మార్ట్ ట్రెండ్‌


Sun,December 15, 2019 03:19 AM

-రిటైల్‌ బిజినెస్‌ హబ్‌గా ఓరుగల్లు
-హైదరాబాద్‌కు దీటుగా వెలుస్తున్న కార్పొరేట్‌ సంస్థలు
-కిరాణా దుకాణాల స్థానాల్లో భారీ షాపింగ్‌మాళ్లు
-సందడి చేస్తున్న వాల్‌మార్ట్‌, డీమార్ట్‌, స్పెన్సర్‌, రిలయెన్స్‌, మోర్‌
-సందుల్లోనూ పెరిగిన సూపర్‌ మార్కెట్లు
-మార్పు కోరుతున్న నగర ప్రజలు.. ఆధునిక హంగులు, ఆఫర్లపై ఆసక్తి
రెడ్డికాలనీ, విలేకరి : గతంలో పెద్ద పెద్ద షాపుల వైపు కన్నెత్తి చూడాలంటే మధ్య తరగతి మనుషులు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాళ్లు. ఇంటి పక్కన కిరాణా దుకాణం ఉంటే ఉద్దెరకు సామాన్లు తీసుకోవడమో లేదంటే బేరం ఆడినా గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు షాపింగ్‌మాళ్లు వచ్చాక ఎమ్మార్పీ ఎంత ఉంటే అంత ఇచ్చుకోక తప్పదు. అయితే, ఇదంతా గతం. కొన్ని వస్తువులు మార్కెట్‌ రేటు కంటే తక్కువకే లభిస్తుండటం.. వస్తువు నాణ్యత కూడా బాగుండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మాల్స్‌ వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో అమెరికా మార్కెట్‌లో విజృంభిస్తున్న వాల్‌మార్ట్‌, దేశంలో సంచలనం సృష్టించిన డీమార్ట్‌లాంటి సంస్థలు వరంగల్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక హంగులు, నాణ్యమైన వస్తువులు, ఒకటికి బదులు నాలుగు కొంటే మరొకటి ఉచితంలాంటి ఆఫర్లు ఊరిస్తుండటంతో ఇప్పుడు నగరంలో మార్ట్‌ ట్రెండ్‌ నడుస్తున్నది.

ఓరుగల్లు మహానగరం ఎప్పటికప్పుడు తన రూపురేఖలు మార్చుకుంటున్నది. కాకతీయుల రాజధానిగా దేశ చరిత్రలో నిలిచిన ఈ నగరం.. నేటి యువతరానికి తగినట్లుగా ఆధునిక హంగులకు ఆలవాలంగా మారుతున్నది. రాష్ట్ర రాజధానితో పోటీ పడుతూ తన అస్థిత్వాన్ని నిలుపుకుంటున్నది. బంగారం కొనుగోళ్లు, అమ్మకాల్లో వరంగల్‌ది ఒకప్పటినుంచి ప్రముఖస్థానం. కార్ల విక్రయాల్లోనూ దూసుకుపోతున్న నగరం.. రిటైల్‌ మార్కెట్‌లోనూ తన దేశ, విదేశీ సంస్థలను ఆకర్షిస్తున్నది. హైదరాబాద్‌ లాంటి మహానగరాలకే పరిమితమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. వరంగల్‌ కొత్త పుంతలు తొక్కుతూ ఎన్నో, మరెన్నో నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా రూపుదాల్చుతున్నది. చిన్న పిల్లల నుంచి మొదలు అందరికీ కావాల్సిన వస్తువులను ఒకే గొడుగు కింద లభిస్తున్నాయి. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా నగరంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, కార్పొరేట్‌ సంస్థలు వెలుస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్‌, స్పెన్సర్‌, మోర్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలు అందుబాటులో ఉన్నా నూతనంగా డీమార్ట్‌, వాల్‌మార్ట్‌ అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల్లో ఇలాంటి సంస్కృతి కొనసాగుతుండగా.. ఇప్పుడు ప్రత్యేకించి మెట్రో నగరాలకు దీటుగా వరంగల్‌లో కూడా వెలుస్తున్నాయి. మల్టీనేషనల్‌ కంపెనీలు హైదరాబాద్‌ తరహాలో ఇప్పుడు వరంగల్‌లో కూడా తమ కార్యకలాపాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఒక దశలో ప్రజలు ధరించే దుస్తుల నుంచి మొదలు ఇంట్లోకి కావల్సిన సామగ్రి అన్ని ఒకే చోట ఆవిష్కృతమవుతున్నాయి. అంతేకాకుండా ఆ సంస్థలు కొన్ని వాటిపై ఆఫర్లతో పాటు ఒకటి కొంటే మరొకటి ఉచితంగా అందిస్తున్నారు. దీంతో నగర ప్రజలు ఎక్కువగా వాటిపై ఆసక్తి చూపుతున్నారు.

