మన యస.. కాళోజీ


Sun,September 9, 2018 12:15 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : తెలంగాణ అస్తిత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సంస్కర్త, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా ఆదివారం జయంతిని జరుపుకుంటారు. తెలంగాణ భాషపై చర్చాగోష్టులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహించనున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు తెలంగాణ భాషపై మమకారం కలిగించేందుకు సంస్కృతీసంప్రాదాయాలను పెంపొందించేందుకు, అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ అనితారామచంద్రన్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగనున్నాయి. మనిషి తాను బతికిన జీవిత కాలంలో కలాన్ని... గళాన్ని ఒకేవాడితో ఉపయోగించి రచనల్లోనూ, ఆచరణల్లోనూ ఒకే నిశిత వైఖరీతో పోరాటం జరిపిన గొప్ప వ్యక్తి కాళోజీ నారాయణరావు. పుట్టుక నీది.. చావు నీది..బతుకంతా దేశానిది లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ గురించి కాళోజీ రాసిన ఈ పంక్తులు కాళీజీ జీవితానికి వర్తిస్తాయి. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు...అన్యాయం అంతరిస్తే.. నా గొడువకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి..

అంటూ తన జీవిత కాలమంతా గొడువ పడిన వ్యక్తి ప్రజాకవి కాళోజీ నారాయణరావు. అన్యాయం అక్రమాలపై గురిపెట్టిన ఆయుధం ఆయన. బాల్యం నుంచే అన్యాయాన్ని, అక్రమాలను ఎదిరించే తత్వం అలవర్చుకున్న కాళోజీ తన పదిహేడేండ్ల ప్రాయంలోనే భగత్‌సింగ్ ఉరితీతకు బాధపడుతూ తొలికవిత్వం రాశారు. సమాజంలో జరిగే ప్రతి విషయానికి స్పందించడం ఆలోచింపచేయడం నైజంగా అలవర్చుకున్న ఆయన ఓరుగల్లు నగరం కేంద్రంగా ధిక్కార స్వరానికి ప్రతిఘటనలకు కేరాఫ్‌గా నిలిచారు. సమాజంలో తరతమ వ్యత్యాసాలను ఎండగట్టారు. ఆయన జీవితం.. కాలానికి లోబడనిది. ఆయన సాహిత్యం నిత్యచైతన్యమే.. వందల సంఖ్యలో ఆయన రాసిన సాహిత్యమంతా నా గొడవే..ముఖ్యంగా ఒక శతాబ్దపు తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రంతా ఆయన సాహిత్య మే. బతుకు తప్పదు..బతుక్క తప్పదు.. అన్న గొప్ప సందేశం నారాయణరావుదే. తెలంగాణ భాషా, యాసా, సంస్కృతి, సాహిత్యాలకు ధిక్కార స్వరాన్ని జతచేసి అందరిలో అందరివాడిగా ఒక్కడై తెలంగాణ సైరన్ పూరించిన మహోన్నత వ్యక్తి కాళోజీ.

చిన్ననాటి నుంచే అక్రమాలను ఎదిరించే తత్వం కాళోజీది..
వరంగల్ జిల్లాలో 1914 సెప్టెంబర్ 9వ తేదీన కాళోజీరావు, రమాభాయి టటదంపతులకు జన్మించిన ఆయన పూర్తిపేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్‌రాజా కాళోజీ. ఆయన సోదరుడు కాళోజీ రామేశ్వర్‌రావు. తండ్రి నుంచి మహారాష్ట్ర సత్యాన్ని తల్లి నుంచి కర్ణాటక వారసత్వాన్ని పొంది తెలుగు తత్వంతో పెరిగిన కాళోజీ పూర్వీకులు మడికొండ గ్రామంలో స్థిరపడ్డారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య, వరంగల్, హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1940లో రుక్మిణిభాయిని వివాహమాడారు. బాల్యం నుంచే అన్యాయం, అక్రమాలపై ఎదిరించే తత్వాన్ని అలవర్చుకున్న కాళోజీ సమాజంలో జరిగే ప్రతి అంశంపై తాను స్పందించడమే కాక తన సాహిత్యం ద్వారా ఎంతోమందిలో ప్రేరణ కల్పించారు. కాళోజీ నారాయణరావుకు తెలంగాణ అంటే వల్లమాలిన అభిమానం. తొలి తెలంగాణ ఉద్యమంలో స్వయం గా పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించిన ఉద్యమకారుడు ఆయన. 1969 మే 1వ తేదిన వరంగల్ పట్టణంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ సదస్సులో కాళోజీ సంధించిన కవితాస్ర్తాలు తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చాయి.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై తన కవితలు, సాహిత్యం ద్వారా ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ సైరన్ పూరించారు. అవనిపై జరిగే అవకతవకలను చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు.. పరుల కష్టం చూసి కరిగిపోవును గుండె.. మాయం మోసం చూసి మండిపోవును ఒళ్లు.. అంటూ సమాజంలోని తీరును జీర్ణించుకొలేక ఆరోజుల్లోనే కాళోజీ నాగొడవ ద్వారా తన ఆవేదనను వెలిబుచ్చారు.
జీవితాకాలమంతా పోరాటాలతోనే..
తన జీవితకాంలో పుట్టిన అన్ని ఉద్యమాలతో మమేకమై పోరాడిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు. గణపతి ఉత్సవాలు, గ్రంథాయల ఉద్యమం, ఆర్య సమాజ కార్యక్రమాలు, రజకార్ల ప్రతిఘటన, స్టేట కాంగ్రెస్ సత్యాగ్రహాలు, ఆంధ్రమహసభలు, తెలంగాణ రైతాంగ పోరా టం, విశాలాంధ్ర ఉద్యమం, రెండు తెలంగాణ ఉద్యమాలు, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరా టం, పౌరహక్కుల పోరాటం మొదలైన అన్ని ఉ ద్యమాలకు స్పందించిన నిత్యసమరశీలి కాళోజీ.

