నిర్లక్ష్యం!


Wed,October 2, 2019 02:43 AM

(వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ)వానాకాలం సీజన్ పంట పెట్టుబడి కోసం రైతులకు కొత్తగా పంట రుణాలు అందజేయడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) నిధులు కేటాయించి నాలుగు నెలలైనా కొత్త పంట రుణాల టార్గెట్‌లో ఇప్పటివరకు మూడో వంతు మాత్రమే రైతులకు పంపిణీ చేశారు. సాంకేతికంగా సోమవారంతో వానాకాలం సీజన్‌కు తెరపడింది. ఇంకా అరవై ఆరు శాతానికి పైగా వానాకాలం పంట రుణాలను రైతులకు అందజేయాల్సి ఉంది. దీంతో సహకార సంఘాల అధికారుల తీరును కొత్త పంట రుణాలు ఆశిస్తున్న రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారు. పెట్టుబడి అవసరం తీరాక పంట రుణాలు ఇస్తే లాభమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 69 పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు రూ.287.11 కోట్ల పంట రుణాలు పంపిణీ చేసేందుకు డీసీసీబీ నిర్ణయించింది. ఇందులో కొత్తగా ఇచ్చే పంట రుణాలు రూ.13.71 కోట్లు. మిగతా రూ.273.40 కోట్లు గతంలో పంట రుణాలు పొందిన రైతులకు ఇచ్చేవి. డీసీసీబీ నిబంధనల ప్రకారం గతంలో తీసుకున్న పంట రుణం తిరిగి చెల్లించిన రైతులకు సహకార సంఘాల అధికారులు వెంటనే రుణం ఇస్తున్నారు. ప్రతీ పీఏసీఎస్ పరిధిలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని పక్కన పెడితే కొత్తగా పంట రుణం కోసం రైతులకు అందజేసే రూ.13.71 కోట్లను గత మే నెలలో డీసీసీబీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 69 పీఏసీఎస్‌లకు కేటాయించింది. నిర్వహణ తీరును పరిగణనలోకి తీసుకుని కొత్త రుణాల కేటాయింపునకు పీఏసీఎస్‌లను మూడు గ్రేడ్లుగా విభజించింది. గ్రేడ్ ఏ పీఏసీఎస్‌కు రూ.23 లక్షలు, గ్రేడ్ బీ పీఏసీఎస్‌కు రూ.19 లక్షలు, గ్రేడ్ సీ పీఏసీఎస్‌కు రూ.15 లక్షల చొప్పున కేటాయించింది. ఆయా పీఏసీఎస్ పరిధిలో సభ్యులైన రైతులకు ఒక్కొక్కరికి రూ.లక్షకు మించకుండా వానాకాలం పంట పెట్టుబడి కోసం కొత్తగా రుణాలు అందజేయాలని సంఘాల నిర్వాహకులను డీసీసీబీ అధికారులు ఆదేశించారు. మొత్తానికి ఎక్కువ మంది రైతులకు కొత్తగా ఈ రుణాలు అందేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు.

- జరుగుతుందేమిటి?
వానాకాలం సీజన్ పంట కోసం కొత్త రుణాలను సెప్టెంబర్ 30వ తేదీలోగా రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 69 పీఏసీఎస్‌ల ద్వారా సోమవారం వరకు రూ.13.71 కోట్ల నుంచి రూ.4.43 కోట్లు మాత్రమే సహకార సంఘాల అధికారులు రైతులకు అందజేశారు. ఇంకా రూ.9.28 కోట్లకుపైగా కొత్త రుణాలను రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. సహకార సంఘాల నుంచి ఇప్పటి వరకు పంట రుణం పొందని రైతుల్లో చాలామంది పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు. పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న చైర్మన్లు, అధికారులను కలుస్తున్నారు. ఎక్కువగా జూన్‌లో పంటల సాగు మొదలు పెట్టినప్పటి నుంచి కొత్త రుణాల కోసం గిరికీలు కొడుతున్నారు. గ్రేడ్ ఏ పీఏసీఎస్ పరిధిలో ఒక్కొకరికి రూ.40 వేల చొప్పున పంట రుణం ఇచ్చినా 57 మంది రైతులకు కొత్తగా రుణం అందుతుంది. వడ్డీ ఏడు శాతమే కావడం వల్ల ఈ పంట రుణం పొందడానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. నిబంధనల ప్రకారం సదరు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు, కరంటు పహణీ, ఇతర పత్రాలు వెంట తీసుకుని పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సహకార సంఘాల అధికారులు వాయిదాలతో కాలం గడిపేస్తున్నారు. పర్సన్ ఇన్‌చార్జిలను అడిగి నిర్ణయం తీసుకుంటామని దాటవేస్తున్నారు. పర్సన్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న ఛైర్మన్లలో కొందరు తమ పీఏసీఎస్‌కు డీసీసీబీ కొత్త పంట రుణాల కోసం కేటాయించిన నిధులను కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుతో తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. కొందరు డైరెక్టర్లు ఇదే యోచనతో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అధికారులు పర్సన్ ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్న కొన్ని పీఏసీఎస్‌ల్లోనూ ఇలాంటి ఒత్తిళ్లే ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారుల్లో కొందరు తమకు అందిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపకపోవడం, వేచి చూసే దోరణి అవలంబిస్తుండడం వంటి కారణాలతో కూడా పీఏసీఎస్‌ల్లో కొత్త పంట రుణాల పంపిణీపై కాలయాపన జరుగుతున్నట్లు తెలిసింది. ఏదేమైనా పెట్టుబడి అవసరమైన సీజన్‌లో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు పంట రుణం ఇవ్వకపోతుండడం విమర్శలకు తావిస్తున్నది. వానాకాలం కొత్త పంట రుణాల పంపిణీలో జాప్యంపై డీసీసీబీ సీఈవోను నమస్తే తెలంగాణ వివరణ కోరగా ఈ నెల 15వ తేదీలోగా వానాకాలం పంటకు సంబంధించిన మొత్తం రూ.13.71 కోట్ల కొత్త రుణాలు రైతులకు పంపిణీ చేయడం పూర్తిచేస్తామని చెప్పారు.

