కిక్కెక్కించిన లక్కీ డ్రా..


Sat,October 19, 2019 03:33 AM

-జిల్లాలో 59 మద్యం షాపులకు విజేతల ఎంపిక
-కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ పర్యవేక్షణ
-ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం
-బేరసారాల్లో వైన్స్‌షాపులు దక్కని వారు..

వరంగల్ క్రైం, అక్టోబర్18 : వారం రోజులుగా 18వ తేదీ ఎప్పుడు వస్తదో.. లాటరీలో మాకు షాపు దక్కుతుందో.. లేదో.. అని రోజులు లెక్కపెడుతూ ఎదురుచూసిన ఆశావహులందరికీ శుక్రవారం జరిగిన లక్కీడ్రాతో ఉత్కంఠకు తెరపడింది. అర్బన్‌జిల్లాలో 59 వైన్స్‌షాపులకు ఈ నెల 9 నుంచి 16 వరకు 1885 మంది నుంచి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం అంబేద్కర్‌భవన్‌లో కలెక్టర్ లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. దరఖాస్తుదారులు తమ ఇష్టదైవాలను మొక్కుకొని ఉదయం 10:30 వరకే అంబేద్కర్ భవన్‌కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు షాపునెంబర్ 1తో కలెక్టర్ లక్కీడ్రాను ప్రారంభించి మొదటగా విజేతగా నిలిచిన యతీశ్ పేరును ప్రకటించారు. డ్రా తీస్తున్న ప్రతిషాపునకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పండని ఒకటికి రెండు సార్లు దరఖాస్తుదారులను అడిగి అందరూ సముఖం తెలిపిన తర్వాతే డ్రా తీసి విజేతల పేర్లను కలెక్టర్ ప్రకటించారు. ఇలా 1 నుంచి 59 షాపుల వరకు డ్రా అయిపోయేంత వరకు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ స్వయంగా టోకెన్లను తీసి వీడియో, ఫోటోగ్రఫీ మధ్య విజేతలను ప్రకటించారు. దరఖాస్తులను సులభతరం చేయడంతో డ్రాలు సైతం అదే స్పీడ్‌తో ముగిశాయి. ఎప్పుడు అర్ధరాత్రి వరకు జరిగే లక్కీ డ్రా మాత్రం ఈసారి సాయంత్రం 5 గంటలలోపే ముగిసింది. 59 మందిలో 7గురు మహిళలు లక్కీడ్రాలో విజేతలుగా నిలిచారు. షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజులో 1/8 వంతు అక్కడే చెల్లించారు.

లక్కీ డ్రాలో మరింత లక్కీ
లక్కీ డ్రాలో పాత షాపులను తిరిగి లక్కీగా వాళ్లనే వరించాయి. అయితే వాళ్లపేర్ల మీద కాకుండా కుటుంబసభ్యుల పేర్లపై వచ్చాయి. కొందరు గ్రూప్‌గా ఏర్పడి పాతషాపులను దక్కించుకున్నారు. కొందరు తమ కుటుంబసభ్యులు, బంధువుల పేర్లతో దరఖాస్తులు వేయించి ఒక్కొక్కరు ఐదు, ఆరు షాపులను దక్కించుకున్నట్లుగా తెలిసింది. క్లస్టర్ విధానంతో షాపులు దక్కించుకున్న వ్యాపారస్తులు ఆ క్లస్టర్‌లో ఎక్కడైనా పెట్టుకొవచ్చనే సంబురంలో మునిగితేలుతున్నారు. షాపులు దక్కనివారు విజేతలతో హాల్ బయట బేరసారాలు సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం. గతంలో ఉన్న లైసెన్స్‌దారులు ఈ సారి సగం ఎక్కువగా షాపులను దక్కించుకున్నట్లుగా తెలిసింది. అయితే డ్రాలో పాల్గొన్నవారిలో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తులు కావడం విశేషం. బెల్టుషాపుల దందా చేసే వ్యక్తులు సైతం షాపులను దక్కించుకున్నారు.


మహిళల సందడి..
మద్యంషాపు మాట ఎత్తితేనే మహిళలు ఆమడ దూరంగా ఉంటారనుకుంటాం. కానీ శుక్రవారం హన్మకొండ అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మద్యంషాపుల డ్రాలో మహిళల సందడి కనిపించింది. 59 షాపుల్లో ప్రతి షాపునకు మూడు నుంచి నలుగురు మహిళల చొప్పున దరఖాస్తు చేశారు. చంటిపిల్లలతో సహా వచ్చి డ్రాలో పాల్గొన్నారు. మద్యంషాపుల ద్వారా వచ్చే ఆదాయంపై మక్కువతో ఎలాంటి మొహమాటం లేకుండా పురుషులతో సమానంగా పోటీపడి డ్రా అయిపొయేంత వరకు ఉన్నారు. అయితే 59 షాపుల్లో 7 గురు మహిళల నే అదృష్టం వరించింది. అయితే ఇందులో యువతులు, వృద్ధ్దులు, గృహిణులు పాల్గొనడం విశేషం. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ప్రవళిక డ్రాలో పాల్గొని షాపు నెంబర్ 26ని దక్కించుకుంది. చాలాకాలంగా మద్యం వ్యాపారంలో ఉన్న వ్యక్తులు మహిళలను రంగంలోకి దింపి షాపులను దక్కించుకున్నారు.

స్లాబ్‌ల వారీగా 1/8 వంతు చెల్లింపు..
లక్కీడ్రాలో షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్‌ఫీజులో 1/8 వంతు డబ్బులు వెంటనే చెల్లించాలనే నిబంధన ఉండడం తో 1885 మంది తమ వెంట డబ్బుల మూటలతో అంబేద్కర్‌భవన్‌కు చేరుకున్నారు. రూ.85 లక్షల స్లాబ్‌లో షాపు దక్కించుకున్న వారు రూ.21.25 లక్షలు, రూ.55 లక్షల స్లాబ్‌లో రూ.13.75 లక్షలు, రూ.50 లక్షల స్లాబ్‌లో రూ.12.50 లక్షలు చెల్లించడానికి సిద్ధ్దమై వచ్చారు. చాలా మంది దరఖాస్తుదారులు లైసెన్స్‌ఫీజులో 1/8 వంతు స్పాట్‌లో చెల్లించినప్పటికీ మరికొంత మందికి నేడు చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. నేడు బ్యాంక్‌లకు సెలవు ఉన్నందున సోమవారం చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఎక్సైజ్ ట్యాక్స్ రూ.5 లక్షలు డిసెంబర్‌లో చెల్లించాల్సి ఉంది. విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు డ్రాలో పాల్గొన్నారు. రేషన్ డీలర్లు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ పోలీస్ అధికారులు, కుల సంఘాల నాయకులు, చిట్‌ఫండ్స్ యజమానులు, లెక్చరర్స్, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉండడం విశేషం.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...