మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతిరాథోడ్‌


Tue,September 17, 2019 03:14 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా సత్యవతిరాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు పదవి చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యవతి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడంలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా సీఎం కేసీఆర్ 2019 ఫిబ్రవరి 21న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా సత్యవతిరాథోడ్ పేరును ప్రకటించగా మార్చి 12న ఆమె ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్‌చార్జిగా, అనంతరం మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ ఎన్నిక బాధ్యతను సత్యవతి అప్పగించగా, పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించారు. అలాగే టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నర్సంపేట, పాలకుర్తి నియోజకవర్గాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించి, పార్టీ అప్పగించిన పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారు. అలాగే గత నెలలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలకు ఆమెను ఇన్‌చార్జిగా నియమించారు. పార్టీ బలోపేతంతోపాటు వివిధ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషించిన సత్యవతికి రెండో విడతలో చేసిన మంత్రివర్గ విస్తరణలో సీఎం కేసీఆర్ ఈ నెల 8న ఆమెకు గిరిజన, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. ఎస్టీ, మహిళ, విదేయత అనే మూడు అంశాలు ఆమెకు కలిసొచ్చాయని చెప్పవచ్చు.

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తా..
సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన గిరిజన, మహిళా శిశు సంక్షేమం శాఖను సమర్థవంతంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తాననని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారి గిరిజన మహిళకు మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. మహిళా శిశు సంక్షేమం, గిరిజనుల శాఖను తనకు అప్పగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తను ఈ స్థాయికి రావడానికి సహకరించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే తనకు సహకరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులతో పాటు ముఖ్యంగా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతిరాథోడ్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్‌గౌడ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, బీరెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి, తాళ్లూరి బాబుతోపాటు పలువురు మంత్రికి శుభాకాంక్షలు చెప్పారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...