అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం


Fri,October 4, 2019 03:04 AM

-పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక దృష్టిసారించాలి
-సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
-నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాలి
-జెడ్పీ సర్వసభ్య సమావేశంలోచైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్
-పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య,వివిధ శాఖల అధికారులు
-డ్యూటీకి డుమ్మాకొడుతున్నవైద్యాధికారులపై సభ్యుల ఆగ్రహం

సుబేదారి,అక్టోబర్ 03: ప్రతీ గ్రామం పరిశుభ్రత.., పచ్చదనంతో ఉట్టిపడాలన్నదే సీఎం కేసీఆర్ తపన. అందుకోసమే 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు అని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారపెల్లి సుధీర్‌కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ పునర్విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా జెడ్పీ మొదటి సర్వసభ్య సమావేశం చైర్మన్ సుధీర్‌కుమార్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఇందులో వ్యవసాయం, అటవీ శాఖ, విద్య, వైద్యారోగ్య, డీఆర్డీఏ, మిషన్ భగీరథ, షెడ్యూల్డ్ కులాల సేవ సహకార, ఇతర శాఖల పనుల పురోగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని, పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. హరితహారం చర్చ సందర్భంగా ఇళ్లలో నాటే మొక్కల్లో ఎక్కువగా పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలని సభ్యులు అటవీ శాఖ అధికారికి సూచించారు. కమలాపూర్ కస్తూర్బా స్కూల్‌లో మరుగుదొడ్లు, నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మరికొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారంటూ సభ్యులు జిల్లా విద్యా అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

హరిత జిల్లాగా మార్చాలి..
శాఖల వారీగా చర్చ అనంతరం జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో జిల్లాను నంబర్‌వన్‌గా ఉంచాలన్నారు. ఇందుకూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఈ సీజన్‌లో హరితహారం పథకం ద్వారా 121 నర్సరీల ద్వారా జిల్లావ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఎల్కతుర్తిలో కాకతీయ వన విహార్ పేరుతో 43 హెక్టార్లలో రూ.1.47 కోట్లతో ఆకర్శణీయమైన పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే రాంపూర్‌లో రూ.2.77 కోట్లతో 20 ఎకరాల్లో కాకతీయ నందన వనం పేరుతో స్మృతివనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో అంతరించిపోయిన అటవీ సంపదను తిరిగి తీసుకురావడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా హరితహారం పేరుతో మొ క్కలు నాటే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యాచరణతో ప్రతీ గ్రామం స్వచ్ఛ గ్రామంగా మారాలని, ఇందుకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చే యాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జెడ్పీటీసీలకు, ఎంపీపీ, ఎంపీటీసీలకు, సర్పంచ్, అధికారులు, సిబ్బందికి జెడ్పీ చై ర్మన్ సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా ప్రాథమిక ఆర్యోగ కేంద్రాల వైద్యు లు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. విధు ల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వందశాతం ఫలితాలు వచ్చేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.

యూరియా కొరత లేదు..
మొదట్లో కొంత యూరియా కొరత అనిపించినా.. వెంటనే స్పందించిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో యూరియా సరఫరా చేసిందని జెడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్ చెప్పారు. మార్క్‌ఫెడ్, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కావాల్సిన యూరియాను రైతులకు అందుబాటులో ఉంచిందన్నారు. వచ్చే యాసంగి సీజన్ కోసం ముందుస్తుగానే వ్యవసాయ అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రైతు బంధు పథకం ద్వారా 68,333 మంది రైతులకు సొమ్ము చెల్లించిందని పేర్కొన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇది సీఎం కేసీఆర్ ఘనత అని ఆయన కొనియాడారు. మిషన్ భగీరథ పథకంలో జిల్లాలోని మూడు సెగ్మెట్ల ద్వారా సురక్షిత మంచి నీరు సరఫరా అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఐక్యంగా పని చేస్తూ జిల్లాను అగ్రగామిగా నిలుపాలని కోరారు. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాలని, ఇదే సీఎం ఆకాంక్ష అని, ఇందుకు అనుగణంగా పని చేయాలని జెడ్పీ చైర్మన్ సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో ప్రసునారాణి, డీఆర్డీవో రాము, డీఎఫ్‌వో రామలింగం, వైద్యారోగ్య శాఖ అధికారి హరీశ్‌రాజ్, వ్యవసాయ శాఖ జేడీఏ ఉషారాణి, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...