హన్మకొండ చౌరస్తాలో పూల దుకాణాలు దహన


Mon,October 7, 2019 03:53 AM

రెడ్డికాలనీ, అక్టోబర్ 06: పూల పండుగ రోజు పూల వ్యాపారుల్లో విషాదాన్ని నింపింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ముందుగానే తీసుకొచ్చిన పూలు కాలిపోవడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. పూల దుకాణాలకు కేంద్రంగా నిలిచిన హన్మకొండ చౌరస్తాలో సుమారు ఏడు షాపుల వరకు దహనం కావడంతో లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లింది. స్థానికులు, బాధితులు ఇబ్రహీం, అబ్దుల్‌అలీ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు హన్మకొండ చౌరస్తాలోని పూల దుకాణాలను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేసినట్లు తెలిపారు. ముఖానికి ముస్కు వేసుకుని పెట్రోల్‌తో సైకిల్ టైర్లు కాల్చి పూల దుకాణాలను అంటించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం వరంగల్‌కు వెళ్తున్న స్థానిక చిరువ్యాపారులు గమనించి వెంటనే అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే మంటలార్పారు. అప్పటికే సుమారు ఏడు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా విజయవాడ, రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన పూలు మొత్తం కాలిపోయాయి. పక్కనే ఉన్న రెండు ఏటీఎంలు, షాపుల బోర్డులు సైతం కాలిపోయాయి. విషయం తెలుసుకున్న దుకాణాల యజమానులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కావాలనే కొందరు దుకాణాలను కాల్చి వేశారని చెప్పారు. ఈ విషయమై హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు ఇబ్రహీం, అబ్దుల్‌అలీ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది రాకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది.

బాధితులను పరామర్శించిన చీఫ్ విప్ వినయ్‌భాస్కర్
కాలిపోయిన హన్మకొండ చౌరస్తాలోని పూల దుకాణాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులను పరామర్శించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా ఉండి ఆదుకుంటానన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు పులి రజినీకాంత్, జానీ పాషా, మున్నీర్, తులా రమేశ్, వ్యాపారులు పాల్గొన్నారు.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...