తొలి పూజకు వేళాయే..!


Wed,September 12, 2018 11:25 PM

-నేటి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు
-ముస్తాబైన మండపాలు
-కొలువుదీరనున్న వినాయకులు
-ఈ సంవత్సరం మట్టి విగ్రహాలపై పెరిగిన స్పృహ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : చవితి వేడుకకు సర్వం సిద్ధమైంది. నవరాత్రి ఉత్సవాలను సంబురంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి కొనుగోళ్లతో జిల్లాలో సందడి నెలకొంది. మరోవైపు గతానికి భిన్నంగా ఈ సంవత్సరం యువత మట్టి గణపతిల ప్రతిష్ఠాపనకు మొగ్గు చూపుతున్నది. పలు గ్రామాల్లో రసాయన విగ్రహాలు తేవద్దని తీర్మానించుకున్నారు. ఇదిలా ఉంటే వినాయక చవితిని ప్రశాంతవాతావరణంలో జరుపుకో వాలని పోలీసులు సూచిస్తున్నారు.

గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు మండపాలు ముస్తాబయ్యాయి. ఉత్సవ కమిటీలు పనుల్లో తలమునకలయ్యాయి. మట్టి విగ్రహాల ప్రతిష్టాపనకు మొగ్గు చూపడం ఈసారి ఆహ్వానించదగ్గ పరిణామం.

సకల పూజలకు గణపతి
సకల పూజలు అధిపతి గణపతి. బాధ్రపద శుద్ధ చవితిని పురస్కరించుకుని వినాయక చవితి నిర్వహిస్తుంటారు. జిల్లా కేంద్రమైన భువనగిరి, పుణ్యక్షేత్రమైన యాదాద్రి, చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, వలిగొండ, భూధాన్‌పోచంపల్లి, బీబీనగర్, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం తదితర మండలాల్లో మండపాలను అందంగా ముస్తాబు చేశారు.

ఆకట్టుకుంటున్న మండపాలు
భువనగిరి పట్టణంలోని కిసాన్‌నగర్, హౌసింగ్‌బోర్డు, హన్మాన్‌వాడ, శ్రీసాయియూత్, సర్థార్ సిద్ధార్ద యూత్, శ్రీరామ భక్త భజన మండలి, వీర శివాజీ యూత్, శ్రీరామసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండపాలను ముస్తాబు చేశారు. మీనానగర్ వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగే ఈసారి మట్టి గణనాధున్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గణనాధున్ని మండపం వద్దే నిమజ్జనం చేస్తారు.

సందడే... సందడి
జిల్లా కేంద్రంతో పాటు పగిడిపల్లి, రాయగిరి, చౌటుప్పల్, రాజాపేట, ఆలేరు ప్రాంతాల్లో బుధవారం సందడి నెలకొంది. భువనగిరి గంజ్‌లో ముందుగా పండుగ వచ్చిన వాతావరణం కన్పించింది. మెయిన్ రోడ్డుపై పూజ సామాగ్రి విక్రయించే దుకాణాల్లో జనం కిక్కిరిశారు.

నిర్వాహకులు పాటించాల్సిన జాగ్రత్తలు
నిర్వాహకులు మండపం వివరాలను తప్పక పోలీసులకు తెలిపి పర్మిషన్ తీసుకోవాలి. స్థలం యజమాని అనుమతి రాత పూర్వకంగా తీసుకోవాలి. మైక్ పర్మిషన్‌కు రూ. 145 మీ సేవ ఆన్‌లైన్‌లో రాచకొండ కమిషనరేట్ పేరున చెల్లించి రశీదును పొందాలి. అట్టి ప్రతిని పోలీసులకు సమర్పించాలి. మండపానికి అనుమతి దరఖాస్తు, ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారో వివరాలను www.rachakonda police. telangana.gov.in సందర్శించి అప్లికేషన్‌ను నిర్ధారించి తర్వాత అట్టి ఫారంలో డేటా అప్‌లోడ్ చేయాలి. ఐదుగురు నిర్వాహకుల గుర్తింపు పత్రాలను (పాన్, ఆధార్, ఓటర్‌కార్డు) సమర్పించాలి. విద్యుత్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారుల పర్మిషన్ తీసుకుని దాని యొక్క ప్రతులు జతచేయాలి. వెలుతురు, శుభ్రత, పార్కింగ్ ప్లేస్ ఉండేట్లు చూసుకోవాలి. భద్రత చర్యల గురించి పోలీసులు కోరినప్పుడు తప్పక మీటింగ్‌కు ఉత్సవ కమిటి హాజరు కావాలి. వర్షాలు కురిసినప్పటికీ ఎక్కువ మంది స్టేజీ పైకి వెళ్లినప్పుడు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వచ్ఛందంగా వలంటీర్‌లను ఏర్పాటు చేసుకొని 24 గంటలు నిఘా పెట్టుకోవాలి. మద్య పానీయాలు, మత్తు పదార్థాలు సేవించిన వారికి అనుమతించబడదు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలి. దారి మధ్యలో గల ప్రార్థ్ధన ఆలయాల వద్ద వారిని ఇబ్బందులకు గురిచేయవద్దు. ఊరేగింపు వాహనాల్లో వ్యక్తులు ఎలాంటి మారణాయుధాలు ధరించి ఉండరాదు.జెండాలకు ఉపయోగించే కర్రలు రెండు అడుగులకు మించి ఉండరాదు. ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మరాదు. లౌడ్‌స్పీకర్లు, డీజేలు ఏర్పాటు చేయరాదు. నిమజ్జనం చేసే స్థలాల వద్ద సరైన వెలుతురు, విగ్రహ నిమజ్జనం చేసే సమయంలో ఈత వచ్చిన వాళ్లు నలుగురికి మించిలోనికి వెళ్లరాదు.గణేశ్ నిమజ్జనం చేసే భక్తులు చీకటి పడకముందే చేసేవిధంగా చూసుకోవాలి.

డీజేల నిషేధం : డీసీపీ ఈ. రామచంద్రారెడ్డి
డీజేలకు అనుమతి నిషేధించాం. ఎవరికి మినహాయింపులు లేవు. వినాయక విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు చేసే ప్రతి కార్యక్రమం నుంచి ముందస్తుగా స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఏర్పాటు చేసుకున్న మైకులు రాత్రి 10 గంటల వరకే మోగాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితిలో శబ్ధకాలుష్యానికి పాల్పడరాదు. పోలీసులకు సహకరించాలి.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...