అన్ని ఒకే చోట
ఒకప్పుడు కూరగాయలు కొనాలంటే.. మార్కెట్‌కు, సరుకుల కోసం కిరాణా దుకాణానికి, దుస్తుల కోసం క్లాత్‌స్టోర్లు, చెప్పుల కోసం మరోటి చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువుకు ఒక్కో షాపునకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మార్ట్‌ల రాకతో అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి.. దీంతో వినియోగదారుడికి సమయం కలిసివస్తున్నది. తాజా కూరగాయల నుంచి మొదలుకుని అన్నీ అందుబాటులోకి వచ్చాయి. వాటి ధరలు కూడా బోర్డుపై స్పష్టంగా రాసి ఉంచుతున్నారు. చికెన్‌, మటన్‌ కోసం ప్రత్యేకంగా కౌంటర్లు పెడుతున్నారు. మహిళల ఆభరణాలు, దుస్తుల నుంచి గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్‌ పరికరాల వరకు లభిస్తున్నాయి. దీంతో ప్రజలు ఎక్కువగా కార్పొరేట్‌ సంస్థల్లో షాపింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అందరికీ అందుబాటుల్లో కావాల్సినవన్నీ లభిస్తున్నాయి. దీంతో నగరంలో వీటి సంఖ్య కూడా పెరుగుతున్నాయి.

కుటుంబ సమేతంగా కొనుగోలు..
ఉరుకులు పరుగుల పోటీ ప్రపంచంలో కుటుంబంతో కలిసి సమయం గడపడానికి తీరిక దొరకడం లేదు. షాపింగ్‌మాళ్ల కారణంగా.. ఇటు షాపింగ్‌ చేస్తూనే కుటుంబంతో గడిపామన్న సంతోషాన్ని పొందుతున్నారు. అందుకే షాపింగ్‌మాల్స్‌ కుటుంబాలకు ఆటవిడుపుగా మారుతున్నది. చంటి పిల్లలతో ఫ్యామిలీ సరదాగా షాపింగ్‌ చేస్తున్నారు. ఎవరికి కావల్సిన వస్తువులు వారు ఎంపిక చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోజు ఉపయోగించే వస్తువుల నుంచి ఇంట్లోకి కావల్సిన సరుకుల కోసం అందరూ కలిసి షాపింగ్‌ చేస్తున్నారు. చిన్న పిల్లల కోసం చాక్లెట్ల నుంచి ఐస్‌క్రీమ్స్‌ వరకు అన్ని అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకంగా ఐస్‌క్రీమ్‌ పార్లర్లకు వెళ్లాల్సిన పనిలేకుండా ఇక్కడే తినేలా నోరూరిస్తున్నాయి. కొందరు అక్కడే షాపింగ్‌ చేస్తూ చాక్లెట్స్‌, స్నాక్స్‌, ఐస్‌క్రీమ్స్‌, కూల్‌డ్రింక్స్‌తో ఎంజాయ్‌ చేస్తున్నారు. సరదా కాసేపు కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడంతో పాటు షాపింగ్‌ చేసినట్లు కూడా ఉంటుందని కొందరు అంటున్నారు.

