పంచాయతీలకు ట్రాక్టర్లు


Wed,October 16, 2019 01:55 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆయా గ్రామంలో ఇన్నాళ్లు ప్రజలను వెంటాడిన సమస్యలు తొలిగిపోతున్నాయి. పక్కా ప్రణాళికతో సమగ్ర అభివృద్దికి అడుగులు పడుతున్నాయి. పరిశుభ్రత, పచ్చదనం ఆవిష్కృతం అవుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నాయి. దీంతో ఊరూరు కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ సమకూర్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీలోగా ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ కొనుగోలు చేయాలని అధికారులకు గడువు నిర్దేశించింది. దీంతో పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు కోసం కలెక్టర్ ఎం హరిత నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీ కసరత్తు చేపట్టింది. ఆయా గ్రామ పంచాయతీ నుంచి రిక్వైర్‌మెంట్ తీసుకుని ట్రాక్టర్లు కొనుగోలు చేసే పనిలో తలమునకలైంది. పారిశుధ్యం, పచ్చదనానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కచ్చితంగా ఉండాలని భావిస్తుంది. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా మినీ ట్రాక్టర్ లేదా ట్రాక్టర్ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొనుగోలు చేయాల్సిన ట్రాక్టర్ల కంపెనీలను ప్రకటించింది. వీటిలో మహేంద్ర, స్వరాజ్, ఐషర్, జాండీర్, ఫెర్గుజన్, ప్రీత్, కుబుట, హెచ్‌ఎంటీ తదితర కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీ ట్రాక్టర్ కెపాసిటీని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీ పరిధిలో జనాభాను పరిగణనలోకి తీసుకుని ట్రాక్టర్ల కొనుగోలు చేయాలని, 500 లోపు జనాభా గల గ్రామ పంచాయతీకి 15 హెచ్‌పీ, 501 నుంచి 3 వేల లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి 20, 21 హెచ్‌పీ, 3 వేలకుపైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి 35 హెచ్‌పీ నుంచి ఆపై కెపాసిటీ గల ట్రాక్టర్ ఉండాలని వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు కోసం ప్రత్యేకంగా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా జిల్లా కలెక్టర్ ఎం హరిత వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీ నారాయణరావు బాధ్యతలు నిర్వర్తిస్తారు. డీఆర్‌డీవో, జిల్లా పరిశ్రమల అధికారి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి ఈ జిల్లా స్థాయి కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ప్రతిపాదనలు తయారు
జిల్లాలో మొత్తం 401 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీటిలో ఏ గ్రామ పంచాయతీకి ఎంత కెపాసిటీ ట్రాక్టర్ అవసరమనేది పంచాయతీ శాఖ అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ట్రాక్టర్ల కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలను ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్, పాలకవర్గం, గ్రామ కార్యదర్శులు, ఇతరులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన ట్రాక్టర్ల కంపెనీల పేర్లను సైతం వివరిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ కొనుగోలుకు సంబంధించి కెపాసిటీ, కంపెనీపై అభిప్రాయాలు సేకరించే దిశలో ముందుకు వెళ్తున్నారు. ట్రాక్టర్ కొనుగోలుకు గ్రామ పంచాయతీలో అవసరమైన నిధులు ఉన్నాయా? లేకపోతే ఏ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటారు, ఏ పద్ధతిన తిరిగి బ్యాంకుకు చెల్లింపులు జరుపుతారు.. తదితర అంశాలపై కూడ గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇవన్నీ గ్రామ పంచాయతీల నుంచి అందిన తర్వాత పంచాయతీ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారు. ట్రాక్టర్ కొనుగోలు కోసం అప్పు అవసరమైన గ్రామ పంచాయతీలకు సంబంధించి కలెక్టర్ బ్యాంకర్లతో మాట్లాడుతారు. జిల్లా స్థాయి కమిటీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు జరుగుతుంది. ఈ నెల 24వ తేదీలోగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ట్రాక్టర్ వెంట పారిశుధ్యానికి ట్రాలీతోపాటు పచ్చదనం కోసం మొక్కలకు నీరు పోసేందుకు ట్యాంకర్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ట్రాక్టర్ నడిపేందుకు ప్రస్తుతం ఆయా గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందిలో ఒకరికి డ్రైవర్‌గా శిక్షణ ఇప్పించాలని, సిబ్బంది లేని గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ నడిపే వ్యక్తిని నియమించుకోవాలని సర్పంచ్‌లకు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్నందున ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ నిర్వహణకు ఇబ్బంది తలెత్తే అవకాశం లేదు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...