ఖిల్లాలో కారు జోరు..


Tue,September 11, 2018 12:09 AM

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ : భువనగిరి రాజకీయాలు వేడెక్కాయి. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కారు శరవేగంగా దూసుకెళ్తున్నది. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్యే పదవులను గులాబీమయం చేశాయి. భువనగిరి ఖిల్లాపై గులాబీజెండా రెపరెపలాడుతున్నది. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏజెండాగా ఈసారి తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఓట్లు అడగటానికి పగిడిపల్లిలో శ్రీకారం చుట్టారు. జోష్ మీదున్న పైళ్ల తమదైన శైలిలో ఎన్నికల బరిలో ముందు వరుసలతో నిలిచారు. అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని, ఈ నాలుగేండ్లలో భువనగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేసిన ఆయన బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా సద్వినియోగం చేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకే ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. భువనగిరి శాసనసభకు టీఆర్‌ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి టికెట్ ఖాయమవ్వగా, కాంగ్రెస్ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అందెల లింగంయాదవ్, తంగెళ్లపల్లి రవికుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్ తదితరులు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. యువ తెలంగాణ పార్టీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, బీజేపీ నుంచి పీవీ శ్యాంసుందర్‌రావు బరిలో ఉండే అవకాశం ఉంది. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి పట్టణం, మండలం, వలిగొండ, బీబీనగర్,

భూదాన్‌పోచంపల్లి మండలాలు ఉండగా మొత్తం లక్షా 81వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తోడు, పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలే తిరిగి తనను గెలిపిస్తాయన్న ధీమాతో తాజా మాజీ ఎమ్మెల్యే పైళ్ల ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ప్రచార రంగంలోకి దూకారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉంది. భువనగిరి పట్టణంతోపాటు మండలంలో టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా ఉండగా వలిగొండ మండలంలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ స్థానిక వ్యక్తి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే అక్కడ పరిస్థితులు మారే అవకాశం ఉంది. భూదాన్‌పోచంపల్లి మండలంలో టీఆర్‌ఎస్‌కు అడ్డే లేని పరిస్థితి ఉంది. బీబీనగర్ మండలంలో టీఆర్‌ఎస్ బలంగా ఉంది. నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లో ఎన్ని వర్గాలున్నా అందరూ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడవడం ఆయనకు బలాన్నిచ్చే అంశం.

కాంగ్రెస్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు..
కాంగ్రెస్‌లో రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతున్నది. పార్టీ ఇన్‌చార్జిగా, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతోపాటు కార్యకర్తల కష్టసుఖాలను తీరుస్తున్నానని, కాంగ్రెస్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తున్నది. అయితే కొన్నేండ్లుగా పార్టీలో ఉంటున్న బీసీ నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అందెల లింగంయాదవ్, తంగెళ్లపల్లి రవికుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్ తమకు అవకాశం కల్పించాలని కోరుతూ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేయిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ముందుకెళ్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక పూర్తికాకపోవడం, ఎవరికి వారు లాబీయింగ్ చేస్తుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

సానుభూతే విజయాన్ని కట్టబెడుతుందన్న జిట్టా..
రెండు విడుతలుగా పోటీచేసినప్పటికీ ఓటమి పాలైన యువ తె లంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈసారి బరి లో ఉండనున్నారు. రెండు సార్లు వివిధ కారణాలతో ఓటమి పాలై న ఆయన ఈ సారి ప్రజల సానుభూతే తనను గెలిపిస్తుందన్న ధీ మాతో ఉన్నారు. 2014 ఎన్నికలు ముగిసి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా ఆయన వర్గానికి చెందిన నాయకులు నేటికీ ఆ యనతోనే ఉండటం ఆయనకు సానుకూల అంశంగా చెప్పవచ్చు.

మోడీ చరిష్మాతో గట్టెక్కుతానన్న ఆశలో పీవీ..
మోడీ చరిస్మా తనను గట్టెక్కిస్తుందన్న ఆశలో పీవీ శ్యాంసుందర్‌రావు ఉన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ చొచ్చుకుపోలేదు. కేవలం భువనగిరి పట్టణంతో పాటు వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్ పట్టణ కేంద్రాల్లో మాత్రమే బీజేపీ ప్రభావం ఉంది. అయినప్పటికీ బీబీనగర్‌కు ఎయిమ్స్ మంజూరు చేయడంతోపాటు, గ్రామీణ సడక్ యోజన పథకం కింద పెద్ద ఎత్తున పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణం తమ వల్లే జరిగిందని చెబుతున్న ఆ పార్టీ నాయకులు విజయావకాశాలను తోసిపుచ్చలేమంటున్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...