భక్తి ప్రపత్తుల నడుమ మొహర్రం


Wed,September 11, 2019 01:24 AM

-అస్సైదులా నినాదాలతో మార్మోగిన గ్రామాలు
-విషాద గీతాలతో జలాశయాల్లో సవార్ల నిమజ్జనం
రాయపర్తి, సెప్టెంబర్‌ 10 : పవిత్ర మత యుద్ధం కర్బలా మృత వీరుల స్మారకార్థం ప్రతీ ఏడు ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొహర్రం నెలలో చంద్రవంక దర్శనంతో ముస్లింలు ఆనవాయితీగా జరుపుకునే పీరీల పం డుగ మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల్లోని ముస్లింలతో పాటు హిందువులు ఘనంగా జరుపుకున్నారు. హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీరూపంగా చెప్పుకునే మొహర్రం వేడుకల సందర్భంగా తొమ్మిది రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లోని పీరీల కొట్టాలలో ప్రతిష్టించిన భక్తులు, గ్రామస్తుల చేత ప్రత్యేక పూజలందుకున్న పీరీలకు సోమవారం రాత్రి ఉత్సవాల్లో భాగంగా పెచ్చెరుగత్‌ వేడుకల్లో భాగంగా ముస్లిం కుటుంబాలు బెల్లం, పాలతో కొత్త కుండలలో తయారు చేసిన మఠ్కీలను నైవేధ్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంగళవారం తెల్లవారుజామున అందంగా అలంకరించిన పీరీలను ముజావర్లు సన్నాయి మేళాలు, మంగళవాయిద్యాలు, డప్పుదరువుల మోతలు, కాళ్ల గజ్జెల సవ్వడులు, విచిత్ర వేశధారణల నడుమ గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్దకు తీసుకు వచ్చి ఎదుర్కోళ్లు నిర్వహించారు. అనంతరం పీరీలను సావడులలో పడుకోబెట్టి విషాద గీతాలు ఆలపిస్తూ అగ్నిగుండాలను పూడ్చివేశారు. అనంతరం పీరీలను గ్రామాలలో ని వాడవాడకూ తిప్పుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించడంతోపాటు భక్తులు సమర్చించిన ఊదు బెల్లం, కుడుక, దట్టీలను స్వీకరించి రాత్రి పొద్దుపోయాక స్థానిక జలాశయాలలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సంతాన భాగ్యం లేని మహిళలు తడిబట్ట స్నానాలతో వచ్చి వరాలు పట్టిన ఘట్టాలు ప్రజలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. యువత, అన్ని వర్గాల ప్రజలు అస్సైదులా హారతి నినాదాలతో చేసిన నృత్యాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. మండలంలోని రాయపర్తి, కొత్త రాయపర్తి, మైలారం, ఊకల్‌, కాట్రపల్లి, సన్నూరు, పెర్కవేడు, కొండాపురం, కొత్తూరు, మహబూబ్‌నగర్‌ గ్రామాల్లో పీరీల పండుగలు ఘనంగా జరిగాయి. కార్యక్రమాలలో ముజావర్లు మహ్మద్‌ అబ్ధుల్‌ రహామాన్‌, ఖాసీం, అస్గర్‌అలీ, ఉస్మాన్‌, లాలూ మహ్మద్‌ ఉస్మాన్‌, అఫ్సర్‌పాషా, సలీం, అశ్రఫ్‌పాషా, షకీల్‌, అమ్జద్‌పాషా, రఫీ, నాసర్‌, రాజుమహ్మద్‌, మైపాషా, రహీం, మైబెల్లి, యాకూబ్‌పాషా దురిశెట్టి పాపయ్య, బొమ్మగాని యాదగిరి, బొమ్మెర నాథం, శెంగొండ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...