అక్షర సైనికుడికి అరుదైన గౌరవం


Fri,December 8, 2017 01:47 AM

-తెలుగు మహాసభల్లో సన్మానం అందుకోనున్న డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య
యాదాద్రిభువనగిరి ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 19 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ సాహితివేత్త , మధుర కవి డాక్టర్ కూరేళ్ల విఠలాచార్యను ఘనంగా సత్కరించనున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి సేవలు అందిస్తున్న సాహితీ ప్రముఖులకు జరిగే సత్కారానికి డాక్టర్ కూరేళ్ల ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు గురువారం సమాచారం అందింది. సాహితీలోకంలో పల్లెపట్టున ఉంటూ తెలంగాణం విన్పించిన కవికి అరుదైన గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 16న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో సత్కరించనున్నారు. డాక్టర్ కూరేళ్ల ఇప్పటివరకు 30 గ్రంథాలను వెలువరించారు. పలు సాహిత్య సంస్థలను నెలకొల్పారు. తెలంగాణ తొలి మలి ఉద్యమంలో మమేకమైన ఉద్యమశీలి. తన సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి ఇప్పటివరకు దాదాపు 25 వేల గ్రంథాలను సమకూర్చారు.

గర్వకారణమైన కవిగా సుపరిచితులు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళా రంగాల్లో కృషి చేసిన మహానీయులను సత్కరించే మహత్కార్యానికి సీఎం కేసీఆర్ రూపకల్పన చేయడంతో విఠలాచార్యకు అపూర్వమైన గౌరవం దక్కింది. తెలుగు సాహిత్యంపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలుగు రేఖలు ప్రసరింపజేసిన విఠలాచార్యకు అరుదైన గౌరవం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ తొలి, మలి ఉద్యమాలను తన కవితలు, రచనలతో ప్రభావితం చేసిన విఠలాచార్యకు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎంతోమంది శిష్యులు ఉన్నారు. తెలంగాణ వైభవాన్ని చాటుతూ తెలంగాణ మట్టి మనుషులకు తన కవితల ద్వారా ఉత్తేయిజాన్ని ఇచ్చిన గొప్ప సాహితీవేత్త. నవభారత నిర్మాణానికి అవసరమైన రచనలు ఎన్నో చేశారు. సామాజిక స్పృహాను కలిగించడం కోసం, వారి హక్కుల కోసం సాధికార కల్పన కోసం రచనలు చేశారు.

బాల్యదశ నుంచే..
ఉపాధ్యాయుడిగా, లెక్చరర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం వెల్లంకిలో ఉంటున్నారు. బాల్యదశ నుంచే కవిత్వం రాస్తూ వస్తున్న డాక్టర్ కూరేళ్ల రచనల్లో విఠలేశ్వర శతకం ఆయనకు గొప్పపేరును తీసుకువచ్చింది. తెలంగాణ కాగడాలు, మావూరి వెలుగు, దొందు దొందె, శిల్పాచార్యులు, కాన్ఫిడెన్షియల్ రిపోర్టు, తెలంగాణోద్యమ కవిత ఇలా.. దాదాపు 30 గ్రంథాలను వెలువరించారు. అభినవ పోతన, మధుర కవి, సాహిత్య బ్రహ్మ, సాహిత్య ప్రపూర్ణ, అక్షర కళాసామ్రాట్ వంటి బిరుదులను అందుకున్నారు. పాఠశాల, కళాశాలల్లో పనిచేసే సందర్భంలో అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. సృజనాత్మకతను కలిగించారు. మలివెలుగు, చిరంజీవి, ప్రియంవధ, ముచికుంద, లెఖిని వంటి పత్రికలకు జీవం పోశారు. అంతేకాకుండా పల్లెపట్టుల్లో సాహిత్యం విరబూయడానికి అక్షర కళాభారతి, భువన భారతి, మల్లెల భారతి, యాదాద్రి జిల్లా రచయితల సంఘం ఇలా దాదాపు 25 సాహితి సంస్థలను స్థాపించారు.

వందల సంఖ్యలో పురస్కారాలు..
డాక్టర్ కూరేళ్ల వందల సంఖ్యలో పురస్కారాలు అందుకున్నారు. బి.ఎన్.రెడ్డి, సుద్దాల హన్మంతు, అక్షర కళాభారతి, తేజ ఆర్ట్స్, పోతన విజ్ఞాన పీఠం ఇలా పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందారు. శాతావాహన విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారంతో గౌరవించింది. చింతల ఫౌండేషన్, సోమనాథ కళాపీఠం కూడా కూరేళ్లకు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. అంతేకాకుండా వీరి సాహిత్యంపై డాక్టర్ నాగపురి శ్రీనివాసులు, రెబ్బ మల్లిఖార్జునలు పరిశోధన చేసిన డాక్టరేట్ పట్టా అందుకున్నారు. పల్లెలను అమితంగా ప్రేమించే కూరేళ్ల తన ఇంటిని గ్రంథాలయంగా మార్చిన నిజమైన అక్షర ప్రేమికుడుగా ప్రశంసలు అందుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే సీనియర్ సాహితివేత్తగా గుర్తింపు పొందారు. ఆయన సాహితీ జీవితం ఎంతో మంది కవులకు ఆదర్శం.

జిల్లా రచయితల సంఘం హర్షం..
జిల్లాలోనే సీనియర్ సాహితివేత్తగా గుర్తింపును పొందిన డాక్టర్ కూరేళ్లకు అరుదైన గౌరవం దక్కడంపై జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, ప్రధాన కార్యదర్శి గుడిపల్లి వీరారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భావజాలాన్ని ప్రేరెపించిన విఠలాచార్యకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అరుదైన గౌరవం అందించారని కోనియాడారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...