టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు


Fri,September 7, 2018 01:02 AM

-ప్రతిపక్షాలకు మరో కోలుకోలేని షాకిచ్చిన సీఎం కేసీఆర్
-అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే అభ్యర్థుల జాబితా వెల్లడి
-ఉమ్మడి జిల్లాలోని 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు
-నల్లగొండ, నాగార్జునసాగర్ పార్టీ ఇన్‌చార్జీలకు టికెట్లు
-12 స్థానాలకు 10 చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు ఖరారు
-హుజూర్‌నగర్, కోదాడకు సైతం త్వరలోనే ప్రకటన
-అభ్యర్థిత్వాల ప్రకటనతో అంతటా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ రద్దు.. ఆ వెంటనే 105 పేర్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా వెల్లడి.. ముందస్తు వ్యూహంతో సీఎం కేసీఆర్ గురువారం ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన షాక్‌లు ఇవి. అసెంబ్లీ రద్దు చేశారన్న వార్త నుంచి తేరుకోక ముందే అభ్యర్థులను సైతం ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. ముందునుంచి చెబుతున్నట్టే ఉమ్మడి జిల్లాలోని 8 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలకూ త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో వారి సిట్టింగ్ సీట్లలోనే అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నర్సింహయ్యలకు సైతం పార్టీ టిక్కెట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్ వెల్లడించిన జాబితా ప్రకారం సూర్యాపేట నుంచి మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మళ్లీ అసెంబ్లీకిపోటీచేయనున్నారు. తుంగతుర్తి(ఎస్సీ) నుంచి గాదరి కిశోర్ కుమార్, మిర్యాలగూడ అభ్యర్థిగా నలమోతు భాస్కర్‌రావు, మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్(ఎస్సీ) నుంచి వేముల వీరేశం, దేవరకొండ(ఎస్టీ) నుంచి రమావత్ రవీందర్ కుమార్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి అధికార పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు కోదాడ, హుజూర్‌నగర్ మినహా 10 సీట్లకూ అభ్యర్థులను ఖరారు చేయడంతో జిల్లా అంతటా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి.

అసెంబ్లీని 9నెలల ముందుగానే రద్దు చేసిన ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. త్వరలో జరుగనున్న ముందస్తు ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను సైతం వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 119స్థానాలు ఉండగా.. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 10సీట్లకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు చేసి పేర్లను వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తామని ముందు నుంచీ చెప్తూ వస్తున్న కేసీఆర్.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 8మంది తాజా మాజీ ఎమ్మెల్యేలకు మరోసారి టిక్కెట్ ఖరారు చేశారు. వీరితోపాటు నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నర్సింహయ్యల అభ్యర్థిత్వాన్ని సైతం ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్ సహా మిగతా రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ రద్దు నుంచి తేరుకోక ముందే మరో షాక్ ఇస్తూ.. చెప్పిన మాట ప్రకారం సెప్టెంబర్‌లోనే గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా ప్రకటించారు అధికార పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.

టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు...
2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ 6స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 5, సీపీఐ ఒక్క స్థానంలో గెలవగా.. ఆ తర్వాత సీపీఐ నుంచి గెలుపొందిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కాంగ్రెస్ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అభివృద్ధికి జైకొడుతూ టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కారు గుర్తుతో గెలిచిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి(సూర్యాపేట), గాదరి కిశోర్ కుమార్(తుంగతుర్తి), వేముల వీరేశం (నకిరేకల్), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(మునుగోడు), పైళ్ల శేఖర్‌రెడ్డి(భువనగిరి), గొంగిడి సునీత(ఆలేరు)తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టిక్కెట్లను గురువారం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రాష్ట్రంలో మరో 14 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా.. ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాజా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన హుజూర్‌నగర్, ఆయన భార్య పద్మావతి ప్రాతినిథ్యం వహించిన కోదాడ స్థానాలకు కూడా త్వరలోనే అధికార పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఉమ్మడి జిల్లా అంతటా 10మంది అభ్యర్థులను అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే ప్రకటించి స్పష్టత ఇవ్వడంతో.. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. పటాకులు కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన షాక్‌తో ఇప్పట్లో కోలుకోలేని స్థితిలోకి ప్రతిపక్షాలు వెళ్లాయి.

