వజ్రకాంతులు


Sun,October 13, 2019 02:06 AM

- సైకిల్‌.. రెండు తాళం చెవిలుంటేనే అడ్మిషన్‌ ఫాం
- లేబర్‌ కాలనీలో హాస్టల్‌
- మార్పు ఎంతున్నా మారని అపురూప మనుషులు
- అరవైఏళ్ల ఆర్‌ఈసీ అలియాస్‌ నిట్‌ పూర్వవిద్యార్థులు వీళ్లు
- వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ సండే స్పెషల్‌

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ,నిట్‌ క్యాంపస్‌: ఒక్కొక్కరిది ఒక్కో జ్ఞాపకం.. ఆరు దశాబ్దాల నాటి మధుర స్మృతులు.. ఎక్కడెక్కడో పుట్టిన వారు ఓరుగల్లుగడ్డకొచ్చి సాంకేతిక విద్యనభ్యసించారు.. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు నాటి రీజినల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల(ఆర్‌ఈసీ).. నేటి జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(నిట్‌)లో చదువుకుని పరిపూర్ణమైన మేధావులుగా, గొప్ప వ్యక్తులుగా నిలిచారు. విభిన్న భాషలు, సంస్కృతులు కలిగిన వారైనా ఇక్కడ సాంకేతిక విద్యనభ్యసించి పలు రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గర్వించే స్థాయికి ఎదిగారు. నాడు ఆర్‌ఈసీ పుట్టుకకు కారణమైన ఇటుకాల మధుసూదన్‌రావును పూర్వ విద్యార్థులంతా గుర్తు పెట్టుకోవడం విశేషం. ఆయన కృషితోనే ఓరుగల్లులో నిట్‌, కాకతీయ మెడికల్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో నిట్‌ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్‌ఈసీ తొలితరం విద్యార్థులు ఆయనను మననం చేసుకుంటున్నారు. నాటి చదువుకున్న రోజులు.. ఆచార్యుల నుంచి నేర్చుకున్న పాఠాలు.. అనుభవాలను ‘నమస్తేతెలంగాణ’తో పంచుకున్నారు.

అవును.. నిజం.. నిట్‌ వజ్రకాంతులు వెదజల్లిన సాంకేతికాలయం. అరవై ఏళ్ల క్రితాన్ని కళ్లముందు ఆవిష్కరించిన అపురూప మానవీయులు. ఎదిగిన కొద్దీ ఒదగడం నేర్చిన వాళ్లు. తామెరిగిన తావుల్ని తమ మనోఫలకం నుంచి ఆవిష్కృతం చేస్తున్న సాంకేతికీయులు వాళ్లు. ఒక్కొక్కరిదీ ఒక్కో జ్ఞాపకం. ఓరుగల్లు ఒడిలో ఆడి.. పాడి.. ఎగిరి.. దుంకి..ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా...పుడమిని మరవని అపూర్వస్మృతులు వారివి. ఎక్కడెక్కడో పుట్టారు. ఈ ఓరుగల్లు గడ్డమీద నుంచే ఎదిగి వచ్చారు. ఏకశిలా రసాత్మకతనే తమ జీవ రసాయనపు ఇంధనంగా మలచుకున్నారు. అవును నిజంగా వాళ్లు విజేతలు. వజ్రకాంతులు వెదజల్లుతున్న వాళ్లు. తాము ఎదిగిన మహావృక్షం నీడలో మరోసారి సేద తీరి ఇక్కడి గాలిని, ఇక్కడి చైతన్యాన్ని తమ జీవకణాల్లో నింపుకుందామని నిట్‌కు వచ్చారు. అవును నిట్‌ ఒకప్పటి ఆర్‌ఈసీ. అనేకానేక విప్లవాత్మక భావోద్వేగాలకు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నూతన ఆవిష్కరణలకు జీవంపోసే అనేక కోణాల్లో అధ్యయనం చేసిన బుద్ధిజీవులు. ఆర్‌ఈసీ అలియాస్‌ నిట్‌గా రూపాంతరం చెందినా వాళ్ల గుండెకింద తడిముడుల మూటలు విప్పుకుంటున్నారు. ఇవ్వాళ ఒక్కొక్కరూ భూమార్గంలో తిరిగితే కాలం వృథా అవుతుందని విమానాల్లో తిరిగే కాలంలోకి వెళ్లినా.. వాళ్లు ఆపాదమస్తకం పుడమిని తాకి పులకించిపోతున్నారు. శాఖోపకశాఖలుగా విస్తరించిన మహావృక్షం ఎట్లా అయితే తన నీడ విస్తృతిని విశాలం చేసుకుంటుందో అదేరీతిగా వీళ్లు. దేశ నలుమూలల నుంచి ఓరుగల్లు పుడమి ఒడిలో ఓనమాలు నేర్చుకొని వివిధ ప్రాంతాలకు వెళ్లి..మళ్లీ ఇవ్వాళ ఇక్కడికి వచ్చారు. ఎవరిని కదిలించినా అపూర్వమే. మార్పులు అనివార్యమే కానీ మనుగడ ప్రశ్నార్థకం కారాదంటూ ఆ మనుగడ కోసం నవీన పద్ధతుల్ని అవలంబించాలని అదే సమయంలో వాస్తవాలను విస్మరించకుండా ఎదగాలని జీవితసత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. తామెంత ఎదిగినా ఇప్పుడిక్కడికి రాగానే మళ్లీ విద్యార్థులుగా మారిపోయామని పేర్కొంటున్నారు.

