కమనీయం..రాములోరి కల్యాణం


Mon,November 18, 2019 05:10 AM

-జనగామ జిల్లా జీడికల్ ఆలయంలో కనుల పండువగా శ్రీసీతారాముల పెండ్లి
-తిరు కల్యాణానికి కదిలొచ్చిన భక్తజనం
-పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
-స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
లింగాలఘనపురం, నవంబర్17: రాములోరి కల్యాణం.. రమణీయం. ఎన్నిసార్లు చూసినా కమనీయమే. రామయ్య..సీతమ్మ పెండ్లి తంతు చూడా రెండు కనులు చాలవు. జయజయ నాదాలతో జనం తరలిరాగా.. సూడసక్కని జంట కోసం ఆకాశమంతా పందిరై.., నేలంతా కల్యాణ వేదికవ్వగా..నక్షత్రాలే అక్షింతలయ్యాయి. ఈ మహా దేవుడి కల్యాణ క్రతువు ఆదివారం జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం జీడికల్ వైభవంగా సాగింది. తిరుకల్యాణాన్ని వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ప్రధాన ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తులను సేవ పైకి చేర్చి ఆలయం వెలుపల ఉన్న కల్యాణవేదికపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వం తరుఫున స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పట్టు వస్ర్తాలను తెచ్చి అర్చకులకు అప్పగించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాక్‌రావు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పునర్వసు నక్షత్ర యుక్త పుష్కరాంశ సుముహూర్తాన శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. కల్యాణాన్ని తిలకించేందుకు జనగామ జిల్లా నుంచే కాకుండా, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాల నుంచి తరలివచ్చారు. శ్రీరాముడి కల్యాణాన్ని కనులారా చూసి తరించిపోయారు. డీసీపీ శ్రీనివాస్‌రెడ్డితో పాటు 56 జంటలు రూ.1516 చెల్లించి కల్యాణం జరిపించారు.

రాముడి దీవెనలతో సస్యశ్యామలం
-ఎమ్మెల్యే రాజయ్య
చిన్నప్పటి నుంచి జీడికల్ ఉత్సవాల్లో పాల్గొంటున్నానని, రాముడి దీవెనలతో నియోజకవర్గం సస్యశ్యామలం అవుతున్నదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన స్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఎప్పుడు ఎన్నికల బరిలో నిలిచినా ఈ ఆలయంలోనే మొదట పూజలు చేసి ప్రచారం చేపడుతూ విజయాలు సాధిస్తున్నానని చెప్పారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయ దేవతామూర్తుల దీవెనలతో నియోజకవర్గంలోని ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపుతానన్నారు. ఏటా రెండు పర్యాయాలు కల్యాణం జరపడం ఈ ఆలయ ప్రత్యేకత అన్నారు. ఉత్సవాల్లో తనకు భాగస్వామ్యం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా శ్రమిస్తానని పేర్కొన్నారు.

ప్రతి చెరువును నింపుతా
లింగాలఘనపురం మండలాన్ని తన నియోజకవర్గంలో అంతర్భాగంగా భావించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గోదావరి జలాలతో అన్ని మండలాలు సాగు నీటికి తిప్పలు లేకుండా ఉంటే.. ఈ మండలంలో కొరత ఉండడం బాధాకరమన్నారు. మండలంలో ఏ కార్యక్రమం జరిగినా.. తాను పాల్గొన్నా... ప్రధానంగా సాగు నీటి సమస్యనే ప్రజలు లేవనెత్తుతున్నారన్నారన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి తాను సీఎం కేసీఆర్‌కు ఇక్కడి పరిస్థితిని వివరిస్తానని చెప్పారు. తాను ఇప్పటి వరకు ఏ హామీ ఇచ్చినా ఆ పని పూర్తి చేసి మాట నిలుపుకున్నానని పేర్కొన్నారు. ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఉంటానని, ఆరునూరైనా ఆరు నెలల వ్యవధిలో లింగాలఘనపురంలోని ప్రతి చెరువునూ గోదావరి జలాలతో నింపుతానని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ, జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్, వైస్‌ఎంపీపీ కొండబోయిన కిరణ్‌కుమార్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు వంచ మనోహర్‌రెడ్డి, ఈవో శేషుభారతి, నాయకులు బోయిని రాజు, చిట్ల ఉపేందర్‌రెడ్డి, గవ్వల మల్లేశం, గట్టగల్ల యాదగిరి, ఉడుగుల భాగ్యలక్ష్మి, లింగాల సింధు, తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ గంధం మనోహర్ నేతృత్వంలో సీఐ చంద్రశేకర్‌గౌడ్, ఎస్సైలు సంతోశం రవీందర్, సూరం వేణుగోపాల్ శాంతిభద్రతలను పర్యవేక్షించారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...