నేడే దీపావళి


Wed,November 7, 2018 12:33 AM

యాదాద్రిభువనగిరి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దీపావళి.. దీపాల వరుస.. సకల శుభాలను కలుగజేసే శ్రీ మహలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీపూజలు జరుపుకునే పర్వదినం. ధర్మప్రతిష్టకు అలవాలంగా, అజ్ఞానపు చీకట్లను పారదోలుతూ జ్ఞాన జ్యోతిని వెలిగించే దీపావళిని ఏటా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ సందర్భంగా జరుపుకునే కేదరేశ్వర వ్రతం (నోము) కోసం ఊరువాడలు ముస్తాబయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో గడపగడపకు నోము జరుపుకోవడం సర్వసాధారణం. పరమశివున్ని కొలిచి మొక్కులు చెల్లించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సాధారణంగా అమావాస్యనాడు చిమ్మచీకట్లు అలుముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్య నాడు మాత్రం అంతటా వెలుగుపూల వెన్నెల వెచ్చదనాన్నిస్తుంది. ఇండ్ల ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడుతాయి. చీకటిపై వెలుగులు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పర్వదినాలలో దీపావళి కూడా ఒకటి. ఈ సారి ఎన్నికల కోలాహలం నెలకొనడంతో దీపావళికి పట్టణాల్లో ఉంటున్న తమ బంధువులను తప్పనిసరిగా పండుగకు రావాలని కుబురు పంపడం కనిపిస్తున్నది. తమ గ్రామాల్లో తమ పట్టు ఎంత ఉదో చాటుకోవాలంటే తప్పతనిసరిగా ఈ సారి ఓట్లకు రావాలంటూ తమ ఆత్మీయులకు వర్తమానం పంపిన బంధువులు పండగను పసందుగా జరుపుకేందుకు సిద్ధ్దమయ్యారు.

దీపావళి పండుగ ఇతివృతం..
రావణవధనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగా, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగాను, విష్ణుమూర్తి నరసింహవతారంలో హిరణ్యకశిపుడి తన గోళ్లతో చంపి, హరిభక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే కృష్ణుడు సత్యభామ సమేతుడై. లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటామనే కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. కథ ఏమైనప్పటికీ దీపావళి నాడు ఇంచుమించు అందరూ దీపాలు వెలిగిస్తారు. భూచక్రాలు, మతాబులు కాల్చుతూ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.

దీపాలు ఎందుకంటే..
వెలుగు లేకుండా జగతి లేదు అన్నారు. అంటే వెలుగు లేని ప్రపంచం శూన్యం అన్నమాట. ఆ వెలుగును కలిగి ఉన్న భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అన్ని రకాలైన చీకట్లను, అంటే అవిద్య, అజ్ఞానం, అవివేకాన్ని పారదోలగల సమర్థుడు, జ్ఞాన ప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలూ సాధ్యమవుతాయి. మహాలక్ష్మి దీపకాంతుల్లో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాలన్నింటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. సమాజానికి దుష్టుడి పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో దీపావళి నాడు బాణాసంచా కాల్చుతారు. పటాకులు కాల్చేముందు పిల్లలు గోగుపుల్లలకు నూనెతో తడిపిన వస్ర్తాన్నీ చుట్టి, దానిని కాలుస్తూ దుబ్బూదుబ్బూ దీపావళి మళ్లీ వచ్చే నాగులచవితి.. అని దివిటీలు కొట్టడం ఆనవాయితీ.

ఆచారాలు..
కొన్ని ప్రాంతాల్లో దీపావళి నాడు జూదం ఆడే ఆచారం ఉంది. శివపార్వతులకు, లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన జూదం లేదా పాచికలాట ఆడడం వల్ల వారు సంతుష్టులై సిరిసంపదలు ప్రసాదిస్తారని విశ్వాసం. అదేవిధంగా అర్థరాత్రి వేళ చీపురుతో ఇల్లంతా చిమ్మి, ఉప్పు నీటితో కడగడం లేదా తుడవడం వల్ల అలక్ష్మి తొలగిపోతుందని నమ్మకం. అర్ధరాత్రి కర్పూర హారతినివ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని శాస్త్రవచనం.

లక్ష్మీపూజ ఇలా..
ఇంటి గుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతో అలంకరించాలి. ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద ఒక నూతన వస్ర్తాన్ని పరిచి, దానిపై బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. మిగిలిన వారు నాణాలను, నూతన వస్ర్తాభరణాలను, గంధ పుష్పాక్షతలు, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. దీపావళి నాడు అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలనిస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్ర్తోక్తి. సాయంత్రం వేళ నూతన వస్ర్తాలు ధరించి పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. అనంతరం బాణాసంచా కాల్చి, నోరు తీపి చేసుకోవాలి.

