వేతన సంబురం


Wed,October 16, 2019 01:53 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల్లో తెలంగాణ ప్రభుత్వం సంతోషం నింపింది. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన పంచాయతీ కార్మికుల నెల వేతనం రూ.8,500కు పెంచింది. ప్రతి గ్రామ పంచాయతీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించే కార్మికులందరిని ఇక నుంచి మల్టీపర్పస్ వర్కర్లుగా పిలిచేందుకు నిర్ణయించింది. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం గ్రామ పంచాయతీ కార్మికులకు ఎస్‌కే డే నివాళిగా జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సంబురపడుతున్నారు. తమను గుర్తించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు చెపుతున్నారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఆత్మకూరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ పర్వతగిరి రాజు మంగళవాం క్షీరాభిషేకం చేశారు. నెక్కొండలో కార్మికులు ర్యాలీ నిర్వహించి సంబురాలు చేసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇన్నాళ్లూ నెల నెల వేతనం రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు లభించింది. ఆదాయం ఉన్న పెద్ద గ్రామ పంచాయతీలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వేతనం చెల్లిస్తే అంతగా ఆదాయం లేని చిన్న గ్రామ పంచాయతీలు ప్రతి నెల రూ.1,000 నుంచి రూ.2 వేల వరకు వేతనం ఇచ్చాయి. దీంతో వేతనం సరిపడక గ్రామ పంచాయతీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదుకోవడానికి నిర్ణయించారు. ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు నెల వేతనం రూ.8,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. వేతనం పెంపుతో జిల్లాలోని 401 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 1,301 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరూ ఇకనుంచి నెల నెల రూ.8,500 వేతనం పొందుతారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు ఇన్నాళ్లు స్వీపర్, కారోబారు, పంపు ఆపరేటర్ పేర్లతో పిలువబడ్డారు. ఈ పేర్లకు ఇక నుంచి స్వస్తి పలకనున్నారు. అందరిని సమానంగా చూసేలా ఒకే పేరుతో మల్టీపర్పస్ వర్కర్లుగా పిలవాలని తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో తెలిపింది.

బీమాను ప్రతిపాదించిన డీపీవో నారాయణ
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం పూర్తి ప్రభుత్వ ఖర్చుతో ఎస్‌కే డే జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో రాష్ట్రంలోని కలెక్టర్లు, డీపీవోలు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. పంచాయతీ ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ఈ పథకం నుంచి రూ.2 లక్షల బీమా సొమ్ము అందనుందని ఆయన తెలిపారు. దేశంలో పంచాయతీరాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్‌కే డేకు నివాళిగా ఈ జీవితబీమా పథకానికి అతని పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. పంచాయతీ కార్మికుల కోసం జీవితబీమా పథకాన్ని ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీ నారాయణరావు ప్రతిపాదించడం విశేషం. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ సమావేశంలో జీవిత బీమా ప్రతిపాదన చేసిన డీపీవోను అభినందించారు. ఈ పథకం నుంచి ప్రతి సంవత్సరం పంచాయతీ కార్మికుల్లో ఒక్కొకరి పేర ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వమే రూ.351 ప్రీమియం చెల్లించనుంది. జీవిత బీమా పథకం, వేతనం రూ.8,500కు పెంపు నేపథ్యంలో 60 సంవత్సరాలు నిండి పనిచేయలేని స్థితిలో ఉన్న పంచాయతీ కార్మికులు తమ స్థానంలో భార్య, కొడుకు, అల్లుడు తదితరులను నియమించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు డీపీవో నారాయణరావు తెలిపారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...