బై బై గణేష


Thu,September 12, 2019 03:24 AM

-ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
-నగరంలో వైభవంగా శోభాయాత్రలు
-తీన్మార్ డాన్స్‌లతో యువత జోష్
-అలరించిన కళాకారులు
-గణనాథులకు ఘన స్వాగతాలు
-తెల్లవారుజాము వరకు సాగిన నిమజ్జనం
-వేలాదిగా తరలివచ్చిన జనం
-నిమజ్జనాన్ని ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యేలు, పోలీస్ కమిషనర్

వరంగల్,నమస్తేతెలంగాణ: గణపతి బప్పా మోరియా.. జై జై గణేషా.. జై బోలో గణేషా.. నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం నగరంలో జరిగిన గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం నుంచే మొదలైన గణనాథుల నిమజ్జన ప్రక్రియ తెల్లవారుజాము వరకు సాగింది. గ్రేటర్ పరిధిలోని 10 చెరువుల్లో సుమారు 5 వేలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనం నేపథ్యంలో నగరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొమ్మిది రోజుల పాటు భక్తుల నుంచి పూజలు అందుకున్న గణనాథులు సుందరంగా అలంకరించిన వాహనాలపై అశీనులై శోభాయమానంగా శోభాయాత్రలతో నిమజ్జనానికి తరలివచ్చాయి. కళాకారులు వివిధ వేషధారణతో శోభాయాత్రల్లో అగ్రభాగాన నిలిచారు. మహిళలు కోలాటాలు వేస్తూ నృత్యాలతో దుమ్మురేపారు. డప్పు చప్పుళ్ల మధ్య యువత తీన్మార్ స్టెప్పులతో జోష్ నింపారు.

హన్మకొండ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్‌లో విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసి గణనాథులకు స్వాగతం పలికారు. వేడుకలను తిలకించేందుకు వేలాది ప్రజలు తరలివచ్చారు. అర్ధరాత్రి వరకు ప్రజలు గణనాథులను చూసేందుకు రోడ్లపై బారులుదీరారు. నిమజ్జన ప్రక్రియకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1500 మంది బల్దియా సిబ్బంది నిమజ్జనంలో తమ సేవలు అందించారు. వివిధ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు గణేష్ నిమజ్జనంలో సేవలు అందించారు. భక్తులకు పలలు స్వచ్ఛంద సంస్థల అధ్వర్యంలో తాగునీటి ప్యాకెట్లను అందించారు.

ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యేలు, సీపీ
వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జనాన్ని నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, గ్రేటర్ కమిషనర్ రవికిరణ్ ప్రారంభించారు. అనంతరం సీపీ రవీందర్ గణనాథులకు ప్రత్యేక పూజలు చేసి చెరువులో నిమజ్జనం చేశారు. హన్మకొండ పద్మాక్షి గుండంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు.

ఆకట్టుకున్న శోభాయాత్రలు
గణేష్ నిమజ్జన శోభాయాత్రలు ఆకట్టుకున్నాయి. కిలోమీటర్ల పొడువునా గణనాథుల శోభాయాత్రలు కనిపించాయి. శోభాయాత్రల్లో యువత నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. విద్యుత్‌కాంతులతో శోభాయాత్రలు మెరిసిపోయాయి. భారీ విగ్రహాలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

తెల్లవారుజాము వరకు నిమజ్జనం
తెల్లవారువారుజాము వరకు నగరంలో గణేష్ విగ్రహల నిమజ్జనం కొనసాగింది. మధ్యాహ్నం మొదలైన నిమజ్జన ప్రక్రియ గురువారం తెల్లవారుజామున ముగిసింది. సుమారు 5 వేల విగ్రహలు నిమజ్జనం జరిగినట్లు అధికారుల అంచనా.. ఇంకా నగరంలో చాలా విగ్రహాలు గురువారం నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, ఉర్సు చెరువు, కట్టమల్లన్న చెరువు, గుండు చెరువు, బెస్తం చెరువు, అగడ్తల, పద్మాక్షి గుండం, బంధం చెరువుల్లో నిమజ్జనం చేశారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...