాలో ఒకరికి సీటు ఇవ్వాలని మొదటి నుంచి కాంగ్రెస్ మోసిన కొంతమంది బీసీలంతా కలిసి గుంపుగా ఏర్పడి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. భిక్షమయ్యగౌడ్‌కు తప్ప ఇంకెవరికైనా సీటు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహాకూటమిలో మరొ భాగస్వామ్య పక్షమైన టీజేఎస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి కోదండరాం మాట తీసి గట్టున పెట్టి పోటీకి సిద్ధమయ్యారు.

ఆలేరులో ఎంతో ఖర్చు పెట్టాను.. ప్రజల సంక్షేమ కోసం ఎంతో పని చేశా.. కూటమి పేరుతో ఆలేరు సీటు వదులుకునేది లేదు.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలిచి మాట్లాడినా పట్టించుకోను.. ఇండిపెండెంట్‌గానైనా రంగంలోకి దిగుతానని కల్లూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తాను బరిలో ఉంటున్నట్లు ప్రకటించి నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆలేరులో 10వేల మందితో భారీ బహిరంగ సభ పెట్టాను.. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతాను. కూటమి కాంగ్రెస్‌కు టిక్కెట్ ఖరారు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తాను చూస్తు ఊర్కునేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పరిరిక్షణ వేధిక పేరుతో ఇన్నాళ్లు కష్టించి పని చేసిన తాను ప్రతిఫలం దగ్గరకు వచ్చిన సందర్భంగా ఒకరి కోసం ఊర్కునేది లేదని తెగేసి చెబుతుండటం విశేషం.

ఢిల్లీకి చేరిన భువనగిరి కాంగ్రెస్ పంచాయితీ..
భువనగిరి కాంగ్రెస్ పంచాయితీ ఢిల్లీకి చేరుకున్నది. భువనగిరి కాంగ్రెస్‌లో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికె టిక్కెట్ ఖరారు అయిందని తెలుసుకున్న బీసీ నాయకులు ఏకంగా ఢిల్లీలోనే మకాం వేసి పరిస్థితులను తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ జెండాను ఇన్నాళ్లు మోసిన తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తే ప్రత్యర్థి పార్టీలకు విజయం సుళువవుతుందని వారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెగేసి చెప్పడంతో పాటు తెలంగాణ ఇన్‌చార్జి కుంతియాను భువనగిరి నియోజకవర్గంలోని స్థితిగతులను తెలుసుకొని నివేధిక ఇవ్వాలని రాహుల్‌గాంధీ ఆదేశాలు జారీ చేసే వరకు వెళ్లింది. భువనగిరిలో బీసీ ఓటర్లు ఎక్కువని .. ఎట్టిపరిపస్థితుల్లో బీసీలకు టిక్కెట్ ఇస్తే విజయం సాధిస్తామని వారు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దాంతో బీసీల ఓటర్ల వివరాలు.. ఇతర కులాల ఓటర్ల వివరాలు సేకరించే పనిలో పడిన అధిష్టానం పనిలో పనిగా భువనగిరిలోని లొల్లి వల్ల తమకు అనవసరమైన చిక్కులు వచ్చాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌పై మండిపడినట్లు తెలిసింది. భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ బీసీ నాయకులు పోత్నాక్ ప్రమోద్‌కుమార్, గర్దాసు బాలయ్య, తంగళ్లపల్లి రవికుమార్, అందెల లింగంయాదవ్‌తో పాటు మరికొంత మంది నాయకులు ఢిల్లీలో మకాంవేసి రెడ్డి కూటమి నుంచి కాంగ్రెస్‌ను రక్షించండి అంటూ.. తెలిసిన ప్రతి నాయకుడికి వినతిపత్రాలు అందిస్తూ హల్‌చల్ సృష్టిస్తుండటంతో భువనగిరి నుంచి టిక్కెట్ ఖరారు అయిందని ఖుషీగా ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డి పరేషాన్‌లో పడినట్ల సమాచారం.

మాయాకూటమితో మహా మోసం ..
మహాకూటమి కాదు.. మాయాకూటమి మా కొంపలు ముంచుతున్నది.. ఇది మహా మోసం అంటున్న రెబల్స్‌గా రంగంలోకి దిగేందుకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పేరు ఖరారు చేశారనే సమాచారంతో కాంగ్రెస్‌లో ఒక వైపు అసమ్మతి కుంపటి రాజుకుంటున్నది. అదే విధంగా మహాకూటమి నుంచి టిక్కెట్ ఆశించిన టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, తెలంగాణ జన సమితి నేత కల్లూరి రామచంద్రారెడ్డికి నిరాశే మిగలడంతో ఇండిపెండెట్లుగా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. బండ్రు శోభారాణి యాదగిరిగుట్టలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వెచ్చించారు. కల్లూరి రామచంద్రారెడ్డి ఆలేరులో భారీ బహరింగ సభ ఏర్పాటు చేసి లక్షల రూపాయల ఖర్చు చేశారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఒకరికి కంటే మరొకరు పోటీలతో సమావేశాలు, ప్రచారాలు చేసినా మహాకూటమి మోసం చేసిందంటూ బోరుమంటున్నారు. టికెటు ఆశించిన నిరాశతో ఉన్న నాయకులు మహాకూటమికి గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గత 6 దఫాలుగా ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఈసారి ఎన్నికల బరిలోకి దిగి హల్ చల్ సృష్టిస్తున్నారు. మహాకూటమి పరిస్థితి ఇలా ఉంటే.. టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.

జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
మహాకూటమిలో విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ నాయకులకే ఇవ్వడంతో మిగతా పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. మహాకూటమిలో ఉన్నామని చెప్పుకుంటున్న టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క సీటు కూడా లభించకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కొంత మంది నేతలు ఇప్పటికే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరో వైపు యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ మరో యువనేత, గతంలో కాంగ్రెస్ తరపున పోటీ పలువురు నాయకులు పోటీ పడినా ఫలితం లేకపోయింది.
టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పరిస్థితులు..
మహాకూటమిలో లొల్లి.... టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారుతున్నది. ఇప్పటికే ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల అభ్యర్థులు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. భారీ మెజార్టీపై వారు దృష్టి సారించారు. మొదటి దశ ప్రచారం ముగిసిన సందర్భంలోనే విజయావకాశాలు మెరుగుడ్డాయి. ప్రస్తుతం రెండో దశ ప్రచారం నడుస్తున్నది. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ కుమ్ములాటలు.. మహాకూటమిని గౌరవించక తమ తోవ తాము చూసుకుంటున్న తీరుతో పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...