నరకచతుర్దశి అంటే..
ఆశ్వయుజ బహుళ చతుర్దశిగా దీపావళి ప్రసిద్ధి పొందినది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ ముల్లోకాలను గడగడలాడిస్తూ సంక్షోభం సృష్టిస్తుంటాడు. కృతయుగంలో భూదేవికి అసుర సంధ్యా సమయంలో నరకాసురుడు జన్మిస్తాడు. అతడు లోకకంటకుడైనా.. శ్రీమహావిష్ణువు వధించరాదని, తల్లినైనా.. తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినపుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడనికి సత్యభామాసమేతంగా యుద్ధరంగానికి తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారిద్దరి మధ్య జరిగిన భీకర పోరులో శ్రీకృష్ణుడు మూర్చపోగానే భూదేవి అంశ అయిన సత్యభామ యుద్ధరంగంలో అపర కాళీ మాత వలే విజృంభించి నరకాసురుడిని సంహరిస్తుంది. అయితే తల్లి ప్రేమ సృష్టిలో ఎంతో గొప్పదని నిరూపించేలా తన పుత్రుడి పేరు కలకాలం గుర్తుండేలా చేయమని శ్రీకృష్ణుడిని సత్యభామ వేడుకుంటుంది. దానితో ఆరోజును నరకచతుర్దశిగా పిలువబడుతుంది.నరకుడి చెర నుంచి సాధు జనులు, పదహారు వేల మంది రాజ కన్యలు విడిపించబడ్డారని పురాణాల ద్వారా తెలస్తోంది. నరకాసురుడి పీడ విరగడైందని మరుసటి రోజు నుంచి ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు.

మహాలక్ష్మీ పూజ విశిష్టత..
దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాసుడనే మహర్షి ఒక సారి దేవేంద్రుడి ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన వరాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కి వేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుడిని శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యం కోల్పోయి సర్వసంపదలను పోగొట్టుకొని దిక్కుతోచని స్థితిలో శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తాడు. మహావిష్ణువు దేవేంద్రుడిని ఒక జ్యోతి వెలిగించి దాన్ని శ్రీమహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు. దేవేంద్రుడి తపస్సుకు మెచ్చిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఇంద్రుడు శ్రీమహావిష్ణువు చెంత వుండే లక్ష్మీదేవిని తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అని అడుగుతాడు. దీనికి ఆ మాత త్రిలోకాధిపతి నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి మనోభిష్టాలను అణగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మిగా,విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్ధులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా,ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చె వరలక్ష్మిగా ప్రసన్నవమవుతానని సమాధానమిచ్చింది. అందుజేత మహాలక్ష్మీదేవిని దీపావళి రోజున పూజించే వారికి సర్వసంపదలు సమరూరుతాయని భక్తుల నమ్మకం.

భూచక్రాలు.. మతాబులు..
ధనలక్ష్మీపూజల అనంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్ధులవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, మతాబులు, కాకరవొత్తులు కళ్లు మిరుమిట్లు గొలుపుతుంటే మరో పక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో వీధులన్నీ మారుమోగుతుంటాయి. బాణాసంచా కాల్చడానికి పురాణాల్లో ఒక కారణం చెప్పబడింది. ఆ వెలుగులో ఆ శబ్ధ తరంగాల్లో దారిద్య్ర, దుఃఖాలు దూరంగా తరిమి వేయబడి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని, వర్షరుతువులో తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమి కీటకాలు బాణసంచా పొగలకి నశిస్తాయని శాస్ర్ర్తాలు చెబుతున్నాయి.

ధనాధన్.. ఫటాఫట్..
- దీపావళిలో తారాజువ్వల హవా
- రంగురంగుల పూలు విరజిమ్మే పటాకులకు పెరుగుతున్న క్రేజ్
దీపావళి... ఈ పేరు వినగానే తారాజువ్వలు, కాకరపుల్లలు, చిచ్చుబుడ్లు, తాళ్లు, పాముబిళ్లలు, అగ్గిపెట్టెలు, పిస్తోలు, లక్ష్మీబాంబులు కళ్ల ముందు కదలాడుతాయి. కానీ ఇప్పుడు పటాకుల్లో మార్పు వచ్చేసింది. ఇప్పడంతా ధనాధన్.. ఫటాఫట్ పటాకులే. రకరకాల ధ్వనులతో పేలేఫ్యాన్సీ పటాకులు మార్కెట్‌లోకి వచ్చేశాయి. అరగంట పాటు ఆ ప్రాంతం అంతా హోరుత్తించే 1000వాలా, 5000వాలాలతో పాటు రంగురంగుల పూలు విరజిమ్మే కొత్త కొత్త ఫ్యాన్సీ బాంబులపై అందరూ ఆసక్తి చూపుతున్నారు. వాటి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఫ్యాన్సీ బాంబులకు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో తయారీదారులు వీటినే ఎక్కువగా తయారు చేస్తున్నారు. దఫా కేవలం రెండు గంటలు మాత్రమే పటాకులు కాల్చుకునే విధంగా సుప్రింకోర్టు తీర్పు వెలువరించిన నేపధ్యంలో యువతీ, యువకులు సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య పటాకులు కాల్చేందుకు సిద్దమయ్యారు.

