ముమ్మరంగా ఆర్వోబీ పనులు


Sun,November 10, 2019 01:50 AM

కమలాపూర్: మండలంలోని ఉప్పల్ రైల్వే గేట్‌పై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ క్రాస్ రోడ్డు నుంచి పరకాల వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులు చేస్తున్నారు. నాలుగు లైన్ల రహదారిపై ఉన్న ఉప్పల్ రైల్వే గేటు వద్ద ఆర్వోబీ వంతెన నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్ రూ.66 కోట్ల నిధులు కేటాయించారు. 2018లో మంత్రి ఈటల రాజేందర్, అప్పటి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల రైళ్లు దేశరాజధాని ఢిల్లీకి వెళ్లే మార్గం కావడంతో ఉప్పల్ రైల్వే గేటు పది నిమిషాలకోసారి పడుతుంది. గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగులైన్ల రహదారితో వాహనాల రాకపోకలు పెరుగుతాయని గుర్తించిన మంత్రి ఈటల ఆర్వోబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.

పూర్తి కావస్తున్న రోడ్డు పనులు
2017లో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ హుజూరాబాద్-పరకాల నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ. 100 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేపడుతున్నారు. మంత్రి ఈటల ఉప్పల్ రైల్వేగేట్‌తో వాహనదారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలిపే రహదారి కావడంతో రాకపోకల రద్దీ పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, రామప్ప, లక్నవరం టూరిజం ప్రాంతాలతో పాటు వేములవాడ, కొండగట్టు దేవస్థానాలకు వెళ్లేందుకు ఆరు జిల్లాలకు చెందిన ప్రజలు ఈ రహదారిపై ప్రయాణం చేస్తుంటారు. పనుల వేగం పుంజుకోవడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...