కీచక తండ్రి


Fri,September 20, 2019 02:59 AM

-కన్నకూతురుపైనే కన్నేసిన కసాయి
-మూడు నెలలుగా కొనసాగుతున్న ఘాతుకం
-ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు
-పెద్దకూతురు గమనించడంతో వెలుగుచూసిన దుర్మార్గం
-భార్య ఫిర్యాదుతో నిందితుడి అరెస్టు
- పోక్సో, రేప్ కేసులు నమోదు

వరంగల్ క్రైం, సెప్టెంబర్19: పెగుబంధాన్ని మరిచాడో కామంధుడు. వావివరుసలు మరిచి బిడ్డతో వాంఛ తీర్చుకున్నాడా పాపపు తండ్రి. సభ్యసమాజం తలదించుకునేలా కూతురుతో ప్రవర్తించిన ఆ దుర్మార్గుడిపై పోలీసులు పోక్సో, రేప్ కేసులు నమోదు చేశారు. కొంతకాలంగా నగరంలో చిన్నారులపై చోటు చేసుకుంటున్న వరుస లైంగికదాడి ఘటనలు అందరినీ బాధిస్తున్నాయి. చిన్నారి శ్రీహితను అర్ధరాత్రి తల్లిఒడిలో నుంచి తీసుకెళ్లి చిదిమేసి హత్య చేయడం నగరంలోనే కాదు..దేశమంతా కలకలం రేపింది. మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని నిరసనలు మిన్నంటడంతో నిందితునికి కోర్టు మరణశిక్ష విధించింది. ప్రజలు ఆ దుర్మార్గుడి చేష్టలు మరువకముందే సమ్మయ్యనగర్‌లో 9వ తరగతి విద్యార్థినితో ముగ్గురు యువకులు పైశాచికంగా వ్యవహరించి లైంగిక వాంఛను తీర్చుకున్నారు. దీంతో అవమాన భారం భరించలేక చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని అక్కున చేర్చుకొని అండగా నిలబడి వారిలో ధైర్యాన్ని నింపారు. ఈ ఘటనలు కళ్ల ముందు నుంచి చెదరక ముందే తాజాగా ఓ కసాయి తండ్రి బిడ్డను ఛిదిమేశాడు.

వంకర ఆలోచనలతో సభ్యసమాజం ఛీ కొట్టేలా ప్రవర్తించాడు. మాయమాటలతో కన్నబంధంతో కొంతకాలంగా లైంగిక వాంఛను తీర్చుకుంటున్నాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పొలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం కుటుంబ సభ్యులతో హన్మకొండకు వచ్చి సుబేదారిలోని కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ పోషణ కోసం కారు నడుపుతున్నాడు. మూడు నెలలుగా తనలోని మృగాన్ని మేల్కోల్పి ఇంట్లోనే కన్నబిడ్డతో లైంగిక వాంఛను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇద్దరు కూతుళ్లు భార్యతో ఉంటున్న ప్రబుద్ధుడు మాయమాటలతో చిన్న కూతురిని లొంగదీసుకొని ఇంట్లో చెబితే నీతో పాటు మీ అమ్మను, మీ అక్కను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 9 వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల అమ్మాయిపై 3 నెలులగా అఘాయిత్యం చేసుకుంటూ వస్తున్నాడు.

ఆరు రోజుల క్రితం వెలుగులోకి..
కన్నబిడ్డపై రాక్షసుడిలా ప్రవర్తిస్తూ నరకం చూపిస్తున్న విషయం ఆరురోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. చెల్లితో తండ్రి ప్రవర్తిస్తున్న తీరు అక్క కనిపెట్టి తల్లి దృష్టికి తీసుకెళ్లింది. కన్న బిడ్డపై తండ్రి చేసిన అఘాయిత్యాన్ని తట్టుకోలేని తల్లి వారం రోజులుగా భర్తతో గొడవ పడుతూ లోలోపలే కుమిలిపోయింది. చివరికి సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని బుధవారం సాయంత్రమే అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఏసీపీ శ్రీధర్ వివరణ కోరగా నిందితుడిపై పోక్సో, రేప్ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు.

121
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...