గ్రామాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించండి : కలెక్టర్
చెన్నారావుపేట : గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత అన్నారు. మంగళవారం పాతమగ్ధుంపురం, చెన్నారావుపేట ఎస్సీ కాలనీ, జల్లి గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక పనులను ఆమె పరిశీలించారు. గ్రామాల్లో పనులు ఏవిధంగా చేపట్టారు అని వీధుల్లో తిరుగుతూ చూశారు. పాతమగ్ధుంపురం గ్రామంలో రోడ్డు కిరువైపులా చెత్తాచెదారం, గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నారావుపేట ఎస్సీ కాలనీని సందర్శించి కాలనీలోని సైడ్ డ్రైనేజీలు, రోడ్డుకిరువైపులా ఉన్న చెత్తాచెదారాన్ని చూసి గ్రామ సర్పంచ్, అధికారుల పనితీరు పై విస్మయం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలోని సైడ్ డ్రైనేజీలను శుభ్రం చేయించాలని, అలాగే పేరుకు పోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం అదే కాలనీకి చెందిన మాదాసి కనుకమ్మ తనకు ఉన్న భూమికి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకుంది. దీంతో స్థానిక తహసీల్దార్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం జల్లి గ్రామంలో పర్యటించారు. సైడ్ డ్రైనేజీలు పరిశీలించారు. సైడ్ డ్రైనేజీల్లో మురికి నీళ్లు నిలిచి ఉండడాన్ని చూసి సర్పంచ్, అధికారుల పై మండిపడ్డారు. వెంటనే మురికి నీళ్లు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని, అలాగే కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, మట్టిని శుభ్రం చేయించాలని కోరారు. 30 రోజుల ప్రణాళిక పనుల్లో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, ఎవరూ నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని హెచ్చరించారు.

ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్..
జల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులు, గ్రామ ఫీల్డ్‌అసిస్టెంట్ మర్రి సురేశ్ పనితీరు బాగా లేకపోవడంతో ఎంపీడీవో కొర్ని చందర్‌పై కలెక్టర్ హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల నిర్మాణాల కోసం స్థలాన్ని గుర్తించక పోవడం విషయంలో ఫీల్డ్‌అసిస్టెంట్ సురేశ్ నిర్లక్ష్యం చేస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్‌అసిస్టెంట్, ఎంపీడీవో పై మండి పడ్డారు. పనితీరు మార్చుకోవాలని లేకుంటే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే ఫీల్డ్‌అసిస్టెంట్ సురేశ్‌కు మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక పనుల విషయంలో నిర్లక్ష్యం చేసిన చెన్నారావుపేట సర్పంచ్, పాతమగ్ధుంపురం సర్పంచ్, ఉపసర్పంచ్, చెన్నారావుపేట వార్డు సభ్యుడికి నోటీసులు జారీ చేయాలని డీపీవో నారాయణకు కలెక్టర్ హరిత ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే ఆయన నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖాధికారి, మండల స్పెషలాఫీసర్ పురుషోత్తం, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, ఎంపీపీ బాదావతు విజేందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో చందర్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు కుండె మల్లయ్య, సుంకరి లావణ్య, సాంబయ్య, అంబాల సుధాకర్, ఎంపీవో సురేశ్, ఏవో అనిల్‌కుమార్, ఏపీఎం ఈశ్వరయ్య, చెన్నారావుపేట ఉపసర్పంచ్ కంకల మాధవి, వీఆర్వో ఐలయ్య, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...