గూడు పుఠాణిపై కదిలిన యంత్రాంగం


Tue,October 22, 2019 03:42 AM

-ఉర్సుగుట్ట భూ వ్యవహారంపై విచారణ షురూ
-గుట్టను కాపాడాలని కలెక్టర్‌కు దసరా ఉత్సవ సమితి వినతి
-దస్ర్తాల దుమ్ము దులుపుతున్న రెవెన్యూ అధికారులు
-ఇవీ శాసన, సాహిత్య ఆధారాలు
-నమస్తే తెలంగాణ ఎఫెక్ట్
వరంగల్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ: తీగలాగితే డొంకంతా కదలుతుంది. ఉర్సు గుట్ట బాగోతం బట్టబయలవుతోంది. సామూహిక ప్రయోజనాల కోసం ఉన్న ఉర్సు గుట్టను సొంతం చేసుకోవాలని సందర్భం వచ్చిన ప్రతీసారి తెరమీదికి వస్తున్నారు. అయితే అది ప్రభుత్వభూమా? ప్రైవేట్ పట్టా భూమా? అన్న వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ యం త్రాంగం దస్ర్తాలకు పట్టిన దుమ్మును దులుపుతున్నది. మరోవైపు దసరా ఉత్సవ సమితి కలెక్టర్‌ను కలిసి గుట్టను, గుట్ట చూట్టూ ఉన్న భూమిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా ఆ స్థలం సీలింగ్ సర్పలస్ భూమిలో భాగంగా తామే హక్కుదారులమని వాదన. ఇటువంటి తరుణంలో అసలు ఉర్సు గుట్ట సర్కార్‌ది అని చెప్పే ఆధారాలు ఏవైనా ఉన్నాయా? అని నమస్తే తెలంగాణ పరిశీలించింది. స్థానికులను, ఆ గుట్ట తాలూకూ ప్రచారంలో ఉన్న వాటినే కాకుండా శాసన, లిఖిత ఆధారాలు ఏవైనా ఉన్నాయా అని మరోసారి పరిశీలిస్తే అబ్బుపరిచే అపురూప ప్రణయ దృశ్యకావ్యం గుట్టలో గుహ మధ్య ఒదిగి ఉంది. ఈ ఆధారాల నేపథ్యంలోనే రాష్ట్ర పురావస్తుశాఖ గుట్ట పాదాల దగ్గర సూచిక బోర్డును కూడా వేయించింది. గతంలో కూడా ఇదే తరహా వివాదం చెలరేగినప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ రిటైర్డ్ ఆచార్యులు కోవెల సుప్రసన్నాచార్య, ఇన్‌టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం పాండురంగారావు దీనిపై ప్రముఖ చరిత్రకారుడు, కాకతీయులు గ్రంథకర్త డాక్టర్ పీవీ పరబ్రహ్మ శాస్త్రి పుస్తకంలో పొందుపర్చిన అంశాలను వరంగల్ విజ్ఞాన సర్వస్వం అన్న గ్రంథంలో డాక్టర్ గుంజి వెంకటరత్నం పేర్కొన్నట్లు వెలుగుచూసింది. ఈ చారిత్రక, శాసన ఆధారాల నేపథ్యాన్ని పరిశీలిస్తే ఉర్సుగుట్ట ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందే అవకాశం లేదనే వాదన బలంగా వినిపిస్తుంది.

మరోవైపు అనేక గుట్టలు ప్రైవేట్ పట్టా భూములుగా చెలామణి అయిన సందర్భం కూడా లేకపోలేదనే వినిపిస్తున్నది. ఉర్సుగుట్ట తమదేనని పేర్కొంటూ రాతలు వెలిసిన క్రమంలో నమస్తే తెలంగాణ సోమవారం గుట్ట చుట్టూ గూడుపుఠాణి పేరుతో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం స్థానికంగా సంచలనం రేపింది. గుట్టను సైతం ఆక్రమిస్తారా? అనే కలకలం రేపింది. మరోవైపు రెవెన్యూ యంత్రాంగం పాత రికార్డు దస్ర్తాల దుమ్మును దులిపే పనిలో నిమగ్నం అయ్యారు. దసరా ఉత్సవ సమితి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కలిసి గుట్టను, గుట్ట చుట్టూ గత కొన్నేళ్లుగా అడపాదడపా ఇటువంటి సొంతరాయుళ్లు పుట్టుకువస్తూ ఆందోళన కలిగిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చి మరోసారి ఇటువంటి ప్రచారాలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి నమస్తే తెలంగాణ కథనంతో అటు అధికార యంత్రాంగాన్ని, స్థానిక దసరా ఉత్సవ సమితిని కదిలించడం గమనార్హం.