శరీరం ముడతలుపడ్డా...నెత్తి నెరిసినా...కాళ్లదారులు మూసుకుపోయినా తమ కళ్లముందు అలనాడు అపూర్వంగా గడిచిన కాలం దర్శనమిస్తుందని తమ పూర్వజ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఆర్‌ఈసీ పుట్టుకకు కారణమైన ఇటుకాల మధుసూదనరావునూ ఇంకా వాళ్లు మాత్రమే గుర్తుపెట్టుకోవడం విశేషం. ఈ తరానికి అంతగా పరిచయం లేని ఓరుగల్లు కుసుమంగా ఎదగటానికి ఆయన కృషిని, ఆయన కృషి వల్లనే ఆర్‌ఈసీ, కాకతీయ మెడికల్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ వంటి సంస్థలు పుట్టాయని ఆర్‌ఈసీ స్వర్ణోత్సవాల సందర్భంగా వెల్లడిస్తే కానీ తెలియని నేపథ్యం. అటువంటిది ఇప్పుడు వజ్రోత్సవాల సందర్భంగా కూడా ఆర్‌ఈసీ తొలితరం విద్యార్థులు ఆయనను మననం చేసుకుంటున్నారు. అంతేకాదు అప్పుడు ఆర్‌ఈసీలో చేరేందుకు యోగ్యత ఉందా లేదా అన్న విషయాలను పరిశీలించే అడ్మిషన్‌ ఫాంలో ‘సైకిల్‌..రెండు తాళం చెవిలు’ ఉంటేను ఫాం ఇచ్చేవాళ్లట. అదేమిటి అంటే సైకిల్‌ అప్పుడు నెస్సెసిటీ. కారణం అక్కడెక్కడో లేబర్‌ కాలనీలో ఉండే హాస్టల్‌ నుంచి కాలేజీకి రావటానికి సైకిలే వారధి. అప్పటి వరంగల్‌కు ఇప్పటి వరకు నడుమ తమ వయస్సు పెరిగినట్టే మార్పులు జరిగిపోయాయి అని వాళ్లు పేర్కొంటున్నారు. నిట్‌ అలియాస్‌ ఆర్‌ఈసీగా రూపాంతరం చెంది అరవై ఏళ్లు. వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా అలనాటి విద్యార్థులుగా ఉన్న వారిని పలకరిస్తే అప్పటి సంగతులు వారి మనోఫలకం నుంచి ఆవిష్కరించారు. వారేమన్నారో వారి మాటల్లోనే..

మారని విద్యార్థులు
ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సొంతింటికి వచ్చినట్లే ఉంటుంది. ఈ ఒక్క పదం చాలు.. ఆర్‌ఈసీ అంటే వారికి ఎంత అభిమానమో చెప్పడానికి. ఎక్కడో పుట్టి, ఇక్కడే కలిసి చదివి ఎక్కడికీ వెళ్లిపోలేదు.. జ్ఞాపకాలు వెంట తీసుకెళ్లి నవ యువకులుగానే మళ్లీ వచ్చామని చెబుతున్నారు. ఈ అరవై ఏళ్లలో ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కళాశాల(ఆర్‌ఈసీ) నిట్‌గా మారింది. కానీ విద్యార్థులు మారలేదు. నిట్‌ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మొదటి తరం బ్యాచ్‌ విద్యార్థులు పూర్వపు విద్యార్థులుగా సందడి చేస్తున్నారు. వారి అనుభవాల కలబోతతో నిట్‌లో ఆర్‌ఈసీ రోజులు కనిపిస్తున్నాయి. ఉన్నతస్థాయికి ఎదిగి కార్పొరేట్‌ రంగంలో, ప్రభుత్వ అధికారులుగా గొప్పస్థాయిలో ఉన్నవారు సైతం సహచరులతో కలివిడిగా ఉన్నారు. కలిసి అనుభవాలు పంచుకున్నారు.