మునుగోడు
పేరు : కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
తల్లిదండ్రులు : జంగారెడ్డి, కమలమ్మ
భార్య : అరుణ
కొడుకు, కూతురు : శ్రీనివాస్‌రెడ్డి, రమ్య
ప్రస్తుత యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగంవారిగూడెం కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వస్థలం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన.. బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశారు. 1980 దశకంలోనే ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగానే పీడీఎస్‌యూ ద్వారా విద్యార్థి ఉద్యమ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్జీ కాలేజీ పీడీఎస్‌యూ అధ్యక్షుడిగా ప్రాతినిథ్యం వహించారు. 2002 నుంచి టీఆర్‌ఎస్‌లో పార్టీలో పని చేస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2009లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 సాధారణ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు. గడిచిన నాలుగేండ్లుగా వెనుకబడ్డ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ప్రతి నిత్యం జనంలోనే తిరుగుతూ వారితో మమేకమయ్యారు.

ఘన విజయంతో నమ్మకం నిరూపించుకుంటా
నాపై నమ్మకం ఉంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు జన్మంతా కృతజ్ఞుడిని. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. మా అధినేత కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చారు. 2009లో మహేశ్వరం నుంచి.. 2014లో మునుగోడు నుంచి అవకాశం కల్పించారు. మళ్లీ ఈసారి మునుగోడు నుంచి అవకాశం కల్పించి ఇక్కడి ప్రజలకు రెండోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో మళ్లీ గెలిచి కేసీఆర్‌తోపాటు ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా.

సూర్యాపేట
పేరు : గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
తల్లిదండ్రులు : సావిత్రమ్మ, రామచంద్రారెడ్డి
భార్య : సునీత
కొడుకు, కూతురు : వేమన్‌రెడ్డి, లహరి
ప్రస్తుత సూర్యాపేట జిల్లా నాగారంలో 1965జూలై 18న వ్యవసాయ కుటుంబంలో గుంటకండ్ల జగదీష్‌రెడ్డి జన్మించారు. బీఏ, బీఎల్ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2001లో ఉద్యమ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగిన నాటి నుంచీ జగదీష్‌రెడ్డి వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2001లోనే సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులయ్యారు. 2001సిద్దిపేట ఉపఎన్నిక మొదలు 2003 మెదక్ ఉప ఎన్నిక, 2004 సిద్దిపేట ఉప ఎన్నిక, 2006 కరీంనగర్ ఎంపీ ఉప ఎన్నిక, 2008లో ముషీరాబాద్, ఆలేరు ఉప ఎన్నికలు సహా ఇంకా పలు ఎన్నికల్లో ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో హూజూర్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది నుంచి సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014ఎన్నికల్లో సూర్యాపేట నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది.. తెలంగాణలో తొలి విద్యాశాఖ మంత్రిగా, ఆ తర్వాత విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేసిన ఆయన.. ప్రస్తుతం మరోసారి సూర్యాపేట అభ్యర్థిగా పోటీ చేయనుండడమే కాకుండా ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా కూడా ప్రాతినిథ్యం వహించనున్నారు.

నాగార్జున సాగర్
పేరు : నోముల నర్సింహయ్య
తల్లిదండ్రులు : మంగమ్మ, రాములు
భార్య : లక్ష్మి
కొడుకు : భగత్ కుమార్, హైకోర్టు న్యాయవాది
కూతుళ్లు : ఝాన్సీరాణి, అరుణజ్యోతి
నకిరేకల్ మండలం, పాలెం గ్రామానికి చెందిన నోముల నర్సింహయ్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగారు. రాజనీతి శాస్త్రంలో పీజీతోపాటు న్యాయవాద విద్యను సైతం అభ్యసించిన ఆయన నకిరేకల్, నల్లగొండల్లో న్యాయవాదిగా పనిచేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత సీపీఐ(ఎం)నాయకుడిగా కొనసాగారు. రెండుసార్లు నకిరేకల్ ఎంపీపీగా ప్రాతినిథ్యం వహించారు. 1999, 2004లో నకిరేకల్ నుంచి సీపీఐ(ఎం) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా.. 2004 నుంచి 2009 వరకు ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా కీలకపాత్ర పోషించారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గడిచిన నాలుగేళ్లుగా నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతినిత్యం జనంతో మమేకం అవుతున్నారు.

గెలుస్తాం.. కానుకగా ఇస్తాం..
ఎవరూ ఊహించని రీతిలో.. ముందే చెప్పినట్టు అభ్యర్థులను ముందే ప్రకటించారు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలో కేవలం 14 స్థానాలు మాత్రమే ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచగా.. మన దగ్గర కోదాడ, హుజూర్‌నగర్ మాత్రమే ప్రకటించాల్సి ఉంది. 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు సైతం టిక్కెట్లు ఖరారైన నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు కానుకగా అందిస్తామని చెప్తున్నారు ఖరారైన టీఆర్‌ఎస్ అభ్యర్థులు. రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేపట్టేందుకు.. అర్థంపర్థం లేని విమర్శలు చేసే ప్రతిపక్షాల నోరు మూయించడం కోసమే అసెంబ్లీ రద్దు జరిగిందని వివరిస్తున్నారు.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...