మెంబర్‌షిప్‌ కార్డు తప్పనిసరి
వరంగల్‌ నగరంలో నూతనంగా ప్రారంభించిన వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేయాలంటే కార్డు తప్పనిసరి. అందులోకి ప్రవేశించాలంటే మెంబర్‌షిప్‌ కార్డు ఉండాల్సిందే. ట్రేడ్‌లైసెన్స్‌ కలిగిన ప్రతి దుకాణాదారుడితో పాటు మరో నలుగురుకి ప్రత్యేకంగా వాల్‌మార్ట్‌ ద్వారా మెంబర్‌షిప్‌ కార్డు అందిస్తున్నది. ఈ కార్డు చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు. వేల సంఖ్యలో ఉన్న కార్డుదారులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేస్తున్నారు. చిన్నచిన్న దుకాణాలు నిర్వహించే యజమానులకు వాల్‌మార్ట్‌ ఎంతో ఉపయోగకరంగా మారింది. హోల్‌సేల్‌ షాపుల్లో నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి వారి షాపుల్లో అమ్ముతున్నారు. చిరువ్యాపారులకు తక్కువ మరికొన్ని కార్పొరేట్‌ సంస్థల్లో ఆయా సంస్థలకు సంబంధించిన కార్డులో రాయితీ సదుపాయాన్ని కూడా కల్పిస్తుండటం విశేషం. సుమారు వంద మంది వరకు ఇందులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వారి విద్యకు తగినవిధంగా వేతనాలు అందిస్తున్నారు.

ఆఫర్ల మోత
షాపుల నిర్వాహకులు కొత్త ఒరవడిని ప్రదర్శిస్తూ అందుకు తగినట్లుగా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో వెలుస్తున్న కార్పొరేట్‌ సంస్థల పోటీతత్వాన్ని తట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు కావాల్సినవన్నీ ఒకే దగ్గర అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేకంగా ఆఫర్లతో ఆకట్టుకున్నారు. నగరంలో నూతనంగా వెలుస్తున్న కార్పొరేట్‌ సంస్థల్లో ఆఫర్ల మోత మోగుతోంది. వాడే సబ్బు నుంచి ఇంట్లోకి కావాల్సిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు సైతం ఒకేచోట దర్శనమిస్తున్నాయి. పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కార్పొరేట్‌ సంస్థలు ఎన్నో ఆఫర్లు, బహుమతుల రూపంలో పలు రకాల వస్తువులను తీసుకువస్తున్నాయి. ఇతర సంస్థల కంటే తాము దీటుగా ఉండాలని కనిష్ట చిల్లర ధరతో వస్తువులు అమ్మేందుకు పోటీ పడుతున్నాయి. దీంతో కొన్ని అంశాల్లో కార్పొరేట్‌ సంస్థల్లో కొనుగోళ్లు వినియోగదారులకు లాభదాయకమే అవుతున్నది. నిజానికి ఎమ్మార్పీ గరిష్ఠ చిల్లర ధర అంటే ఒక రాష్ట్రం లేక దేశవ్యాప్తంగా ఈ వస్తువును ఇంతకుమించి ధరకు అమ్మడానికి వీలులేదని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, కార్పొరేట్‌ సంస్థలు భారీ మొత్తంలో వస్తువులు విక్రయిస్తుండటంతో ఎమ్మార్పీకంటే కొంత తక్కువ విక్రయిస్తున్నాయి. దీంతో లాభాన్ని కొంత తగ్గించుకుంటున్నా.. అధిక మొత్తంలో విక్రయాలు ఉండటంతో లాభాల్లోనే నడుస్తున్నాయి. అయితే, కండ్లముందు అనేక ఆఫర్లు కనిపిస్తుండటంతో వినియోగదారులు చాలా వస్తువులు అవసరం లేకపోయినా కొనుగోలు చేసి జేబులు ఖాళీ చేసుకుంటున్న సందర్భాలూ ఉంటున్నాయి. చాలామంది యువత ప్రస్తుతం ఫలానా మాల్‌లో ఈ వస్తువులపై ఆఫర్‌ బాగుందని సోషల్‌మీడియాలో చేస్తున్న ప్రచారంతో వినియోగదారులకు లాభాన్ని చేకూరుస్తున్నది.
జిల్లాస్థాయి క్రీడల్లో
పాలిటెక్నిక్‌ విద్యార్థినుల ప్రతిభ

మట్టెవాడ: వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి పాలిటెక్నిక్‌ క్రీడాల్లో వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్‌ డీ శోభారాణి తెలిపారు. వ్యక్తిగత అథ్లెటిక్‌ విభాగంలో జీ భవాని ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించిందని చెప్పారు. వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను శనివారం ఆమె అభినందించారు. తమ విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడానికి సహకరించిన వివిధ శాఖాధిపతులతో పాటు, ఇన్‌చార్జి ఫిజికల్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డికి ప్రిన్సిపాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...