కారు జోరు ప్రతిపక్షం బేజారు


Sat,September 8, 2018 12:03 AM

-అభ్యర్థుల ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం
-ఉమ్మడి జిల్లా అంతటా ఎన్నికల మూడ్‌లోకి క్యాడర్
-కేసీఆర్ పూరించిన ప్రచార పర్వంతో మరింత జోష్
-తొలిరోజే జనం మధ్యకు అధికార పార్టీ అభ్యర్థులు
-అమోమయం, అభ్యర్థుల వేటలో ప్రతిపక్ష పార్టీలు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే అభ్యర్థుల ప్రకటన.. ఆ మరుసటి ప్రచారం మొదలు పెట్టిన అధినేత కేసీఆర్.. వెరసి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్నికల ఉత్సాహం పోటెత్తుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా గులాబీ క్యాడర్ ఫుల్ జోష్‌తో కళకళలాడుతోంది. ముందస్తు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. పార్టీ గెలుపు కోసం ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు. 12అసెంబ్లీ స్థానాలకు 10మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. దాదాపుగా అందరు

అభ్యర్థులూ శుక్రవారం తమ నియోజక
వర్గాల్లో ప్రచార పర్వం ప్రారంభించారు. గులాబీ క్యాడర్ సరికొత్త ఉత్సాహంతో ఉర్రూతలూగుతుంటే.. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అయోమయం నుంచి కోలుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పలువురు
హైదరాబాద్‌లోనే అత్యవసర సమావేశాల్లో బిజీగా గడిపారు. మిగిలిన ప్రతిపక్షాలు కూడా అభ్యర్థుల గురించి ఆలోచనల్లో మునిగాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్‌లో ఎన్నికల ఉత్సాహం జోరందుకుంది. గురువారం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికల నగారా మోగించిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. అదే రోజు 119 స్థానాలకు 105 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను సైతం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు శుక్రవారం హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల ప్రచార పర్వం సైతం ప్రారంభించడంతో.. ఆ పార్టీ క్యాడర్‌లో ఉమ్మడి జిల్లా అంతటా ఉత్సాహం ఊపందుకుంది. 12అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఇప్పటికే 10మంది అభ్యర్థులను అధికార పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోదాడ, హుజూర్‌నగర్ మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లకూ టిక్కెట్లు ఖరారు చేయడంతో.. శుక్రవారం జిల్లా అంతటా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. తాజా మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఘన విజయం ప్రణాళికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు...
ఎన్నికల షెడ్యూల్ రాక ముందే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడంతో.. తాము ఘన విజయం సాధించి అధినేత కేసీఆర్‌కు కానుకగా సమర్పించే లక్ష్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు శుక్రవారం ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు. వచ్చే వారం నుంచి భారీ జన సందోహంతో పూర్తి స్థాయి ప్రచారం ప్రారంభించే దిశగా కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రచార రథాలను సిద్ధం చేసుకోవడం.. నిన్నా మొన్నటి కంటే ఎక్కువగా జనంలోకి వెళ్లేందుకు షెడ్యూల్ తయారు చేసుకోవడంలో బిజీగా గడిపారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. హడావిడి సమావేశాలు నిర్వహించారు. ఎక్కడ ఎవరు అభ్యర్థులుగా ఉంటారా? అన్న అంచనాల్లో ఆ పార్టీ నేతలు ఇప్పటికీ అయోమయంలోనే ఉండగా.. బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ కారు ముందస్తు ఎన్నికల రేసులో జోరుగా దూసుకెళ్తుంటే.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయుధాలను కూడగట్టే పనిలో పడ్డాయి.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...