సైకిల్‌...తాళం ఉంటేనే అడ్మిషన్‌ ఫాం పూర్తి
ఆర్‌ఈసీలో చేరాలంటే ముందు అడ్మిషన్‌ ఫాం పూర్తి చేయాలి. అందులో సొంతంగా సైకిల్‌, రెండు తాళం చెవులు ఉండాలనే నిబంధన కూడా ఉంది. కొత్తగా ఏర్పడిన ఇంజినీరింగ్‌ కాలేజీ కాబట్టి హాస్టల్‌ ఒక దగ్గర, కాలేజీ మరో దగ్గర ఉండటంతో సైకిల్‌ తప్పనిసరి అని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ తక్కువ. సైకిల్‌ ఎక్కువగా వాడేవాళ్లు. మేము ప్రతిరోజూ లేబర్‌ కాలనీలో ఉండే రేకుల షెడ్‌ హాస్టల్‌ నుంచి ములుగు రోడ్‌లోని పాలిటెక్నిక్‌ కాలేజీలోని తరగతులకు సైకిల్‌పైనే వెళ్లేవాళ్లం. మా బ్యాచ్‌లో మొత్తం 90 మంది విద్యార్థులం. హన్మకొండ, వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో తిరిగేవాళ్లం. అన్ని బ్యాచ్‌లు కలిపి 750 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. తక్కువ వసతులు ఉన్నా.. ఆర్‌ఈసీ అన్నీ నేర్పింది. చదువు పూర్తి కాగానే ఎలాంటి దరఖాస్తు చేయకుండానే 1964లోనే నాగార్జున సాగర్‌ డ్యాంకు అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా జాయిన్‌ చేసుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ చీఫ్‌ ఇంజినీర్‌గా పదవీ విరయణ చేశాను. నాశ్రీమతి పద్మావతితో కలిసి పూర్వ విద్యార్థిగా ఇక్కడి మూడుసార్లు వచ్చాను. ఆర్‌ఈసీకి రావాలనే ఉత్సాహమే వయస్సును తగ్గించేస్తుంది.
-కే వెంకటేశ్వర్‌ రావు,రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌,ఏపీ

ప్రపంచంలో అత్యున్నత ప్రాజెక్టు కాళేశ్వరం...
ప్రపంచంలోనే అనేక ప్రత్యేకతలు ఉన్న అత్యున్నత ప్రాజెక్ట్‌ కాళేశ్వరం అని కాళేశ్వరం ఇంజినీరింగ్‌ చీఫ్‌ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. నిట్‌లో జరుగుతున్న 60 ఏళ్ల పూర్వ విద్యార్థుల వేడుకలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వివరాలు తెలుసుకోవడానికి కాళేశ్వరం ఇంజినీరింగ్‌ చీఫ్‌ను నిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌లో పూర్వ విద్యార్థుల కోసం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. లింక్‌-1లో భాగంగా గోదావరి నీటిని రివర్స్‌ పంపింగ్‌ చేయడం ప్రపంచంలో మెదటి ప్రక్రియ అని చెప్పారు. లింక్‌-2 ద్వారా లిఫ్టింగ్‌ పద్ధతిలో నీటిని పంపింగ్‌ చేయడం అత్యంత సాహసోపేతమై,అద్భుతమై ప్రక్రియగా తన ప్రజెంటేషన్‌లో వివరించారు. గొప్ప విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలను ఆచరణలో పెట్టడం ద్వారా కాళేశ్వరం గురించి ప్రపంచం ఆసక్తిగా చూసిందని అన్నారు. తెలంగాణలోని 45లక్షల ఎకరాలకు నీరందించే లైఫ్‌లైన్‌ ప్రాజెక్ట్‌ అని తెలిపారు. రాష్ట్రంలో 70శాతానికి పైగా ప్రజలకు సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌గా ఆయన అభివర్ణించారు.
-నల్లా వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఇంజినీరింగ్‌ చీఫ్‌

మనుషులను తయారు చేసింది..
ఆర్‌ఈసీ పరిపూర్ణమైన మనుషులను తయారు చేసింది.1982-86 మెకానికల్‌ బ్యాచ్‌ విద్యార్థిగా ఉన్న నాకు ప్రాంతీయ ఇంజినీరింగ్‌ కళాశాల(ఆర్‌ఈసీ) మినీ ఇండియాగా కనిపించింది. అప్పుడు ఇంజిరింగ్‌ కళాశాలలు ఎక్కువగా లేవు కాబట్టి ఆల్‌ఇండియా నుంచి విద్యార్థులు ఇక్కడ చదివేవారు. దానితో వారి సంస్కృతీసంప్రదాయాలతో మమేకం కావడం గొప్ప అనుభూతినిచ్చింది. మా అధ్యాపకుల సహచర్యంలో అనేక విలువైన పాఠాలు నేర్చుకున్నాం. ఈ తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి పూర్వ విద్యార్థులుగా మా వంతు సహకారం చేస్తున్నాం. నిట్‌ను అంతర్జాతీయ స్థాయిలో చూడాలంటే మంచి రీసెర్చ్‌,స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఉండాలి. కావాల్సిన ఫండింగ్‌ అందజేస్తూ కొత్త ఆవిష్కరణలకు చేసేలా ప్రణాళికలు తీర్చిదిద్దాలనే ప్రయత్నం ఈ కలయిక ద్వారా నేరవేరాలని ఆశిస్తున్నా.
-లక్ష్మీనారాయణ, సీబీఐ జాయింట్‌ మాజీ డైరెక్టర్‌