విలక్షణమైన సాంస్కృతిక నేపథ్యం..
కాళోజీ నారాయణరావుకు విలక్షణమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్నది. తల్లి కన్నడిగ, తండ్రి పూర్వీకులు మహారాష్ట్రీయులు, మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన కుటుంబం వారిది. ఆయనకు తెలుగు, హిందీ, ఉర్దు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉన్నది. నా కులం, నా ప్రాంతం, నా భాష అనే సంకుచితత్వం లేదు. నేనింకా నా నుంచి మా వరకే రాలేదు. మనం అన్నప్పుడు కదా ముందడుగు అంటారాయన. కాళోజీ ఏ పార్టీకో, ఏ సంఘానికో కట్టుబడి ఉండే వ్యక్తి కాదు. ఒకపార్టీకి కట్టుబడి ఉండటమంటే ప్రాతివత్యం లాంటి పార్టీవత్యం అనేవారాయన. సంస్థలకు, పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనేవారు.

కాళోజీ సంస్కర్త.. సాహితీవేత్త
కాళోజీ ఒక సంస్కర్త, ఉద్యమకారుడు, సాహితీవేత్త వంటి భిన్న పార్వాలు కనిపిస్తాయి. కాళాజీ భావజాలంలోగాని, ఆచరణలో గాని ప్రధానంగా కనిపించేది వ్యక్తి స్వేచ్ఛ. అదే ఆయనకు ధిక్కార కవిగా, ఉద్యమకారుడిగా మార్చింది. నిజాం కాలంలోని అణచివేత ధోరణులు ఆయనలోని స్వేచ్ఛావాదాన్ని బలోపేతం చేశాయి. భాగవతంలోని ప్రహ్లాదుడి కథ ఆయనకు స్ఫూర్తిదాయకం. ప్రహ్లాదుని శాంతియుద్ధం హిరణ్యకశిపుణ్ని మార్చలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని హింసిస్తే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ని అణచివేస్తాడు. దీనిని కాళోజీ అనేక సందర్భాలలో ఉదాహరిస్తారు. అధికారం ఉన్నవాడే అన్యాయం చేస్తుంటే, అదుపులో పెట్టే రాజ్యం ఆసరాగా వెనుకుంటే-ప్రతిహింసకు పూనుకున్న ప్రతి నరుడూ నరసింహుడే అంటారు కాళోజీ.

ప్రజాకవి బిరుదు ఇష్టమన్న కాళోజీ..
భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాకరమైన పద్మవిభూషన్ బిరుదు కన్నా ప్రజాకవి బిరుదే తానిష్టపడుతానంటారు కాళోజీ. ఆయన ప్రజాస్వామ్య కవి. నడుస్తున్న ఉద్యమాలను సజీవంగా వ్యాఖ్యానించిన కవితలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. నడుస్తున్న చరిత్రనే కాళోజీ నా గొడవగా వినిపించారు. అది ప్రజల గొడవ. దరిద్ర నారాయణుల సంవేదనా సంభరిత కావ్యేతిహాసం నా గొడవ. కాళోజీ ఏ సాహిత్యోద్యమంతోనూ ప్రభావితుడు కాలేదు.

మనిషి కోసం పోరాటం..
కాళోజీకి మాతృదేశమన్నా, మాతృభాష అన్నా అమితమైన అభిమానం. ఈ రోజుల్లో నిత్య వ్యవహారానికి తెలుగుకు బదులు ఆంగ్లం రాజ్యమేలుతున్నది. నిజాం పాలనలో ఉర్దూ రాజ్యమేలింది. తెలుగువారు తమకు తెలుగు రాదంటూ ఇతర భాషల్లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నారు. ఈ దురవస్థను చూసిన కాళోజీ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? అని ఈసడించాడు. భావదాస్యాన్ని ఎండగట్టాడు. భాష విషయంలో ఆయనది విశాల ద్పక్పథం. తెలుగు భాషలోని అన్ని భేదాలను కలుపుకొని భాషను సుసంపన్న చేసుకోవాలని అభిలషించారు. ఉచ్చారణ భేదాలను, యాసలను ఈసడించుకోవద్దన్నారు. ఎవరి వాడుక భాషల్లో వారు రాయాలన్నదే కాళోజీ సిద్ధాంతం.

చరిత్రనెరిగిన శాస్త్రజ్ఞుడు..
కాళోజీ చరిత్రనెరిగిన శాస్త్రజ్ఞుడు, కవి, రచయిత, అనువాదకుడు, ఉద్యమకారుడు..నిర్బీతి, నిజాయితీ, స్వచ్ఛతలకు పర్యాయ పదం. ప్రజల సమస్యలే కాళోజీని కవిగా పరికించినవి. కాళోజీ కథలు నేటికీ తెలంగాణ భాష, సాంస్కృతిక, సామాజిక రాజకీయ జీవనానికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి.
-చింతల రాకేశ్‌భవాని, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట

తెలంగాణ కోసం అంకితం..
పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా తెలంగాణది అని ప్రకటించి తన బతుకంతా తెలంగాణ కోసం అంకితం చేసిన మహానీయుడు కాళోజీ. కాళోజీ అంటేనే నిర్భీతికి ప్రతీక, అన్యాయంపై విస్ఫులింగాలు వెదజల్లే ఒక ధిక్కారస్వరం. ప్రతి ఒక్కరూ కాళోజీ అడుగు జాడలో నడువాలని, స్ఫూర్తిని చాటేలా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. - కట్ట రామకృష్ణ, కాళోజీ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, బాహుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు

169
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...