అభివృద్ధే లక్ష్యం


Sun,September 15, 2019 03:39 AM

-పచ్చదనం, పరిశుభ్రతే ధ్యేయం
-ఆరోగ్యవంతమైన సమాజమే ముఖ్యం
-ప్రతీ గ్రామంలో మొక్కలు పెంచాలి
-వనాలతో పర్యావరణాన్ని పరిరక్షించాలి
-జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్
-కలెక్టర్ పీజే పాటిల్‌తో కలిసి నాగారం, పెంబర్తి గ్రామాల్లో పర్యటన

హసన్‌పర్తి, సెప్టెంబర్ 14: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారని, దీన్ని ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అన్నారు. మండలంలోని పెంబర్తి, నాగారం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలో భాగంగా జెడ్పీ చైర్మన్, కలెక్టర్ హాజరై గ్రామాల్లో మొక్కలు నాటి శ్రమదానం చేశారు. ముందుగా వారు గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలను, డ్రైనేజీ, రోడ్లను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించి విద్యార్థుల లక్ష్యాలను, వారు ఎంచుకున్న లక్ష్యాలను ఎలా అధిగమించాలో వివరించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. నీటి కరువు ఉన్న దేశాల్లో భారతదేశం 13వ స్థానంలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో వానలు సమృద్ధిగా కురవాలంటే వనాలు పెంచాలన్నారు. వానరాలు వనాలకు చేరాలని, పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించాలన్నారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటితో ఎస్సారెస్పీని పునరుజ్జీవింప చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా మన పొలాలకు రెండు పంటలకూ నీరు అందుతుందని తెలిపారు. మన వంతు బాధ్యతగా గ్రామాల అభివృద్ధికి 30 రోజుల ప్రణాళికలో పాల్గొని సహకరించాలని కోరారు.

శ్రమదానం చేసే ప్రతీ వ్యక్తి దాతే..
30 రోజుల ప్రణాళికల అమలుకు శ్రమదానం చేసిన ప్రతీ వ్యక్తిని దాతగా పరిగణించనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ తెలిపారు. సామాజిక భవనాలు, కార్యాలయాల ఆవరణలు రోడ్లు, డ్రైనేజీలు స్వచ్ఛందంగా శ్రమదానంతో శుభ్రం చేసుకోవాలన్నారు. సంపూర్ణ పారిశుధ్య లక్ష్యాలను సాధించేందుకు ప్రతీ ఇంటి నుంచి రోజువారీగా చెత్తను సేకరించి డంపుయార్డుకు తరలించాలని కోరారు. శానిటేషన్ వర్కర్లకు ఇస్తున్న వేతనాన్ని ప్రభుత్వం రూ.8500కు పెంచినట్లు తెలిపారు. కాబట్టి పూర్తిస్థాయిలో పని చేయాలని ఆదేశించారు. సమగ్రంగా విధులు నిర్వహించని శానిటేషన్ వర్కర్లను తొలగించనున్నట్లు హెచ్చరించారు. 30 రోజుల ప్రణాళిక అనంతరం ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో 4 కి.మీ. పొడవున ట్రీగార్డులతో 16 00 మొక్కలు కనిపించాలని స్పష్టం చేశారు.

గ్రామానికి డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక ఉండాలని, వీటి నిర్మాణానికి ఉపాధి హామీలో రూ.11 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్‌ల పర్యవేక్షణలో నిర్మాణ పను లు, నర్సరీల పెంపకం జరగాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దామోదర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ రాజేశ్‌కుమార్, మండల వ్యవసాయాధికారి అనురాధ, ఏపీవో విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు హేమలత, రామ్మూర్తి, సర్పంచ్ జోరిక పూల, ఉపసర్పంచ్ అరుణ్‌కుమార్, జెడ్పీటీసీ రేణికుంట్ల సునిత, ఎంపీపీ కేతపాక సునిత, వైస్ ఎంపీపీ రత్నాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు దీపిక, సుమతి, హెచ్‌ఎం అనురాధ, రెవెన్యూ అధికారులు బోగి, రజిత, వీఆర్‌ఏలు సారంగపాణి, రాజు, నరేశ్, నాయకుడు తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...