అపరభగీరథుడు సీఎం కేసీఆర్


Sat,October 5, 2019 04:13 AM

-రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
-వేయిస్తంభాల గుడి, భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు

రెడ్డికాలనీ, అక్టోబర్ 4: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి సీఎం కేసీఆర్ అపరభగీరథుడయ్యారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయాన్ని శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ స్వాగతం పలికారు. రుద్రేశ్వరస్వామి సన్నిధిలో అర్చనలు నిర్వహించి, రుద్రేశ్వరదేవి సన్నిధిలో మహాలక్ష్మీ నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో పట్టువస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మూడు సంవత్సరాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొని, లక్షలాది ఎకరాలకు సాగు, తాగు నీరు సమస్య లేకుండా దృఢసంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారన్నారు. అర్చక సంక్షేమ, బ్రాహ్మణ సంక్షేమానికి నిధులు కేటాయించడమే కాకుండా, దేశంలో గతంలోఎవరూ చేయనివిధంగా ప్రభుత్వం అన్ని వర్గాలకు, అన్ని మతాలకు చేయూతనిస్తుందన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల మాదిరిగా తెలంగాణ సస్యశామలం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పూజారులకు నెలకు రూ.6 వేల వేతనం అందిస్తున్నారని, పెద్ద దేవాలయాల్లోని అర్చకులకు, సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్న మంత్రి, ఈ ఆలయాభివృద్ధికి నిధుల కేటాయింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అడ్డుగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ, రామప్ప, వేయిస్తంభాల అభివృద్ధి విషయంలో ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని వివరించారు. కాగా, చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరో రోజు షష్ఠితిథి మహాలక్ష్మీకి ప్రీతికరమైన శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ మాత అలంకరణలో ఉన్న అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహించారు. సాయంత్రం విధాత్రి మ్యూజికల్ అకాడమీ రాధిక శిష్యబృందంచే కర్ణాటక సంగీత గాత్ర కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నరసింహులు, స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, చీకటి ఆనంద్, నలుబోలు సతీశ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కోన శ్రీకర్, సీనియర్ న్యాయవాది జనార్దన్‌గౌడ్, పులి రజినీకాంత్ పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...