ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


Sat,September 8, 2018 12:02 AM

భువనగిరి టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని సఫాయి కర్మచారీలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యుడు జగదీశ్ హైర్‌మన్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పశు సంవర్థక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని సఫాయి కర్మచారీలు, పారిశుధ్య కార్మికులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సఫాయి కర్మచారీలు తమ పిల్లలకు ఉత్తమ విద్యనందించి భావితరాలను సఫాయి కర్మచారి వృత్తి నుంచి విముక్తి కల్పించాలన్నారు. తెలంగాణలో కాంట్రాక్టు పనులలో ఉన్న సఫాయి కర్మచారీలను శాశ్వత ఉద్యోగులుగా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరనున్నట్లు తెలిపారు. సఫాయి కర్మచారీల అభివృద్ధికి అందించే నిధుల దుర్వినియోగం, నిర్లక్ష్యం చేసే వారిపైన తగు చర్యలు తీసుకునేందుకు కమిటీకి సిఫారసు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న సఫాయి కర్మచారీలకు చట్టప్రకారం కనీస వేతనం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాతముత్తాతల కాలం నుంచి సఫాయి పనిచేస్తూ అనారోగ్యానికి గురికావడంతో పాటు సమాజంలో చిన్నచూపుకు సఫాయి కర్మచారీలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోగ్యంపై వారికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని, ప్రతి మూడు నెలలకోసారి మాస్టర్ హెల్త్ చెక్ నిర్వహించి వైద్య సౌకర్యం అందించాలని అధికారులకు సూచించారు. అర్హులైన పారిశుధ్య, పనివారలకు బీమా సౌకర్యం అమలుచేయాలన్నారు. మరణించిన వారి కుటుంబాలను ఆధుకునేందుకు ఉద్యోగం, పరిహారం చెల్లింపు వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లా యంత్రాంగం ఇండ్ల స్థలాలు కేటాయించినచో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. సఫాయి కర్మచారీలకు ఇండ్ల స్థలాల కేటాయింపులో తొలి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పారిశుధ్య పనివారలకు సబ్బులు, నూనె, చెప్పులు, యూనిఫాం తదితర సౌకర్యాలు నిబంధనల మేరకు సమకూర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న సఫాయి కర్మచారీల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా పట్టణంలోని ప్రభుత్వ రహదారి బంగ్లాకు చేరుకున్న ఆయనకు బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు చిలుకమారి గణేశ్, దళిత సంఘాల నాయకులు నాగారం అంజయ్య, కోళ్ల భిక్షపతి తదితరులు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌వో విజయకుమారి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి కృష్ణమూర్తి, ఎస్సీ అభివృద్ధి అధికారి జె.రామారావు, జిల్లా పంచాయతి అధికారి భిక్షం, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...