కూల్ వింటర్.. హాట్ స్వెట్టర్స్


Mon,November 11, 2019 01:43 AM

-నగరంలోమొదలైన అమ్మకాలు
-నాలుగు నెలల పాటు విక్రయాలు
-ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి

కరీమాబాద్: చలికాలం మొదలైంది. నగరంలో స్వెట్టర్ల వ్యాపారం జోరందుకుంది. శరీరాన్ని చలి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు స్వెటర్ల సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. స్వెట్టర్లే కాకుండా రగ్గులు, బ్లాంకెట్లు మంకీ క్యాంపులు విక్రయిస్తుంటారు. దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి స్వెట్టర్లు ఇక్కడకు దిగుమతి అవుతాయి. ఈసారి సరికొత్త డిజైన్‌లతో కనువిందు చేస్తున్నాయి. నేపాల్ వాసులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు దాదాపు నాలుగు నెలల పాటు నగరంలోని ప్రధాన కూడళ్లలో మకాం వేసి అమ్మకాలు సాగిస్తుంటారు. సుమారు 20 ఏళ్లుగా స్వెట్టర్ అమ్మకం దారులకు వరంగల్‌తో అనుబంధం నెలకొంది. నగరపాలక సంస్థ అనుమతితో సెంటర్లను ఏర్పాటు చేసుకుని అక్టోబర్ నెల మొదలుకుని జనవరి మాసం వరకు విక్రయాలు చేపడుతారు.

ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి..
నగరానికి చేరుకునే బ్లాంకెట్లు, స్వెట్టర్లు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేస్తారు. కర్నాటక, రాజస్తాన్, నేపాల్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి సరుకులను తెస్తుంటారు. ఇక్కడ సీజన్‌లో అమ్మకాలు పోగా సరుకులను మళ్లీ వారివారి ప్రాంతాలకు పంపుతుంటారు. ఇవేకాకుండా భారీ వాహనాల్లోనూ ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు నేరుగా ప్రజలకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో రాష్ర్టానికి చెందిన వెరైటీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. గతంలో నేపాల్ వ్యాపారులు ఎక్కువగా ఆసక్తి చూపే వారు రానురాను దేశంలోని ఇతర రాష్ట్రాల వారు సైతం ఇక్కడ స్వెట్టర్ల సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఏటా బతుకుదెరువు కోసం సుమారుగా 100 మంది వరకు గుడారాల్లో ఉంటూ సరుకులను అమ్ముతుంటారు.

జనవరి వరకు అమ్మకాలు..
చలికాలం మొదలు కావడంతో నగరంలో స్వెట్టర్ సెంటర్లు వెలిశాయి. నగరపాలక సంస్థ సెంటర్‌లో, హన్మకొండ, కేయూ రోడ్డు, కాజీపేట తదితర ప్రాంతాల్లో అమ్మకాలు మొదలయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ఆయా ప్రాంతాల్లో సందడి కనిపిస్తున్నది. నగరం నుంచి ఊళ్లకు వెళ్లే మార్గ మధ్యలో ఉన్న హైవేల్లో సైతం వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. అక్టోబర్ నెల మొదలుకుని జనవరి మాసం వరకు అమ్మకాలు సాగుతాయి.

రేట్ ఫిక్స్..
ఏటా వ్యాపార నిర్వహణలో వ్యాపారులు కొత్త పంథాను అవలంబిస్తున్నారు. సరుకుపై బేరసారాలు లేకుండా రేట్‌కు సంబంధించిన ట్యాగ్‌ను అతికించి ఫిక్స్‌డ్ ధరతో అమ్మకాలు సాగిస్తున్నారు. రూ.150 మొదలుకుని 1000 రూపాయల వరకు ధరలు ఉంటున్నాయి. సరుకు నాణ్యతను బట్టి , ఆయా సైజులను బట్టి ధరలను నిర్ణయిస్తున్నారు.

పలువురికి ఉపాధి..
చలికాలం వచ్చిందంటే చాలు ఇతర రాష్ర్టాల నుంచి పలువురు ఉపాధి కోసం జిల్లాకు వస్తారు. సుమారు నాలుగు నెలల పాటు ఇక్కడే ఉంటారు. వ్యాపారులు లెక్క ప్రకారం ఇచ్చిన సరుకును విక్రయిస్తూ జీతభత్యాలు పొందుతారు. ప్రతిరోజు అమ్మకాల ద్వారా వచ్చిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటారు. ఒక్కో వ్యక్తికి ప్రతి నెలా సుమారుగా 10 వేల రూపాయలు ఉంటాయి. కొందరు కుటుంబ సమేతంగా ఇక్కడే వ్యాపారం నిర్వహిస్తూ మళ్లీ వారి ప్రాంతాలకు వెళ్తారు. ప్రతి ఏటా రావడం ఇక్కడ వ్యాపారం చేసుకోవడం మళ్లీ తిరిగి పయనమవ్వడం వారికి అలవాటుగా మారింది.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...