అంగన్‌వాడీల్లో ఆంగ్ల పాఠాలు


Mon,August 26, 2019 02:46 AM

-కార్పొరేట్‌కు దీటుగా బోధన
-టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు

అర్బన్ కలెక్టరేట్, ఆగస్టు 25: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్ల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది. కేంద్రాల్లోని పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆటాపాటలతో విద్యను అందించేలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేస్తుండగా తాజాగా ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా ఆంగ్ల మాద్యమంలో ఎల్‌కేజీ, యూకేజీ సిలబస్ రూపొందించి బోధన చేయనున్నారు. ఆంగ్ల అక్షరాలు, రయీమ్స్, ఇతరత్రా పదాలు లాంటివి నేర్పిస్తారు. ఇందుకుగాను ఇప్పటికే జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. వివిధ దేశాలు, ఇతర రాష్ర్టాలు అందిస్తున్న పాఠ్యప్రణాళికలను పరిశీలించి పూర్వ ప్రాథమిక విద్యలో నిష్ణాతులైన ఈ.సీ.ఈ,ఎస్,ఆర్‌సీ, దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ సభ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సిలబస్‌ను రూపొందించినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఆరు నెలల నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు లబ్ధి పొందుతుంటారు.

మూడు ప్రాజెక్టులు
వరంగల్ అర్బన్ జిల్లాలో మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. హన్మకొండ అర్బన్, వరంగల్ అర్బన్, భీమదేవరపల్లి మూడు ప్రాజెక్టుల పరిధిలో 772 మేయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు, 27 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కలిపి మొత్తం 779 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అదే విధంగా 3 ఏళ్ల నుంచి 6 సంవత్సరాల లోపు 9206 మంది నమోదు చేసుకోగా 6625 మంది లబ్ధి పొందుతున్నారు.

కార్పొరేట్‌కు ధీటుగా బోధన
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలుకు స్వీకారం చుట్టింది. పిల్లల తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేసినప్పటికీ ఆంగ్ల మాద్యమంపై ఉన్న మక్కువతో ప్రైవేట్‌కు పంపిస్తున్నారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కారు నూతన విధానంకు స్వీకారం చుట్టింది. ఎల్‌కేజీ, యూకేజీ సిలబస్‌తో పాటు వివిధ కృత్యాలతో అనుసంధానం చేస్తూ 3 నుంచి 4 సంవత్సరాల పిల్లల విషయంలో పరిజ్ఞానం, సృజనాత్మకతను పెంపొందించేటట్లు చేస్తే వీరు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతారని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నూతన విధానంతో క్రమ శిక్షణ పెంచడమే కాకుండా పోషకాహారం, పరిశుభ్రత అంశాల్లో కూడా అవగాహన కల్పిస్తారు.

చిన్నారులకు సామర్థ్య పరీక్షలు
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు విద్యలో భాగంగా సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. వారి వారి సామర్థ్యాల ఆధారంగా నివేదికలు రూపొందించనున్నారు. ఇందులో భాగంగా చిన్నారులు కనబరిచే ప్రతిభను మూడు విధాలుగా గుర్తించడం జరుగుతుందని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. విషయంపై పూర్తిగా స్పందించకపోతే ఒక స్టార్, టీచర్‌గాని, ఇతరుల సహాయం తీసుకుంటే రెం డు స్టార్లు, చిన్నారే స్వతంత్రంగా రాస్తే మూడు స్టార్లు కేటాయించనున్నారు.

టీచర్లకు శిక్షణ
తాజాగా ప్రారంభించిన ఆంగ్ల మాద్యమం సిలబస్‌పై టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఆయా ప్రాజెక్టుల పరిస్థితులను బట్టి శిక్షణ షెడ్యూల్‌ను రూపొందించారు. ఆయా మండలాల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక నిపుణులచే శిక్షణ ఇప్పిస్తున్నారు. దీంతో పిల్లల సమగ్ర, సర్వతో ముఖాభివృద్దికి తోడ్పాడు రావడంతో పాటు వారిని మానసికంగా, శారీరకంగా, సామాజికంగా బలపర్చి సంపూర్ణ ఆరోగ్యకర వ్యక్తిత్వాన్ని అందించేందుకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...