పుణ్యప్రదం..కార్తీక దీపం


Wed,November 13, 2019 03:14 AM

ఖిలావరంగల్‌, నవంబర్‌ 12: భక్తి మార్గానికి సోపానం కార్తీకదామోదర మాసం. ఈ మాసంలో ప్రతి దినం పండుగే.. ప్రతి రోజుకు ఒక విశిష్టత ఉంది. ఈ మాసంలో అత్యంత పుణ్యప్రదమైన రోజు కార్తీక పౌర్ణమి. నెలంతా కార్తీక మాసం విధులు ఆచరించలేని వారు ఈ ఒక్క రోజు చేసే పూజ వల్ల ఎన్నో సత్ఫలితాలు లభిస్తాయన్నది శాస్త్ర వచనం. దీంతో మంగళవారం వేకువజాము నుంచి శైవ క్షేత్రాలన్ని శివనామస్మరణతో మారిమోగిపోయాయి. చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని స్వయంభు శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం, శివనగర్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, శంభునిపేట గణపతి ఆల యం, విశ్వనాథకాలనీలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం, ఖిలావరంగల్‌ రోడ్డులోని శ్రీ శిరిడీసాయి సేవా సమాజ్‌ మందిర్‌తోపాటు పడమర కోటలోని బొడ్రాయి స్థలం వద్ద భక్తులు దీపాలు వెలిగించారు. శంభులింగేశ్వరునికి ఉద యం నుంచి ఆలయ అర్చకులు శీలమంతుల శంభులింగ రుద్రాభిషేకాలు, సామూహిక అర్చనలు చేశారు. గోధూలి వేళ శివలింగానికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. అనంతరం భక్తుల నుంచి దీప దానాలు స్వీకరించారు. అలాగే ఆలయంలోని ఉసిరి చెట్టు కింద మహిళలు దీపాలు వెలిగించి యథాశక్తి దానం చేశారు. శివనగర్‌ రామాలయంలో జ్వాలాతోరాణాన్ని వెలిగించారు. శివుడు, నంది, స్వస్తిక్‌, పుష్పం, ఓంకారం ఆకారాల్లో దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి దీపోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. శివగణేశ్‌ ఆలయంలో 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్‌ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. అలాగే 8,9 డివిజన్ల కార్పొరేటర్లు దామోదర్‌ యాదవ్‌, సోమిశెట్టి శ్రీలత కార్తీక పూజల్లో పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...