నర్సంపేటలో కుండపోత వర్షం


Sun,October 20, 2019 04:13 AM

-పొంగుతున్న వాగులు వంకలు
-అలుగు పోస్తున్న చెరువులు,కుంటలు
నర్సంపేట, నమస్తే తెలంగాణ : నర్సంపేటలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. నర్సంపేట డివిజన్‌లో విస్తారంగా వర్షం కురిసింది. దుగ్గొండిలో 110.2 మిమీ, నల్లబెల్లి 107.2 మిమీ. నర్సంపేటలో 153.2 మిల్లీమీటర్లు, ఖానాపురంలో 93.6 మిమీ, చెన్నారావుపేట 36.4 మీమీ, నెక్కొండలో 30.2 మిమీ వర్షపాతం నమోదైంది. రోడ్ల మీద, వ్యవసాయ మార్కెట్, కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. వట్టెవాగు వరదనీటితో ప్రవహిస్తున్నది. నర్సంపేట డివిజన్‌లోని పాకాల చెరువు, మాదన్నపేట, కోపాకులు, రంగాయ చెరువులతో పాటు ఇతర చెరువు, కుంటలు అలుగులు పోస్తున్నాయి.వాగులు పొంగడంతో రహదారుల వంతెనల మీద నుంచి నీరు వెళ్తున్నది. దీనివల్ల నర్సంపేట-నెక్కొండ రహదారిపై వాహనాలు వెళ్లడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డివిజన్‌లో కురిసిన వర్షాలతో పంట పొలాల్లో వ్యవసాయ పనులు కూడా సాగలేదు. వరి పంట నేట మట్టం కావడంతో నష్టమైంది. వరదలో పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో నష్టం అయింది. వ్యవసాయాధికారులు నష్టం అంచనావేసే పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షానికి పట్టణంలో పలు చోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. మూడిళ్లు కూలిపోయాయి.

మొక్కజొన్నలు నీటిపాలు
ఆరుగాలం శ్రమించి పండించి ఉత్పత్తి చేసిన మొక్కజొన్నలు వర్షార్పణమయ్యాయి. రైతులు మొక్కజొన్నలను విక్రయించేందుకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌కు తెచ్చి తేమ తగ్గించడానికి ఎండ బెడుతున్నారు. ఈ మొక్కజొన్నలను ఎండబెట్టడానికి 15 రోజుల నుంచి మార్కెట్‌లోనే ఉంటున్నారు. రైతు కుటుంబాలు చాలా మంది ఇక్కడే వంటలు చేసుకుని ఉంటున్నాయి. రోజు కురుస్తున్న వర్షాలతో మొక్కజొన్నల్లో తేమ శాతం తగ్గుముఖం పట్టడడం లేదు. 18 శాతం తేమ ఉన్న మొక్కజొన్నలనే కొనుగోలు చేస్తున్నారు. అయితే మొక్కజొన్నలు తడుస్తుండగా వాటిని ఆరబెట్టుతున్నారు. తడిసి మొక్కజొన్నలను వేరుచేస్తున్నారు. తడిసిన మొక్కజొన్నలు నల్లబారి మొలకెత్తుతున్నాయి. అయితే శుక్రవారంసాయంత్రం కురిసిన వర్షానికి రైతులు అందరూ తమ మొక్కజొన్న రాశులను కుప్పలుగా పోసుకుని పైన టార్పాలిన్లు కప్పారు. అయితే రాత్రి భారీ వర్షం కురవడంతో రాశులన్నీ కనిపించకుండా కొట్టుకుపోయాయి. మార్కెట్ పక్క నుంచి ఉన్న వాగు ఆక్రమణలో ప్రస్తుతం కాల్వగా మారిపోయింది. అయితే మార్కెట్ ప్రహరీని కూల్చి వేయడంతో నీళ్లన్నీ మార్కెట్‌లోని కింది భాగం నుంచి ప్రవహించాయి. మూడు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రాశులన్నీ వరదనీటిలో కొట్టుకుని పోయాయి. రైతులు వాటిని చూసి కన్నీళ్ల పర్యంత మవుతున్నారు. జంగాలపల్లి తండాకు చెందిన ఈర్య రెండున్నర ఎకరాల్లో సాగు చేసి మొక్కజొన్నలను మార్కెట్‌కు తెచ్చారు. అమ్మగా వచ్చిన డబ్బులతో కుమార్తె వివాహం చేస్తామని అనుకున్నారు. వర్షం ఆ కుటుంబంలో కన్నీటినే మిగిల్చింది. ఆ కుటుంబం రోడ్డున పడి రోదిస్తున్నది. రవి, భద్రమ్మ, మంగమ్మ, కుమారస్వామి తదితరుల మొక్కజొన్నల రాశులు కొట్టుకుపోయాయి. ఈర్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని తహసీల్దార్ విజయ్‌భాస్కర్, మార్కెట్ కార్యదర్శి వెంకట్‌రెడ్డిని రైతులు చుట్టుముట్టారు. మార్కెట్‌లో 48 మంది అడ్తిదారుల నుంచి నష్టపరిహారం వసూలు చేసి రైతులకు ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారు. తెల్లారితే మొక్కజొన్నలు కాంటా అయ్యేవని రైతులు వాపోయారు. తలా కొంత విరాళాలు వేసుకుని మక్క రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...