మట్టి పూల ‘వేణు’వు


Wed,November 13, 2019 03:14 AM

(వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) వేణు సంకోజు. నల్గొండ ఖిల్లా మీద తెలంగాణ అక్షర జెండా ఎగురవేసిన అగ్రగణ్యుల్లో ఒకరు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ రచయిత వేదిక ఏర్పాటులో క్రియాశీల భాగస్వామి మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంపాటు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ‘మనిషిగా పూచే మటి’్ట అతడు. తాను చేసే పని ఏమిటన్నది తనకు ముఖ్యం కాదు. తన బాధ్యత నెరవేర్చేది అయితే చాలన్నకున్న పనిమంతుడు వేణు సంకోజు. పేదరికం పట్టిపీడించినా తన లక్ష్యం నుంచి ఎన్నడూ దూరం కాలేదు. పెట్రోల్‌ బంక్‌లో సర్వర్‌గా పనిచేసినా, నూనె మిల్లులో కూలీగా, ప్రైవేట్‌ యాజామాన్యాల కింద గుమాస్తాగా పనిచేసినా తన పట్టుదలను వీడకుండా పైకి వచ్చిన నేపథ్యం ఆయనది. చిన్నప్పటి నుంచి కష్టాన్ని ఇష్టంగా ప్రేమించి జీవితంలో అనేక ఎత్తుపల్లాలను అనుభవించారు. జీవిక కోసం తాను చేసిన జీవనపోరాటం నుంచి తన అనుభాల నుంచి ఉబికి వచ్చి ఇవ్వాళ తెలంగాణ సాహితీ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోగలిగాడు. తన తొమ్మిదో తరగతిలోనే తొలి కవిత రాస్తే ‘గీ పిల్లవాడేం రాసాడు. వేరే ఎవరో రాసి ఉండచ్చని కొందరు. ఎవరైనా చెబితే రాయవచ్చని మరికొందరు అనుకున్న’వారంతా అబ్బుపడేలా ఎదిగారు. తన సుదీర్ఘ వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిగత జీవితంలోనూ ఎన్ని ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు వచ్చినా అక్షరాన్ని వీడకుండా సాగిపోయే లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నారు.

1972 నుంచి అలుపెరుగకుండా అక్షర సాగు చేస్తున్నారు. కవిత, కథ, వ్యాసరచన మొదలైన ప్రక్రియలో ఆరితేరిన చేయిగా వేణు సంకోజు తెలంగాణ సాహితీవేత్తలకు చిరపరిచితులు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు తన రాయాలన్న అభిరుచిని ఎలా అయితే పెంపొందించుకున్నారో తను అధ్యాపకుడైన తరువాత తన విద్యార్థుల్లోనూ ఆ సృజనాత్మకత నింపి వారిలో ‘చలనం’ సృష్టించారు. శ్రీశ్రీ, దాశరథి, కృష్ణశాస్త్రీ, ప్రజాకవి కాళోజీలను అమితంగా, విస్తృతంగా చదివారు. తెలంగాణ సమకాలీన సమాజ రుగ్మతలకు అద్దంపట్టే రీతిలో సా హిత్యాన్ని సుసంపన్నం చేశారు. తన అక్షర సృజనను ‘కాళోజీ ఫౌండేషన్‌' అక్కున చేర్చుకున్నది. అందులో భాగంగానే ఫౌండేషన్‌ ప్రతీయేటా ప్రదానం చేసే పురస్కారాన్ని ఈ సంవత్సరం వేణు సంకోజు వరించింది. బుధవారం ఇక్కడి వాగ్దేవి కళాశాల సెమినార్‌ హాల్‌లో జరిగే కాళోజీ సోదరుల యాది సభలో ఆయనకు ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కాళోజీ ఫౌండేషన్‌ ప్రకటించింది. ‘మనిషిగా పూచే మట్టి’ వేణు సంకోజు కవితా సంకలనాన్ని 1995లో ప్రజాకవి కాళోజీ ఆవిష్కరిస్తే అదే కాళోజీ ఫౌండేషన్‌ అవార్డుకు ఎంపిక కావడం విశేషం.

నేడు కాళోజీ సోదరుల యాది సభ
బుధవారం సాయంత్రం కాళోజీ సోదరుల యాది సభను కాళోజీ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్నది. కిషన్‌పురాలోని వాగ్దేవి కళాశాల సెమినార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సభకు కాళోజీ ఫౌండేషన్‌ ఉపాధ్యక్షులు ఎస్‌. జీవన్‌కుమార్‌ వ్యవహరిస్తారు. ఈ సభలో ప్రదాన వక్తగా ప్రొఫెసర్‌ కాత్యాయని విద్మహే, వక్తగా ప్రొఫెసర్‌ రామా చంద్రమౌళి, పురస్కార ప్రదానం ప్రముఖ నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌తోపాటు, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, ఫౌండేషన్‌ కోశాధికారి పందిళ్ల అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొనే ఈ యాది సభకు కవులు, సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొనాలని కాళోజీ ఫౌండేషన్‌, మిత్రమండలి, సహృదయ సాహితీ సమితి, సృజనలోకం, సారస్వత పరిషత్‌, ఉజ్వల సాహీహితీ సంస్థలు విడుదల చేసిన ప్రకనటలో పేర్కొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...