నలుగురు ఉత్తములు..!


Tue,March 7, 2017 02:24 AM

-మహిళా దినోత్సవ రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక
-ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు మహిళలకు స్థానం
-ప్రజా గాయకురాలు చైతన్య, జర్నలిస్టు కట్టా కవిత
-ఆదర్శ వ్యవసాయవేత్తగా వరికుప్పల నాగమణి
-స్త్రీవాద కవయిత్రి డా.షాజహానాకు అవార్డులు

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తన గళంతో తెలంగాణ ఉద్యమ విస్తృతిని వ్యాప్తి చేసిన గాయకు రాలు ఒకరు.. జర్నలిస్టుగా సమాజాన్ని మేల్కొలుపుతోన్న మహిళా రచయిత మరొకరు.. ఆధునిక వ్యవసాయంతో ఆదర్శ రైతుగా నిలిచిన అతివ ఇంకొకరు.. పదునైన పదజాలంతో ముస్లిం, స్త్రీవాద కవిత్వంతో సాగిపోతోన్న రచయిత్రి మరొకరు.. వెరసి మహిళా సమాజంలో తమదైన పాత్రతో చైతన్య కాంతులు వెలిగిస్తోన్న ఈ నలుగురినీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా అవార్డులకు ఎంపిక చేసింది. గాయకురాలు మారోజు చైతన్య, జర్నలిస్టు కట్టా కవిత, వ్యవసాయవేత్త వరికుప్పల నాగమణి, స్త్రీవాద కవయిత్రి డాక్టర్ షాజహానా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వీళ్లంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకోనున్నారు.

అవకాశాల్లో సగం.. ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అంటూ వేగంగా దుసుకెళ్తున్న మహిళా లోకానికి మరింత స్ఫూర్తినిస్తున్న ఉత్తములను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రేపటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 24మంది ఉత్తమ మహిళలను గుర్తించి.. అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తోన్న ఆ 24మందిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు నలుగురున్నారు. అందులో నల్లగొండ జిల్లాకు చెందిన జర్నలిస్టు కట్టా కవిత.. సూర్యాపేట జిల్లా నుంచి ఆదర్శ రైతు వరికుప్పల నాగమణి.. యాదాద్రి-భువనగిరి జిల్లా నుంచి గాయకురాలు మారోజు చైతన్యతోపాటు ఖమ్మం జిల్లా వాసి నల్లగొండ కోడలు అయిన డాక్టర్ షాజహానా ఉన్నారు. ఆ ఆదర్శప్రాయుల గురించి మచ్చుకు కొంత.

ఆదర్శ వ్యవసాయవేత్త వరికుప్పల నాగమణి...


వరికుప్పల నాగమణి.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోసపాడు నివాసి. భర్త శ్రీనివాస్ సహకారంతో పక్కనే ఉన్న అనాజీపురంలో నాలుగు ఎకరాల భూమిలో ఆదర్శ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. సేద్యానికి అంత సానుకూలంగా లేని భూమిని కొనుగోలు చేసినప్పటికీ..

ఆ భూమిలో పరుచుకున్న రాళ్లను తొలిగించి పైన కొత్తగా మట్టిపోసి సాగు చేపడుతున్నారు. కుటుంబ అవసరాలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నా.. అడపాదడపా మాత్రమే వ్యవసాయాన్ని పరిశీలించే అవకాశం ఉన్నా.. వినూత్న ఆధునిక పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తుండడం విశేషం. ఆవు పేడ, ఆవు మూత్రం, వేప నూనె, వేప కషాయంతో సేంద్రియ పద్ధతిలో సహజ ఎరువులను తయారు చేయడమే కాకుండా..

ఆ ఎరువులను డ్రిప్ సిస్టమ్ ద్వారా నేరుగా మొక్కల వేర్లకు అందిస్తూ అధిక దిగుబడులను సాధించారు నాగమణి.మల్చింగ్‌తోపాటు పంటను నాశనం చేసే కీటకాల నిరోధానికి లింగాకర్షక బుట్టలు, విద్యుత్ బల్బుల వంటివి సైతం ఉపయోగిస్తున్నారు. ఎకరాకు 50క్వింటాళ్ల మిర్చి దిగుబడి సాధించిన రైతుగా.. ఇప్పటికే జాతీయ స్థాయిలోనూ మహీంద్రా అవార్డును సైతం నాగమణి అందుకున్నారు. తాజాగా తనను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా రైతుగా గుర్తించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ప్రముఖ జర్నలిస్టు, రచయిత కట్టా కవిత...