మల్టీకలర్స్ వెదజల్లే కుండ చిచ్చుబుడ్లు...
మార్కెట్‌లోకి కొత్తగా కుండ చిచ్చుబుడ్లు వచ్చాయి. ఈ చిచ్చుబుడ్లు నుంచి మల్టీకలర్స్ వెదజల్లుతూ... క్రాకరింగ్ శబ్దాలతో 15 ఫీట్ల ఎత్తులో చుట్టూ 3మీటర్ల వైశాల్యంలో రంగుల కాంతులను విరమజిమ్ముతూ చెట్టు ఆకృతిలో చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ కుండ చిచ్చుబుడ్లలో 15 రకాల వెరైటీ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి.
చిచ్చుబుడ్లు...
మార్కెట్లోకి అనేక రకాల చిచ్చుబుడ్లు వచ్చేశాయి. బంతిని పోలి ఉండే మట్టి చిచ్చుబుడ్లు అంటించగానే రంగు రంగుల వెలుగులను వెదజల్లుతూ ఇంటిల్లిపాదినీ అలరింపజేస్తుంది.

రంగు రంగుల కాంతులు...
షాట్స్‌ను వెలిగించడంతోనే ప్రతీ 40 సెకండ్లకోసారి పైకి రయ్...రయ్ మంటూ దూసుకుపోతూ మల్లీకలర్స్‌తో విన్యాసాలు చేస్తూ అరగంట పాటు భారీ శబ్దంతో పేలడం ఈ బాంబు ప్రత్యేకత. 250 నుంచి 300 షాట్స్‌తో అందరినీ అలరింపచేస్తుంది. 30 మంది ఒకేసారి ఈల వేసినంత శబ్దం వస్తుంది. చిన్నారి చిచ్చపిడుగుల కోసం ఛోటాభీమ్.. బెంటెన్ వెరైటీ షాట్స్‌తో పాటు ఈలలు వేస్తూ... పిల్లలు ఆటలు ఆడుకునే బొమ్మలు, వస్తువులు వస్తుంటాయి. స్కై షాట్స్ ఆకాశంలో కళ్లు మిరమిట్లు గొలిపే రంగు రంగుల కాంతులను వెదజల్లుతూ అందరినీ అలరింపచేస్తాయి. స్కై సింగిల్ షాట్ వంద మీటర్లు ఎత్తులో ఆరు మీటర్లు వైశాల్యంలో గ్లోబ్‌లాగా గుండ్రంగా పురివిప్పుకుని రంగురంగుల పువ్వుల కాంతులను వెదజల్లుతుంది. ధర రూ.50 నుంచి 10,000 వరకు.

నెమలి, బట్టర్‌ైప్లెల హంగామా...
మార్కెట్‌లోకి వచ్చిన మరో కొత్తరకం పటాకులు బట్టర్‌ైప్లెలు ఇంట్లోని హాల్లో బట్టర్‌పైలు లాగా విన్యాసాలు చేస్తూ హంగామా చేస్తాయి. పటాకులు పేలిస్తే నెమళ్లు నాట్యం చేసేలా కాంతులను వెదజల్లుతుంది. బట్టర్‌ైప్లె పేలుడుగానీ, రంగులు విరజిమ్మడం ప్రత్యేకంగా ఉంటాయి. ధర రూ.150నుంచి 400 వరకు.
1000 నుంచి 10,000 వాలాలు...
ఇళ్ల ముందు, వ్యాపార సంస్థల ఎదుట దారిపెడుగునా ఏర్పాటు చేసి వెలిగించడంతోనే ఏకధాటిగా అరంగంట పాటు పేలుతూ అందరికీ ఆనందాన్నీ కల్గిస్తాయి. మార్కెట్లో 1000వాలా, 2000వాలా, 5000వాలా, 10,000వాలా వరకు అమ్మకాలు జరుగుతున్నాయి.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...