లేబర్‌ కాలనీలో ఆర్‌ఈసీ హాస్టల్‌...
ఆర్‌ఈసీ మొదటి బ్యాచ్‌ 1959లో ప్రారంభమైనప్పుడు ఇక్కడ ఎలాంటి వసతులు ఉండేవి కావు. వరంగల్‌లోని లేబర్‌ కాలనీలో ఆర్‌ఈసీ హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. చిన్న ఇంటిలో మమ్మల్ని ఉంచి పాలిటెక్నిక్‌ కళాశాలలో తరగతులు నిర్వహించేవారు. లేబర్‌ కాలనీ నుంచి సైకిల్‌పై వచ్చి పాఠాలు వినడం దినచర్యగా ఉండేది. అక్కడక్కడా విసిరేసినట్లుగా ఉండే నగరం. అజంజాహీ మిల్స్‌, కాలేజీ వాతావరణం అప్పుడు మాకు తెలిసిన నగరం. 1963లో ఆర్‌ఈసీలో ఒక భవనం నిర్మించారు. అప్పుడు ఇక్కడికి వచ్చాక క్రికెట్‌, హాకీ, అథ్లెటిక్స్‌ ఆడటం దినచర్యగా ఉండేది. 60 సంవత్సరాల క్రితం రోజులను ఇప్పటికీ పోల్చి చూడలేం. నగరం పెరిగింది.., జనం పెరిగారు.., కాలుష్యమూ పెరిగింది. మార్పును కాదనలేం కాబట్టి 60 ఏళ్ల తర్వాత మా కాలేజీని ఇలా చూస్తుడటం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.
- ఎస్‌ సంపత్‌ అయ్యంగార్‌, ఎండీ, తాల్‌ ఎయిడ్స్‌ ప్రై.లి. చెన్నై

రూ.50 కోట్లతో ఆధునిక కన్వెన్షన్‌ సెంటర్‌....
నిట్‌లో రూ.50 కోట్లతో ఆధునిక కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించడానికి నమూనా కూడా సిద్ధం చేసినట్లు నిట్‌ అలుమ్నీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అరవింద్‌ జౌహారి తెలిపారు. నిట్‌ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. తమను తీర్చిదిద్దిన కాలేజీని అత్యున్నత స్థాయిలో చూడాలనే సంకల్పంతో అలుమ్నీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 1979లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజినీరింగ్‌(ఈసీఈ) పూర్తి చేసి ఢిల్లీలో సొంతంగా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నిర్వహిస్తున్న అరవింద్‌ జౌహారి వారి డ్రీమ్‌ పాజెక్ట్‌ నమూనాను నిట్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన పూర్వ విద్యార్థులుగా నిట్‌కు సహాయం చేయడం మా బాధ్యత అన్నారు. అలుమ్నీ కన్వెన్షన్‌ సెంటర్‌లో అంతర్జాతీయ స్థాయిలో అన్ని వసతులు ఉండేలా నిర్మిస్తామని తెలిపారు. వరంగల్‌లో చదువుకునే రోజుల్లో గంట ప్రయాణానికి రిక్షాకు 25పైసలు ఇచ్చేవాళ్లం. నా సహచరుడు ఎస్‌కే శర్మ (లేట్‌) ప్రతి నెలా హైదరాబాద్‌లో వారింటికి సైకిల్‌పై వెళ్లి వచ్చేవాడు. ఆ విలువైన రోజులు, పరిస్థితులు, పట్టుదల మమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాయి. మంచి స్థాయిని, సమాజంలో గౌరవాన్ని అందించిన మా ఆర్‌ఈసీకి ఎంత చేసినా తక్కువే. 1982 బ్యాచ్‌ విద్యార్థి దుబాయ్‌లో జెమినీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అధినేతగా ఉండి వారి కుటుంబ సభ్యుల ద్వారా కోటి రూపాయలను అందజేశారు. గతంలో ఎంవీ శాస్త్రి ఇన్నోవేషన్‌ సెంటర్‌ నిర్మాణంలో గొప్ప సహకారాన్ని అందించారు. ఢిల్లీ చాప్టర్‌ పూర్వవిద్యార్థులు ఈ-రిక్షాలు, 1986 బ్యాచ్‌ విద్యార్థులు అంబులెన్స్‌ అందించారని తెలిపారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...