యాదాద్రిలో భక్తుల సందడి


Sun,September 9, 2018 12:05 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇష్టదైవాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు రావడంతో శ్రీవారి దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. స్వామివారి నిత్యకల్యాణం, అష్టోత్తరాలు, వ్రతపూజలలో మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల పూజలతో మండపాలు సందడిగా మారాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతును జరిపారు. అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. వ్రత మండపంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...