రంగంలోకి దిగిన రెవెన్యూ యంత్రాంగం
సర్వే నంబర్ 355లోని మొత్తం స్థలం 2ఎకరాల 25 గుంటలు, 14 ఎకరాల 37 గుంటల స్థలం తమకు చెందినదని పేర్కొంటూ దేవసాని రాజన్న పేరు మీద రాతలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు స్పందించి ఖిలా వరంగల్ తహసీల్దార్‌కు సమాచారం చేరవేశారు. వారు హుటాహుటిన వచ్చి ఆ రాతల్ని చెరిపేసిన వైనం తెలిసిందే. అయితే అది తమ భూమే అని, తామే హక్కుదారులమని పేర్కొంటూ దర్జాగా రాయడం తీవ్ర కలకలం రేపింది. నమస్తే తెలంగాణ ప్రముఖంగా కథనం ప్రచురించడంతో రెవెన్యూ అధికారులు తమ వద్ద ఉన్న దస్ర్తాల దుమ్ము దులిపి అసలు నిజాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే రెవెన్యూ రికార్డుల లెక్కల ప్రకారం దేశ విభజన సమయంలో దేశం విడిచి వెళ్లిపోయినవాడి పేరు మీదున్న ఉన్న భూమి సీలింగ్ భూమి ఎలా అయింది? దేశం విడిచివెళ్లిపోయిన వాడు పోతూపోతూ తమకు అమ్మి పోయాడని పేర్కొనడంలో ఉన్న ఆంతర్యం ఏమిటీ? దేశానికి స్వా తంత్య్రం సిద్ధించే క్రమంలో జరిగిన పరిణామాల వల్ల అప్పటి వరకు కాంధీశీకుడిగా ఉన్న సేవక్‌రాం టేక్‌చంద్‌దిగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నదా? ఈ భూమి తనదే అని పేర్కొనే ధైర్యం వెనుక అతని వద్ద ఆధారాలు ఏమిటీ? అవి సృష్టించినవా? లేదా అసలువేనా? అన్న కోణం లో ఖిలా వరంగల్ రెవెన్యూ సిబ్బంది మొదలు వరంగల్ ఆర్డీవో దాకా అసలు దస్ర్తాల కోసం విచారణ చేపట్టారు. సాధ్యమైనంత తొందరలోనే ఈ వ్యవహారాన్ని తేలుస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

కలెక్టర్‌ను కలిసిన దసరా ఉత్సవ సమితి
ఉర్సు దసరా ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, బండి కుమారస్వామి, కార్పొరేటర్లు కత్తెశాల వేణుగోపాల్, మేడిది రజిత మధుసూదన్, ఉత్సవ సమితి సభ్యులు వడ్నాల నరేందర్, మండ వెంకన్న, వెలిదే శివమూర్తి తదితరులు సోమవారం కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దశాబ్దాల క్రితం నుంచి ఉర్సు రంగలీల మైదానంలో విజయ దశమి సందర్భంగా రావణ వధ, దీపావళి సందర్భంగా నరకాసుర వధ వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర దేవాదాయ శాఖ నిధులతో రంగనాయకుల గుడి వద్ద భక్తుల సౌకర్యార్థం మంటప నిర్మాణం చేపట్టాం. కుడా ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో ఉర్సు గుట్ట ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ నేపథ్యంలో కొంతమంది ఈ భూమిని దొంగపత్రాలు సమర్పించి కాజేయాలని చూస్తున్నారని వారు కలెక్టర్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా సాధ్యమైనంత తొందరగా ఈ వివాదాన్ని పరిష్కరించాలని వారు కలెక్టర్‌ను కోరారు. వారం రోజుల్లో పూర్తి విచారణ చేపడతామని, కలెక్టర్ స్వయంగా ఆర్డీవో వెంకారెడ్డికి ఫోన్ చేసి సాధ్యమైనంత తొందరలో విచారణ చేపట్టి తేల్చాలని ఆదేశాలు జారీ చేశారని ఉత్సవ సమితి బాధ్యులు పేర్కొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...