సమగ్ర శానిటేషన్ ప్లాన్ రూపొందిచాలి


Wed,October 16, 2019 01:52 AM

దామెర, అక్టోబర్ 15 : గ్రామ పంచాయతీల్లో చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలను స్ఫూర్తిగా తీసుకుని పట్టణాల్లో కూడా సమగ్ర శానిటేషన్ ప్లాన్‌ను వారం రోజుల్లో తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటీ, భూగర్భ గనుల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కలెక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌తో కలిసి మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సమగ్ర శానిటేషన్ ప్లాన్లలో ఇంటింట సేకరించిన చెత్తను ట్రాన్స్‌పోర్ట్ డంపింగ్ యారుల్లో తడి, పొడి చెత్తను వేరు చేయాలని పేర్కొన్నారు. కంపోజ్ ట్రీట్‌మెంట్ దశ వరకు అధ్యయనం చేసి వినూత్నంగా అమలు జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. వ్యాపార, వాణిజ్య మార్కెట్ కాంప్లెక్స్, హోటళ్లు, ఇంటింట సేకరించిన చెత్తను బయోవేస్ట్ క్లినిక్ మేనేజ్‌మెంట్ చేయాలని, పట్టణాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించాలని, పెట్రోల్ పంపులు, వాణిజ్య సముదాయాలు, వ్యాపార ప్రాంతాలలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఎన్ని మరుగుదొడ్లు అవసరమో గుర్తించి నివేదిక తయారు చేయాలని పేర్కొన్నారు. అందుకు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీ మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్వహణ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందుకోసం ప్రభుత్వం నిధులను కూడామంజూరు చేస్తుందని తెలిపారు. 35 మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేవని, వీటికోసం స్థల సేకరణ పూర్తి చేయాలని, 59 మున్సిపాలిటీల్లో కంపోస్ట్ యార్డులు లేవని, 62 మున్సిపాలిటీల్లో డ్రైరీసోర్స్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి చెప్పారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ అనుమతించడానికి ప్రభుత్వం 251ఉత్తర్వును జారీ చేసిందని, ఈ ప్రక్రియ 90 రోజులకు పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. భవిష్యత్‌లో అనుమతి లేకుండా గృహాలను నిర్మించకుండా టౌన్‌ప్లానింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ నిధులతో అదే పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ నగరంగా ఎదగాలంటే అవసరమైన యంత్రాల ఏర్పాటుతోపాటు పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో నిర్దేశించిన విధంగా 10 వేల జనాభాకు 29 మంది శానిటేషన్ వర్కర్లు ఉండాలని వివరించారు. 500 ఇండ్లకు స్వచ్ఛ ఆటో, కమర్షియల్ ప్రాంతాల్లో 300 షాపులకు మినీ లారీ ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీ ఎల్‌ఆర్‌ఎస్ డీఎంటీ నిధుల నుంచి అవసరమైన వాహనాలను కొనుగోలు చేయాలని అన్నారు.

రాష్ట్రంలో 23,60,569 గృహాలు ఉన్నాయని, జీహెచ్‌ఎంసీ మినహాయించి మొత్తం 4,613 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. పారిశుధ్య కార్మికులకు యూనిఫాం, భద్రతా పరికరాలను పంపిణీ చేయాలని, పీఎఫ్, ఇఎస్‌ఐ తప్పనిసరిగా జమ చేయాలని, పని చేసే కార్మికులకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. మార్చి 2020 సంవత్సరం వరకు
మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. పట్టణాల్లో గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, నర్సరీ ఏర్పాటు, బడ్జెట్‌లో 30శాతం గ్రీన్‌ప్లాన్‌కు ఖర్చు చేయాల్సి ఉందని, వాటర్ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీలో బడ్జెట్ ప్రిపరేషన్ చేయాలని, అర్బన్ కేంద్రంలో సుందరంగా, అహ్లాదకరంగా పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో 68 మున్సిపాలిటీలను తెలంగాణలో 140కి పెంచినట్లు వివరించారు. 42.6శాతం ప్రజలు పట్టణ ప్రాంతంలో ఉన్నారని, రానున్న ఐదేళ్ల కాలంలో 50 శాతం పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగినవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఇప్పటి నుంచి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హరిత, ఆర్డీవోలు కిషన్, రవి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, రవీందర్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...