మోడల్‌ పండ్ల మార్కెట్‌కు అడుగులు


Mon,September 9, 2019 03:05 AM

-రూ.6.33 కోట్లతో నిర్మాణానికి ప్రణాళికలు
-అధునాతన హంగులతో నిర్మాణం..
-మౌలిక వసతులకు ప్రాధాన్యత
-ప్లాన్‌ మార్పుతో అంగీకరించిన వ్యాపారులు
-త్వరలోనే పనులు ప్రారంభం..!
-80 ఏళ్ల గ్రేన్‌ మార్కెట్‌ చరిత్రకు చిహ్నంగా క్లాక్‌ టవర్‌
వరంగల్‌ చౌరస్తా, సెప్టెంబర్‌06: వరంగల్‌ పండ్ల మార్కెట్‌ను మోడల్‌ మార్కెట్‌గా తీర్చిదిద్దడానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ చొరవతో ప్రణాళికలు పట్టాలెక్కుతున్నాయి. గత ఆగస్టు 28న వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు, పండ్ల మార్కెట్‌ వ్యాపారులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మోడల్‌ మార్కెట్‌..అధునాతన హంగులు.. చూడగానే ఆకట్టుకోవాలి..చటుక్కున పండ్ల మార్కెట్‌ అని తెలువాలి.. సరికొత్త ఒరవడిలో నిర్మాణం సాగాలె..అంటూ ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు రైతులతో పాటుగా వ్యాపారుల అవసరాలకు తగిన న్యాయం చేయడానికి మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో మోడ ల్‌ మార్కెట్‌ నిర్మాణాలను ప్రారంభించింది. అందులో భాగంగానే 2016లో మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.6.33 కోట్ల నిధులను మంజూరు చేశారు. వీటితో పండ్ల మార్కెట్‌ను మోడల్‌ మార్కెట్‌గా నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సైతం తయారు చేశారు. అధికారులు సిద్ధం చేసిన నిర్మాణ నమూనాను (ప్లాన్‌) వ్యాపారులు అంగీకరించకపోవడంతో మోడల్‌ నిర్మాణ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. అయితే ఎమ్మెల్యే చొరవతో తిరిగి మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

నూతన హంగులతో...
వరంగల్‌ లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌ నిర్మాణం కోసం అధునాతన హంగులు జోడించి ఆకర్షణీయమైన నమూనాను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట మోడల్‌ మార్కెట్‌ను, వరంగల్‌ రైల్వేస్టేషన్‌ శివనగర్‌ వైపున చేసిన నిర్మాణం మాదిరిగా ఉండేలా నమూనాను తయారు చేయాలని ఆదేశించారు. మార్కెట్‌ను చూసిన వెంటనే మోడల్‌ పండ్ల మార్కెట్‌ అనే విషయం కొట్టొచ్చినట్లు కనబడాలని సూచించారు. మోడల్‌ మార్కెట్‌కు అవసరమైన విస్తీర్ణం కోసం పాత మార్కెట్‌ క్లాక్‌ టవర్‌కు ఉత్తరం వైపున ఉన్న స్థలాన్ని కలుపుకొని నమూనా తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నిర్మించే మోడల్‌ మార్కెట్‌లో రైతులకు, వ్యాపారులకు అవసరమైన వేబ్రిడ్జి నిర్మాణంతో పాటుగా రైతులకు, హమాలీ కార్మికులకు విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని అన్నారు. మౌలిక వసతులకు ఎలాంటి లోటు లేకుండా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.

దశల వారీగా పనులు
మోడల్‌ మార్కెట్‌ నిర్మాణాన్ని రెండు దశలుగా పూర్తి చేయడానికి కార్యాచరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా మొదట మోడల్‌ కూరగాయల మార్కెట్‌ ప్రారంభోత్సవం అనంతరం ఒక వైపున నిర్మాణాలను ప్రారంభించడానికి వ్యాపారులకు కూరగాయల మార్కెట్‌ ఆవరణలో తాత్కాలికంగా షాపులను కేటాయించనున్నారు. మెదటి విడత పనులు పూర్తికాగానే రెండో దశ పనులను అదే విధంగా పూర్తి చేయాలని అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. మార్కెట్‌ నిర్మాణ ప్రక్రియకు, సీజన్‌లో వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ముందు కమర్షియల్‌..,
లోపల మార్కెట్‌..
మార్కెట్‌ సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా రోడ్డు మార్గం వైపు మార్కెట్‌ వ్యాపారులకు సంబంధం లేకుండా షాపుల నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటుగా మార్కెట్‌ లోపలివైపున వ్యాపారుల అవసరాలకు తగిన విధంగా విశాలంగా సుమారు 60కి పైగా షాపులు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటుగా స్థల పరిశీలన అనంతరం చిల్లర అమ్మకాలు సాగించే వారి కోసం ప్లాట్‌ ఫాంల నిర్మాణానికి సైతం చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
అన్నపూర్ణ భోజన కేంద్రం..
వరంగల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు రూపాయల అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని మోడల్‌ మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటు చేస్తే రైతులకు, వ్యాపారులకు, గుమస్తా, హమాలీ కార్మికుల ఆకలి తీర్చినట్లవుతుందని ఎమ్మెల్యే నరేందర్‌ అధికారులకు తెలియజేశారు. అందుకు అవసరమైన చర్యలు ముందుగానే చేపట్టాలని ఆదేశించారు. మోడల్‌ మార్కెట్‌లో భాగంగానే అన్నపూర్ణ భోజన కేంద్రానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు తగిన విధంగా నిర్మాణం సైతం చేయాలని సూచించారు.

గ్రేన్‌ మార్కెట్‌కు చిహ్నంగా క్లాక్‌ టవర్‌
వరంగల్‌ నగరంలో వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు చేసిన నాటి నుంచి వరంగల్‌ గ్రేన్‌ మార్కెట్‌కు చిహ్నంగా నిలిచిన క్లాక్‌ టవర్‌కు మరమ్మతులు నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. సుమారు 80 ఏళ్ల మార్కెట్‌ చరిత్రకు చిహ్నంగా నిలిచిన క్లాక్‌ టవర్‌కు మరమ్మతు చేసి తిరిగి గడియారాన్ని ఏర్పాటు చేయనున్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...