నల్లగొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామంలోని కట్టా వెంకటేశం, భారతమ్మ పెద్ద కుమార్తె కట్టా కవిత. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన కవిత.. గ్రామం నుంచి ఉన్నత విద్యను అభ్యసించిన అతి తక్కువ మంది మహిళల్లో ఒకరు కావడం విశేషం. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే చదువు పూర్తి చేశారు. విద్యార్థిగా ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమంలో నల్లగొండ జిల్లా అధ్యక్ష బాధ్యతలు సైతం నిర్వహించిన అనంతరం..

2004లో జర్నలిజంలోకి ప్రవేశించారు. ప్రజాశక్తి పత్రిక ద్వారా మీడియాలోకి వచ్చి.. పలు పత్రికలు, టీవీ మీడియాల్లోనూ జర్నలిస్టుగా సేవలు అందించారు. విద్యార్థి దశలోనే సామాజిక సమస్యలపై పోరాటం చేసిన ఆమె.. జర్నలిస్టుగాను తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తనతోపాటు ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడి బాధ్యతలు సైతం చూస్తూనే జర్నలిస్టుగా, రచయితగా సామాజిక సమస్యలను వెలుగెత్తి చాటారు. నమస్తే తెలంగాణ దినపత్రిక జిందగీలోనూ పనిచేశారు.

నమస్తే తెలంగాణ జిందగీ ద్వారా తనకు కొత్త జీవితం లభించిందని అన్నారు. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశమిచ్చిన జిందగీతోపాటు.. తన ఎదుగుదలకు ఎంతగానో ప్రోత్సహించిన అమ్మానాన్నలతోపాటు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సరస్వతీ రమకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుగానే గాకుండా తెలంగాణ ఉద్యమకారిణిగా తాను పోషించిన పాత్రకే ఈ అవార్డు లభించినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణ, ముస్లిం, స్త్రీవాద కవయిత్రి డా. షాజహానా...


ఖమ్మం జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన షాజహానా.. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ముస్లింవాద రచయిత స్కైబాబాను వివాహమాడి ఈ జిల్లాకు కోడలయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో ముస్లింవాద సాహిత్యంపై చేసిన పరిశోధనకు గాను పీహెచ్‌డీ పట్టా పొందారు. అస్మిత, షాహీన్ వంటి పలు ఎన్జీఓలతోపాటు వెలుగు ప్రాజెక్టులోనూ డాక్టర్ షాజహానా పని చేశారు. తన భర్త స్కైబాబాతో కలిసి ఆమె సఖాబ్, చాంద్ తార, దర్దీ, అలావా, లద్దాఫ్ని పేరుతో పలు పుస్తకాలు రాశారు. కొన్ని సంకలనాలకు, పలు పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. భారత ప్రభుత్వ గౌరవ అతిథిగా 2006లో జర్మనీలో జరిగిన ఫ్రాంక్‌ఫర్డ్ బుక్ ఫేర్‌తోపాటు 2009లో రష్యాలో జరిగిన మాస్కో బుక్‌ఫేర్‌లోనూ షాజహాన కవితా పఠనం చేశారు.

రంగవల్లి మెమోరియల్‌తోపాటు సంస్కృతి, రంగినేని ఎల్లమ్మ, వెంకట సుబ్బు, గుర్రం జాషువా వంటి పలు అవార్డులను సైతం పొందారు. తాజాగా తనను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ స్త్రీవాద రచయితగా రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆమె.. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచుతోందని చెప్పారు. సమాజంలో పరిష్కారం దొరకని అనేక సమస్యలను సాహిత్యం ద్వారా తాను సమాధానం రాబడుతున్నాని.. ఆ సాహిత్యం మళ్లీ సమాజానికి దోహదపడుతోందని డా.షాజహానా తెలిపారు.

ప్రజా గాయకురాలు మారోజు చైతన్య...


యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన చైతన్య.. ప్రముఖ ప్రజా గాయకుడు మారోజు వీరన్న భార్య. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు వేదికల పై గళమెత్తి రాష్ట్రకాంక్షను చాటిన ఆమె.. తల్లి తెలంగాణ.. రేలా రేలా.. పాటల ద్వారా గుర్తింపు పొందారు. విప్లవోద్యమంలో ఉన్న సమయంలోనే మారోజు వీరన్నను వివాహం చేసుకున్న చైతన్య.. తెలంగాణ ఉద్యమంలో పదేళ్లకు పైగా పాటల ద్వారా చైతన్యం రగిలించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారంతోపాటు పలు అవార్డులు కైవసం చేసుకున్నారు. కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ సాధనలో తన గళం ద్వారా పాలు పంచుకున్న ఆమె.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సారథి సంస్థలో గాయకురాలిగా సేవలందిస్తున్నారు.

432
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...