సామాజిక సమన్యాయం


Mon,September 9, 2019 03:09 AM

-ఓరుగల్లు వాకిట గులాబీ పండుగ
-ఇద్దరు మంత్రులు, ఇద్దరు చీఫ్‌విప్‌లు
-త్వరలో మరో ముగ్గురికి సముచిత స్థానం
-మాజీ స్పీకర్‌ సిరికొండ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం, ఎమ్మెల్సీ పల్లాకు త్వరలో తీపి కబురు..?
-ఉద్యమ ఖిల్లాకు అరుదైన అవకాశాలు
-అధినేత మనసునెరిగిన వరంగల్‌
వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌ అన్ని వర్గాలకు అండ. గులాబీ జెండా కింద అందరికీ సముచిత స్థానం. టీఆర్‌ఎస్‌ పార్టీలో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఆది నుంచి పెద్దపీటే. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన జిల్లాల్లో ఓరుగల్లుది అద్వితీయమైన భాగస్వామ్యం. స్వరాష్ట్ర సాధన అనంతరం ఏర్పడిన టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో ఓరుగల్లుకు సముచిత స్థానం దక్కినట్టే మలి ప్రభుత్వంలోనూ ఆ స్థానాన్ని పదిల పరచుకుందనేది అక్షర సత్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగినా అందులో వరంగల్‌ ప్రాతినిధ్యం తప్పనిసరి. పరిమిత సభ్యులతో జరిగిన ప్రమాణ స్వీకారంలో కానీ, మంత్రివర్గ విస్తరణలో కానీ వరంగల్‌ ఉండి తీరాల్సిందే అన్ననానుడికి ఆదివారం నాటి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సత్యవతీరాథోడ్‌ రాష్ట్ర గిరిజన సంక్షేమంతోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డబుల్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపించిన తరుణంలో జిల్లా నుంచి ఆశవాహుల్లో ఆశలు చిగురించాయి. వారి ఆశలకు అనుగుణంగా రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి వారి యోగ్యతలు, వారి సామాజిక నేపథ్యాలను బట్టి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి అవకాశాలున్నచోట వారి వారి సేవల్ని రాష్ర్టాభివృద్ధి కోసం వినియోగిస్తుండడం విశేషం. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులకు కీలక శాఖల్ని కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి మంత్రి వర్గ ప్రమాణ స్వీకారంలో సీనియర్‌ శాసనసభ్యులు, డబుల్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే, ఓటమినెరుగని నాయకుడిగా విశేష ప్రజాదరణ ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అత్యంత కీలకమైన రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి శాఖలను కేటాయించారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ పల్లెపల్లెనా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదివారం డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సత్యవతీ రాథోడ్‌ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ వంటి కీలక శాఖను కేటాయించారు. కాగా, గతంలో గిరిజన సంక్షేమ శాఖను ఇదే డోర్నకల్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ వైఎస్‌ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించగా, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని తొలి మంత్రివర్గంలో ఆజ్మీరా చందూలాల్‌ బాధ్యతలు నిర్వహించారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సత్యవతీ రాథోడ్‌కు ఇదే శాఖతోపాటు అదనంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దక్కడం విశేషం. ఒకవైపు మహిళ, మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం కావడంతో ఆమెను మంత్రివర్గంలో తీసుకున్నారనే అంచనాకు గులాబీ శ్రేణులు వస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ సారధ్యంలోని రెండో దఫా ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్‌ నుంచి ఇద్దరు మంత్రులు, రెండు కీలక శాఖల్ని నిర్వర్తించడం విశేష పరిణామమనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

త్వరలో మురో ముగ్గురికి తీపి కబురు..?
తెలంగాణ ఉద్యమంలో తలమానికమైన పాత్ర పోషించిన వరంగల్‌ అంటే టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ అంటే వరంగల్‌గా ముద్రపడటమే కాకుండా గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన జిల్లాగా ఉమ్మడి వరంగల్‌కు పేరుంది. ఈ నేపథ్యంలో మొద టి నుంచి తనతో నడిచిన నాయకులకు, ఉద్యమ సమయంలోనే కాకుండా అనంతరం ఏర్పాటైన ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన ఇద్దరి ము గ్గురికి త్వరలో తీపి కబురు దక్కే అవకాశాలున్నట్టు ప్రచారం సాగుతున్నది. అయితే అది ప్రచారం కాదు యథార్థమేననే అంశం విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఇప్పటికే ఒక ఓసీ, ఒక మహిళా కమ్‌ గిరిజన వర్గానికి, చీఫ్‌విప్‌ పదవులు ఇద్దరూ బీసీలను వరించిన తరువాత త్వరలో ఇద్దరి ముగ్గురికి అవకాశాలు దక్కబోతున్నాయన్న సంకేతాలు అందుతున్నాయి.
వారిలో తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి (బీసీ)కి, మాజీ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖను నిర్వహించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (ఎస్సీ సామాజిక వర్గం)కి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంతరంగికుల్లో ఒకరిగా పేరున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి త్వరలో సముచిత స్థానం లభించే అవకాశాలున్నాయి. వీరితోపాటు మరికొందరిలో ఆశలు రేకెత్తిస్తున్నది. నిన్నటి దాకా శాసనమండలి విప్‌గా కొనసాగిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి వరించే అవకాశాలున్నాయనే ఊగాహానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 మందికి వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లు ప్రకటించబోతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. ఆ 12 మందిలోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్‌ పదవులు దక్కే అవకాశాలున్నాయని సమాచారం.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...